కుల నిర్మూలనతోనే భవిష్యత్తు

Mallepally Laxmaiah Writes Article About Ambedkar Death Anniversary - Sakshi

మనం పరిశుభ్రమైన దుస్తులు ధరించినా, మన మనస్సు, శీలం నిందించడానికి వీలులేనిదైనా మనల్ని అంటరానివారుగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనం సమసమాజమనే సిద్ధాంతాన్ని ప్రబోధిస్తోన్న బౌద్ధమతంలో చేరాలి. అది మాత్రమే మనుషుల మధ్య విభేదాలను తొలగిస్తుంది అని బీఆర్‌ అంబేడ్కర్‌ తన తుది ఉపన్యాసంలో అన్నారు. అంటరానితనం ఏర్పడడానికి నీచమైన వృత్తులు, గోమాంస భక్షణ, మురికిగా ఉండడం లాంటి కారణాలు సహేతుకంగా లేవనీ, బౌద్ధాన్ని పాటిస్తున్న తెగలను హిందూ మతం వెలివేసి, నీచమైన వృత్తులను అంటగట్టిందని వివరించారు. చివరకు 1956 అక్టోబర్14న 5లక్షల మంది సమక్షంలో బౌద్ధం స్వీకరించి సామాజిక విప్లవానికి పునాది వేశారు. కుల నిర్మూలన కోసం అంబేడ్కర్‌ చేసిన పోరాటం రేపటి భవిష్యత్‌ భారతావనికి సుస్పష్టమైన మార్గదర్శక వెలుగురేఖగా నిలుస్తుంది.

‘‘మనం పదిహేను వందల సంవత్సరాల నుంచి గ్రామ పొలిమేరల కావల నివసిస్తూ, హిందువులు మనసు మారి మనకు సమానత్వం కల్పిస్తారని ఎదురు చూస్తున్నాం. కానీ ఏ ఒక్కరూ కూడా అంటరానితనం సమసిపోయే విధంగా మనస్ఫూర్తిగా ప్రయత్నించలేదు. కొందరూ అరకొరగా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అంతేకాక మతం పేరుతో మనం అణగతొక్కబడి శతాబ్దాల తరబడి అంతులేని హింసకూ, అత్యాచారాలకూ గురయ్యాం’’ అంటూ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ బౌద్ధ క్షేత్రమైన సారనాథ్‌లోని మహాబోధి సంస్థ ఏర్పాటు చేసిన సభలో ఆవేదన వ్యక్తం చేశారు.

నవంబర్‌ 25, 1956న అంబేడ్కర్‌ చేసిన ఉపన్యాసం ఆయన జీవితంలో చివరి ఉప న్యాసం. అంబేడ్కర్‌ తన చిట్టచివరి ఉపన్యాసంలో తన జీవితాను భవపు సారాన్ని తన ఆవేదనాశ్రువులుగా దేశప్రజల ముందుంచారు. ముఖ్యంగా అంటరాని కులాలకూ సమానత్వ కాంక్షాపరులకూ ఆయన చివరి వ్యాఖ్యోపానంగా ఈ ఉపన్యాసం ఉంటుంది.

‘‘మనం మురికిగా ఉన్నామని, నీచమైన పనులు చేసి జీవిస్తు న్నామని అందుకే దూరముంచామని వందల ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ వాస్తవంలో, ఈ రోజు మనం మురికిగా లేం. అందరిలానే పరిశుభ్రంగా ఉన్నాం. ఒక మనిషి ఇతను అంటరాని వాడు అని ఇప్పుడు మనల్ని మన వస్త్రధారణను బట్టి నిర్ధారించలేని విధంగా ఉన్నాం. అయినప్పటికీ మన కులం తెలిస్తే, మనం పరిశు భ్రమైన దుస్తులు ధరించినా, మర్యాదగల వ్యాపారం చేసినా, మన మనస్సు, శీలం నిందించడానికి వీలులేనిదైనా మనల్ని అంటరాని వారుగా చూస్తూనే ఉన్నారు.

కాబట్టి మనం హిందూమతాన్ని విడిచి పెట్టి సమసమాజమనే సిద్ధాంతాన్ని ప్రబోధించిన, ప్రబోధిస్తోన్న బౌద్ధమతంలో చేరాలి. అది మాత్రమే మనుషుల మధ్య విభేదాలను తొలగిస్తుంది.’’ అంటూ అంబేడ్కర్‌ తన చివరి ఉపన్యాసంలో ప్రబో ధించారు. అంతే కాదు, అంబేడ్కర్‌ ఇటువంటి నిర్ణయానికి రావడా నికి ఆయన సాగించిన సత్యశోధన, ఉద్యమకార్యాచరణ, శాసన నిర్మాణాలు కారణమయ్యాయి. అమెరికాలోని కొలంబియా వర్సిటీలో ఉన్నత చదువులకు వెళ్ళిన అంబేడ్కర్‌ 1916, మే, 9వ తేదీన ఆంత్రోపాలజీ సెమినార్‌లో ‘‘భారతదేశంలో కులాలు’’అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. అందులో కులాల పుట్టుకుకు సంబంధించిన చారిత్రక పరిస్థితులను వివరించారు. వివాహ వ్యవ స్థను ఒక సమూహానికే పరిమితం చేసి, ఒక సమూహాన్ని మరో సమూహంతో కలవకుండా చేసి, తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడా నికి  చేసిన ప్రయత్నం కుల వ్యవస్థ ఏర్పాటుకు కారణమయ్యిందన్న విషయాన్ని అంబేడ్కర్‌ తన పత్రంలో వివరించారు.

ఆ తర్వాత అంబేడ్కర్‌ రాజకీయ అంశాలపైన దృష్టి కేంద్రీకరిం చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు కావాలని, అందులో అంటరా నికులాలతో సహా అందరికీ భాగస్వామ్యం ఉండాలని 1919లో మొదటిసారిగా సౌత్‌బరో కమిటీ ఎదుట ప్రతిపాదించారు. అట్లా సైమన్‌ కమిషన్, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లలో తన వాదనను విని పించారు. 1946లో తన ప్రతిపాదనగా నూతన రాజ్యాంగంలో చేర్చ డానికి వీలుగా ‘స్టేట్స్, మైనారిటీస్‌’ అనే డాక్యుమెంటును రూపొం దించారు. అయితే కులం పోకుండా ఈ దేశంలో సమానత్వం రాదనే విషయాన్ని అంబేడ్కర్‌ బలంగా విశ్వసించారు. రాజకీయ హక్కుల కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే, కుల నిర్మూలనకు, అంట రానితనం రూపుమాపడానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు.

అప్పటికీ గాంధీలాంటి సంస్కర్తల మాటలు ఆచరణలో ఎట్లా విఫలమవుతున్నాయో చూపడానికి మహద్‌ చెరువు సత్యాగ్రహం, కాలారామ్‌ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని కొనసాగించారు. మహద్‌ చెరువులోని నీటిని కులమతాలకు అతీతంగా అందరూ వినియోగిం చుకోవాలని, ఆనాటి ప్రభుత్వం అనుమతితో చెరువులోకి అడుగుపె డితే, అస్పృశ్యులపై దాడి చేశారు. మహద్‌ చెరువు పోరాటం మార్చి 20, 1927లో జరిగింది. తర్వాత మూడేళ్ళకు 1930 మార్చి2న నాసిక్‌ లోని కాలారామ్‌ దేవాలయంలోకి అంటరాని కులాల ప్రవేశానికి అంబేడ్కర్‌ ఉద్యమించారు. అది కూడా విఫలమైంది.

అక్కడ కూడా హిందువులు అంబేడ్కర్‌తో సహా అంటరాని కులాలను దేవాలయం లోకి రానివ్వలేదు. అప్పుడు అంబేడ్కర్‌ హిందూమతం, దాని స్వభావం గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టారు. సరిగ్గా 1930–32 సంవత్సరాల్లో జరిగిన మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల అనంతరం అంటరాని కులాలకు రాజకీయ హక్కుగా ప్రత్యేక ఓటింగ్‌ విధానాన్ని అంగీకరిస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పటివరకు అంటరాని కులాలను ఉద్ధరించేది తానేనని ప్రకటించుకున్న గాంధీ బ్రిటిష్‌ ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ, ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రత్యేక ఓటింగ్‌ విధానాన్ని రద్దు చేసుకొని, గాంధీ ప్రతిపాదించిన పూనా ఒడంబడికను అయిష్టంగానే అంబేడ్కర్‌ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం కూడా అంబేడ్కర్‌ను బాగా కలచివేసింది.

ఆ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో యెవోల అనే పట్టణంలో అక్టోబర్‌ 12, 1935న జరిగిన అంటరాని కులాల సభలో అంబేడ్కర్‌ ఒక కీలకమైన ప్రకటన చేశారు. ‘దురదృష్ట వశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ నేను హిందువుగా మరణించను’ అని. ఈ ప్రకటన యావత్‌ దేశాన్ని అతలాకుతలం చేసింది. సమా జంలో సమాన గౌరవం, సమానహక్కుల కోసం జరిపిన పోరాటం ఏ విధంగా నిరర్ధకంగా మారిందో చెపుతూ అంబేడ్కర్‌ ఆందోళన వెలి బుచ్చారు. ఈ ప్రకటనను ఆ సభకు హాజరైన వేలాదిమంది స్వాగతిం చారు.

కానీ, అదే స్థాయిలో అగ్రవర్ణాల నుంచి వ్యతిరేకతను కూడా  తీసుకొచ్చింది. గాంధీ ఒక వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘అంబే డ్కర్‌ ప్రకటన ఆందోళన కలిగిస్తున్నది. ఆయన తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. ఆ నిర్ణయం ఫలితం ఇవ్వదు’ అని తెలిపారు.  దానికి అంబేడ్కర్‌ ఘాటైన సమాధానమే చెప్పారు. ‘నేను హిందూ మతాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అంటరానికులాల వారు  తామెలా వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళనివ్వండి. ఇది గాంధీకి నా సలహా’ అంటూ గాంధీ అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. 

అదే సమయంలో అంబేడ్కర్‌ కుల నిర్మూలనకు సంబంధించిన తన సత్యశోధనను ఆపలేదు. అందులో భాగంగానే 1936లో లాహో ర్‌లోని జాట్‌పాల్‌తోడక్‌ మండల్‌ సంస్థ ఆహ్వానం మేరకు కుల నిర్మూ లనపై ప్రసంగించడానికి అంబేడ్కర్‌ అంగీకరించారు. కానీ ఆ సభ జరగలేదు. అయితే ఆ సభ కోసం అంబేడ్కర్‌ రూపొందించిన డాక్యు మెంట్‌ ఇప్పటికీ ఒక చర్చకు ప్రాతిపదికగా నిలుస్తున్నది. కుల నిర్మూ లన పుస్తకంలో కులంపై ఎంతో వివరమైన విషయాలను ప్రస్తావి స్తూనే, కొన్ని ప్రతిపాదనలు కూడా చేశారు. తన మొట్టమొదటి పరిశో ధనాపత్రం ‘‘కులాల పుట్టుక’’లో పేర్కొన్న వివాహ వ్యవస్థ కులం బలపడడానికి కారణమైందని వివరిస్తూ కులాంతర వివాహాలు, వర్ణాంతర భోజనాలు జరగాలని ప్రతిపాదించారు.

పైగా, కులాన్ని సమర్థిస్తున్న ధర్మశాస్త్రాలను రద్దుచేయాలని కోరారు. వీటితో పాటు, హిందూ మతంలో అందరికీ సమాన హక్కులు ఉండే విధంగా అర్చక వ్యవస్థను ఒక కులానికి పరిమితం చేయరాదని కూడా అంబేడ్కర్‌ కరాకండీగా చెప్పారు. తన పరిశోధనలను కొనసాగిస్తూనే అంటరాని తనం ఆచరించడానికి గల కారణాలను కనుగొన్నారు. ‘అంటరాని వారెవరు’ అంటూ చేసిన తన శోధనలో ఆయనకు తను ఎటు వెళ్లాలో తెలిసింది. అంటరానితనం ఏర్పడడానికి నీచమైన వృత్తులు, ఆవు మాంసభక్షణ, మురికిగా ఉండడం లాంటి కారణాలు సహేతుకంగా లేవనీ, బౌద్ధాన్ని అవలంబిస్తూ్త హిందూమతంలోనికి తిరిగిరాని తెగలను హిందూ మతం వెలివేసిందని, నీచమైన వృత్తులను అంట గట్టిందని వివరించారు.

ఆ విధంగా మళ్ళీ అంటరానివారి సొంత మతమైన బౌద్ధంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకే 1944 నుంచి బౌద్ధంపై అంబేడ్కర్‌ అధ్యయనం సాగించారు. చివరకు 1956 అక్టోబర్, 14న ఐదు లక్షల మంది సమక్షంలో బౌద్ధం స్వీకరించి గొప్ప సామాజిక విప్లవానికి పునాదివేశారు. అంబేడ్కర్‌ బౌద్ధంలోకి వెళ్ళాలనే నిర్ణయానికి కారణం ఛాందస హిందూ వాదమే కానీ అంబే డ్కర్‌ స్వతహాగా కారణం కాదని అంబేడ్కర్‌ సామాజిక ప్రయాణం మనకు స్పష్టంగా వివరిస్తుంది. అందుకే కుల నిర్మూలన కోసం అంబే డ్కర్‌ చేసిన పోరాటం రేపటి భవిష్యత్‌ భారతావనికి సుస్పష్టమైన మార్గదర్శక వెలుగురేఖగా నిలుస్తుంది.


మల్లెపల్లి లక్ష్మయ్య 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు 

మొబైల్‌ : 81063 22077 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top