జాతీయ పార్టీల హవాను దెబ్బతీసిన ఎన్నికలు

Pentapati Pullarao Article On Present Situation On National Parties - Sakshi

ప్రతిపక్షాలకు సంబంధించి సమానులలో ప్రథముడిగా నిలబడాలని ఆశించిన రాహుల్‌ గాంధీని కర్ణాటక ఎన్నికలు సమానులలో ఒకడిగా దిగజార్చివేశాయి. అలాగే, మోదీ ప్రతిష్ట కూడా మసకబారింది. సంక్లిష్ట సందర్భాల్లో ఎన్నికలు ఊహించని వారికే అధికారాన్ని అప్పగిస్తుంటాయి. పూర్వకాలంలో వధువు స్వయంవరంలో అనేకమందిని చూసి తన కాబోయే వరుడిని ఆశ్చర్యకరమైన రీతిలో ఎంపిక చేసుకునేది. ప్రస్తుతం భారత రాజకీయాల్లో అనేకమంది వరులు కనిపిస్తున్నప్పటికీ అనేక దిగ్భ్రాంతికరమైన ఘటనలు జరుగు తున్నాయి. ఈ పరిస్థితి రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోదీల ఆశలకు, ఆకాంక్షలకు చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఊహించనివారికి ప్రతిఫలం లభించే అవకాశం ఉంది మరి!

దాదాపు 2,500 సంవత్సరాల క్రితం చైనా మేటి సైనికాధిపతి సన్‌ జు, విజయం సాధించలేని యుద్ధాల్లోకి దిగడంపై హెచ్చరించాడు. యుద్ధ ఫలితాలను ముందుగానే అంచనా వేయడం కాదు కాబట్టి, స్వీయ నష్టాలు ఎక్కువగా ఉండే యుద్ధాల్లోకి మంచి అవకాశాలు ఉంటే తప్ప దిగకూడదని పేర్కొన్నాడు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేక పార్టీలను పరీక్షకు పెట్టాయి. 

నిస్సందేహంగా, కర్ణాటక ఎన్నికల్లో అత్యంత అదృష్టవంతులైన నేతలు ఎవరంటే, 225 మంది ఎమ్మెల్యేలలో 37 మంది ఎమ్మెల్యేలను మాత్రమే కలిగిన దేవెగౌడ కుటుం బమే అని చెప్పాలి. ఈ కుటుంబంలోని ప్రతి సభ్యుడూ అటు రాజ కీయనేతగానూ, ఇటు పారిశ్రామికవేత్తగానూ ఉంటున్నారు. వీళ్లంతా ఇప్పుడు మేటి లాభం పొందారు. 86 ఏళ్ల వయసులో ఉన్న దేవెగౌడకు తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చూసుకునే అదృష్టం దక్కింది. ఆయన బద్ధశత్రువు సిద్ధరామయ్య పూర్తిగా దెబ్బతినిపోయారు. కర్ణాటక శాసనసభలోని మొత్తం 226 సీట్లలో దేవెగౌడ పార్టీ 175 స్థానాల్లో ధరావతు కోల్పోయినా, గెలిచిన 37 స్థానాలతోనే మహద్భాగ్యాన్ని దక్కించుకోవడం విశేషం. దేవెగౌడ ఎంత అదృష్టవంతుడంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాకముందే కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ని కలిసి మద్దతు ప్రకటించింది. బీజేపీ పూనుకోకముందే కాంగ్రెస్‌ శరవేగంగా పావులు కదిపి బేషరతుగా జేడీఎస్‌కి మద్దతు తెలిపింది.

ఇతర రాజకీయనేతలు ఈ ఎన్నికల్లో ప్రయోజనం పొంది ఉండవచ్చు లేక నష్టపోయి ఉండవచ్చు. కానీ రాహుల్‌ గాంధీ ఉదంతం మరింత ఆసక్తికరంగా ఉంది. కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో తన ప్రతిష్టను పెంచుతాయని దేశంలోనే తనను అగ్రనేతగా నిలుపుతాయని రాహుల్‌ భావించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని, తనకే పూర్తిగా ప్రతిష్ట చేకూరుతుందని భావించిన రాహుల్‌ పూర్తి ప్రచారంలో మునిగిపోయారు. ఇంతవరకు కాంగ్రెస్‌ అధ్యక్షులెవరూ రోడ్‌ షోల్లో ఎన్నడూ పాల్గొన్నది లేదు. ఎన్నికల ప్రచారంలో రోడ్‌ షోలకు అత్యల్ప స్థాయి ఉంది. బహిరంగ సభలు అత్యున్నత స్థాయి ప్రచారంగా అంచనా వేస్తుంటారు. 

కాంగ్రెస్‌ పార్టీ మేధావులు, మీడియా సలహాదార్లు, వివిధ ఎన్నికల వ్యూహ సంస్థలు కలిసి ఈ తరహా డిజైన్‌ని రూపొందించారు. దీంతో అతి విశ్వాసానికి పోయిన రాహుల్‌ బెంగళూరులో జరిగిన ఒక ఎన్నికల సభలో 2019లో తానే ప్రధాని పదవికి అభ్యర్థినని ప్రకటించేశారు. బీజేపీని ఓడించే కీర్తిని పూర్తిగా తానే తీసుకోవాలని రాహుల్‌ ఆశించారు. అందుకే మీడియాలో బీజేపీపై పరుష వాక్యాలతో దాడికి దిగారు. ఈ దాడులు నిజానికి ప్రతిదాడికి తావిచ్చాయి. విజయం సాధిస్తే ఇలాంటి దాడులను పెద్దగా లెక్కించరు. కాని అనుద్దేశపూర్వక పర్యవసానాల సూత్రం అన్ని వేళలా పనిచేస్తుంటుంది. కర్ణాటకలో అలాంటి పర్యవసానం దేవెగౌడ పక్షాన నిలిచింది. విజయఫలాలు దక్కని రాహుల్‌ తన ప్రతిష్టను కోల్పోయారు.

ఓడిపోవడం అంటే సమస్తమూ కోల్పోయినట్లేనా అని పాఠకులు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ విజయం దక్కుతుం దని పూర్తిగా ఆశించినప్పటికీ పరాజయం పొందిన క్షణాల్లో ఆ ఓటమి చాలా విలువైనది. మే 15న, కుమారస్వామి కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు డజనుకుపైగా ప్రతిపక్ష నేతలు వేదికపై దర్శనమిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపొంది, ప్రభుత్వాన్ని ఏర్పర్చి ఉంటే ఈ నేతల్లో ఏ ఒక్కరూ వేదికపై కనిపించేవారే కాదు. బీజేపీయేతర పార్టీల నేతలు ఆ వేదికపై పూర్తి ఆధిక్యత ప్రదర్శించారంటేనే కర్ణాటకలో సంపూర్ణ విజయాన్ని ఆశించిన కాంగ్రెస్‌ తన వైభవాన్ని, స్థాయిని కోల్పోయినట్లేనని అర్థం.

మరీ ముఖ్యంగా కర్ణాటకను కోల్పోవడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు సాధించిపెట్టే విజేతగా రాహుల్‌ గాంధీ ప్రతిష్ట మసకబారినట్లేనని చెప్పాలి. ప్రతిపక్షంలోని సమానుల్లో ప్రథముడిగా రాహుల్‌కు ఒక సానుకూల స్థానం ఉండేది. కర్ణాటకలో ఓటమి తీరుతో రాహుల్‌ సమానులలో ఒకడిగా దిగజారిపోయారు. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత దేవెగౌడ, ఆయన కుటుంబం తప్ప దేశంలోని ఏ రాజకీయనేతా రాహుల్‌ గాంధీని అభినందించలేదు. రాహుల్‌ విశ్వప్రయత్నం చేసి కూడా సులువైన ఎన్నికల్లో కూడా గెలుపు సాధించలేకపోయారని అందరికీ అర్థమైపోయింది.

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయాన్ని అంగీకరిం చాక రాహుల్‌ తన ప్రాంతీయ ప్రత్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించారు. మోదీకి వ్యతిరేకంగా అతిశయ ప్రకటనలు చేసిన రాహుల్‌ మే 15 తర్వాత కాస్త తగ్గిపోయారు. బీజేపీని తానే సొంతంగా ఓడించగలనని ప్రగల్భాలు పలికిన దశ నుంచి ప్రాంతీయ ప్రత్యర్థితో కలిసి పనిచేయవలసిన స్థితికి రాహుల్‌ దిగిపోయారు. ఎన్నికల వేళ దేవెగౌడ కుటుంబాన్ని తూర్పారబట్టిన రాహుల్‌ సమయం కలిసిరాక తగ్గిపోయారు కానీ అవకాశం దొరికితే ప్రతిపక్ష ప్రత్యర్థుల అంతు చూడకుండా ఉండరని అందరికీ అర్థమైంది. సంపూర్ణ విజయం తప్పదనుకున్న కర్ణాటకలో పరాజయం తర్వాత రాహుల్‌ ఎన్నికల్లో విజయాలు సాధించలేరని, బలహీనమైన నేతల సలహాలను పాటిస్తున్న అతడి వ్యూహాలు, ఎత్తుగడలు విఫలమవుతున్నాయన్న వాస్తవాన్ని బహిర్గతపర్చాయి. 

రాహుల్‌ గాంధీకి లాగే నరేంద్ర మోదీ ప్రతిష్ట కూడా స్పష్టంగానే వెనుకపట్టు పట్టింది. 2018 నాటి మోదీ 2014 నాటి మోదీ కాదు. అనేక అంశాల్లో ప్రజలు ఆయనను ఇష్టపడ్డారు కానీ పేలవమైన ఆర్థిక నిర్వహణతో తన ప్రతిష్టను తానే దెబ్బతీసుకుంటున్నారు. మోదీ ఎవరి మాటలనూ పట్టించుకునే పరిస్థితిలో లేరని అర్థమైపోయింది. మోదీని, రాహుల్‌ గాంధీని ఎవరూ దిద్దుబాటు చేయలేరు. రాజును అతడి ఆశ్రితులు ఎన్నటికీ సరిదిద్దలేరు. 

గందరగోళ సందర్భాల్లో ఎన్నికలు సాధారణంగా ఊహించని వారికే అధికారాన్ని అప్పగిస్తుంటాయి. పూర్వకాలంలో వధువు స్వయంవరంలో అనేకమందిని చూసి తన కాబోయే వరుడిని ఆశ్చర్యకరమైన రీతిలో ఎంపిక చేసుకునేది. ప్రస్తుతం భారత రాజకీయాల్లో అనేకమంది వరులు కనిపిస్తున్నప్పటికీ అనేక దిగ్భ్రాంతికరమైన ఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి రాహుల్, మోదీల ఆశలకు, ఆకాం క్షలకు చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఊహించనివారికి ప్రతిఫలం లభించే అవకాశం ఉంది మరి!

పెంటపాటి పుల్లారావు , వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
ఈ–మెయిల్‌ : drppullarao@yahoo.co.in

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top