పేదలకు ఇంగ్లిష్‌ విద్య అందకుండా కుట్ర

Kancha Ilaiah Article On English Medium In Schools - Sakshi

విశ్లేషణ

గ్రామీణ ప్రాంతాల్లోని దిగువ కులాలకు చెందిన నిరుపేద పిల్లలు తమ గ్రామాల్లో ఇంగ్లిష్‌ చదివినంత మాత్రానే తెలుగు భాష చనిపోతుందా? అలాగైతే ప్రైవేటు స్కూళ్లల్లో చదివిన, చదువుతున్న పిల్లలున్న సంపన్నుల కాలనీల్లోని ఇళ్లలో తెలుగు ఎందుకు చనిపోలేదు? పేద పిల్లలు కూడా తమలాగే ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. ఆయన విధానంలో తప్పేముంది? బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌ సిటీల్లో తెలుగు అదృశ్యం కానప్పుడు పేద ప్రజలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్నంత మాత్రాన వారి ఇళ్లలోంచి తెలుగు ఎలా మాయమవుతుంది? పేద ప్రజల జీవితాల్లో సమూల మార్పు తీసుకురాగల ఈ కీలక విధానాన్ని వ్యతిరేకిస్తే తమకు మనుగడే ఉండదని చంద్రబాబు, ఆయన వెనకున్న ఇంగ్లిష్‌ మీడియం వ్యతిరేకులు గ్రహిస్తే మంచిది. 

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన అమలు చేయడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచుతూనే ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తారని సీఎం తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడానికి దాదాపు ఏడు నెలలకు ముందే ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఇది హడావుడిగా తీసుకున్న చర్య కాదు. అలాగే రాష్ట్ర ప్రజలకు ఇది తెలీని విషయమూ కాదు. ఇది వైఎస్‌ జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలకమైన నవరత్నాల్లో ఒకటి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయకపోతే అదే ఒక సమస్యగా మారి జగన్‌ ప్రభుత్వాన్ని మనమే తప్పు పడతాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగిష్‌ను ప్రధాన బోధనా భాషగా చేస్తామని చెప్పినందునే ప్రజలు ఆయనకు ఓట్లువేసి గెలిపించారు. 

కానీ ప్రభుత్వం చేపట్టిన ఈ విద్యాసంస్కరణలను ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మాతృభాషా పరిరక్షణ ముసుగులో ఇంగ్లిష్‌ మీడియం ప్రైవేటు పాఠశాలలకు చెందిన దళాలను రోడ్లపైకి ఎందుకు పంపుతున్నారు? ఆయన మనవడు దేవాన్ష్‌ మాతృభాష ఏది? అతని తల్లిదండ్రులు లోకేష్, బ్రాహ్మణి తెలుగును ఒక సబ్జెక్టుగా కూడా బోధించని ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చదివారు. పైగా వారు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి అక్కడి ఉచ్ఛారణరీతిని ఒంటబట్టించుకున్నారు. మరి వారిద్దరినీ ఆంధ్రదేశంలోని ప్రపంచశ్రేణి తెలుగు బోధనా కేంద్రానికి చంద్రబాబు ఎందుకు పంపలేకపోయారు.

మాతృభాష అనేది ఎన్నటికీ మారని ఒక స్థిరమైన వస్తువా లేక పిల్లల తల్లి కొత్త భాషలను నేర్చుకుంటూ, వివిధ భాషల్లో పిల్లలతో మాట్లాడుతూ మార్పు చెందుతూ ఉండదా? ఇంగ్లిష్‌ భాష అనేది కేవలం మనోభావాలను ప్రేరేపించే సాధనమా లేక ఒక వ్యక్తిని, కుటుంబాన్ని, ప్రాంతాన్ని, జాతిని అభివృద్ధి పరచే సాధనమా? ఇంగ్లిష్‌ జాతి వ్యతిరేకమైనదీ, లేక భారతీయ వ్యతిరేకమైనదీ లేక తెలుగుతల్లికి వ్యతిరేకమైనదీ అయితే మన జాతి నిర్మాతలు ఆ భాషను ఎందుకు కొనసాగించారు? పైగా దేశాన్ని, రాష్ట్రాలను పా లిస్తున్న కులీనవర్గాలలో మాత్రమే ఇంగ్లిష్‌ ఎందుకు మనగలిగి ఉం టోంది? భారతదేశంలోని  యువతరం పాలకులు ఇంగ్లిష్‌ మీడి యంలో మాత్రమే ఎందుకు చదువు నేర్చుకుంటున్నారు? భారతీయ గ్రామాల్లోని నిరుపేద, దిగువ తరగతి కులాలు ఇంగ్లిష్‌లో విద్య నే ర్చుకున్న బ్రాండ్‌ నూతన పాలకుల భారతీయ క్లబ్‌లో చేరకూడదా?

ఈ సంవత్సరం నవంబర్‌ 9 నాటి ఈనాడు పత్రిక సంపాదకీయం కేసి చూస్తే, ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్‌ వ్యతిరేక ఆందోళనలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లోని దిగువ కులాలకు చెందిన నిరుపేద పిల్లలు తమ గ్రామాల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదివినంత మాత్రానే తెలుగు భాష చనిపోతుందా? అలాగైతే ప్రైవేట్‌ స్కూళ్లలో మాత్రమే చదివిన,  చదువుతున్న పిల్లలను కలిగిన సంపన్నుల కాలనీల్లోని ఇళ్లలో తెలుగు ఎందుకు చనిపోలేదు? ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో మాత్రమే చదవడం ద్వారా వీరు దేశానికి, రాష్ట్రాలకు పాలకులుగా ఎలా  మారారు? జగన్‌ మోహన్‌రెడ్డి నుంచి అఖిలేష్‌ యాదవ్‌ వరకు,  రాహుల్‌ గాంధీ నుంచి నిర్మలా సీతారామన్‌ వరకు నారాలోకేష్‌ నుంచి కేటీ రామారావు వరకు సచిన్‌ పైలట్‌ నుంచి జ్యోతిరాదిత్య  సింధియా, ఆదిత్య థాక్రేల వరకు యువతరం పాలకులందరూ ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్న నేతలే కదా. మరి గ్రామీణ నిరుపేదలు, దిగువ కులాలకు చెందిన యువత వీరిలాగా రూపొందకూడదా? ప్రభుత్వ పాఠశాలల్లో తప్పితే వీరు ఏ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోగలరు? పేద పిల్లలు కూడా తమలాగే ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. ఆయన పాలసీలో తప్పేముంది?  

జగన్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ధ్వంసం చేస్తోందన్న  వాదన పరమ హాస్యాస్పదమైనది. ఈనాడు అభిప్రాయం ప్రకారం మారుమూల పల్లెల్లో, గిరిజన ప్రాంతాల్లో నివసిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్య ద్వారా లబ్ధి పొందుతున్నవారు కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని  వ్యతిరేకించాలట. ఇది నిజంగానే ఉద్వేగపూరితమైన, మనోభావాలను రెచ్చగొట్టే వాదన తప్ప మరేమీ కాదు. 

తన జీవితం తొలినాళ్లలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూసిన రామోజీరావు చిన్న కుమారుడు సుమన్‌  నిజాం కాలేజీలో నా విద్యార్థిగా బీఏ చదువుకున్నాడు. తాను ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యా నేపథ్యం నుంచి వచ్చాడు. తన తెలుగు ఏమంత బాగుండేది కాదు. కానీ ఇంగ్లిష్‌లో మంచి వక్త. నేర్చుకోవడం పట్ల నిజాయితీతో, చిత్తశుద్ధితో కూడిన అతడి వైఖరిని నేను అభినందించేవాడిని. తన క్లాసులో నేను అంతర్జాతీయ సంబంధాల గురించిన సబ్జెక్టును  బోధించేవాడిని కాబట్టి తరచుగా నా వద్దకు వచ్చి ఆ సబ్జెక్టుపై చర్చించేవాడు. ఈ సందర్భంగా నాలో రేగుతున్న ప్రశ్నలు ఏవంటే..  అంత భారీ స్థాయి తెలుగు మీడియా పరిశ్రమను నిర్వహిస్తున్న రామోజీరావు తన కుమారుడిని మాత్రం ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో ఎందుకు చేర్పించారు? తన కుమారుడిని అతడి మాతృభాష అయిన తెలుగు బోధించే పాఠశాలలో ఎందుకు చేర్పించలేదు? గ్రామీణ ప్రాంతాల్లోని పేదతల్లుల పిల్లలు తమ గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుంటే దాంట్లో తప్పేముంది? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్‌ సిటీల్లో తెలుగు అదృశ్యం కానప్పుడు, పేద ప్రజలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్నంత మాత్రాన వారి ఇళ్లలోంచి తెలుగు ఎలా మాయమవుతుంది? 

రామోజీరావు కూడా హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలో తన భార్య పేరిట రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ అనే ఇంగ్లిష్‌ మీడియం పబ్లిక్‌ స్కూల్‌ని చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ  ఇంగ్లిష్‌ మీడియం స్కూలు తన సేవలను ఎలా అందించింది, ఇప్పటికీ ఎలా అందిస్తోంది? తన వినోదాత్మక చానల్స్‌ను నడుపుతున్న ప్రధాన యాంకర్ల స్కూల్‌ విద్యా నేపథ్యం గురించి సర్వే చేయడానికి రామోజీరావు అనుమతించగలరా? వీరిలో ఎక్కువమంది ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ విద్యా నేపథ్యం నుంచి వచ్చినవారు కనుకనే వీరు చాలా తరచుగా ఇంగ్లిష్‌ మాట్లాడుతుండటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రామోజీరావు అనుబంధం కలిగి ఉన్న చిత్రపరిశ్రమలో సర్వే నిర్వహిద్దాం. యువ హీరోలు, హీరోయిన్లు మొత్తంగా  ఇంగ్లిష్‌ మీడియంలో చదివినవారే కానీ వీరంతా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు మరి. రామోజీరావు, చంద్రబాబు కుటుంబ నెట్‌వర్క్‌లతో సంబంధమున్న ఈ శక్తులతో సమాన శ్రేణిలో నిరుపేద దళితులు, బీసీలు, ఆదివాసీలకు చెందిన పిల్లలు ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి వ్యతిరేకంగా కుట్ర ఏదైనా జరుగుతోందా?  

దేశంలో బాంబే ప్రావిన్స్‌లో గోపాలకృష్ణ గోఖలే, బాలగంగా ధర తిలక్‌తో పాటు ఇంగ్లిష్‌ విద్య నేర్చుకున్న తొలి శూద్రుడు మహా త్మా జ్యోతిరావు పూలే. అంటే ఇంగ్లిష్‌ విద్యతో ఆనాటి నుంచే దిగువ కులాల విముక్తి ప్రారంభమైంది. 1947లో ఇంగ్లిష్‌ను జాతీయ భాష గా గుర్తించాలని, ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లిష్‌ను తప్పకుండా బోధించాలని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ పట్టుపట్టినప్పటికీ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ఇంగ్లిష్‌ బోధనను ప్రైవేట్‌ స్కూల్‌ విద్యకు పరి మితం చేసింది. ప్రాంతీయ భాషలను ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా భాషలుగా స్వీకరించారు. ఈ విధానం విద్యా వ్యవస్థలో సమానహక్కులను తిరస్కరించింది. పాలక వర్గ భాషను నిరుపేదలు, నిమ్న కులాల వారికి నిరాకరించడంలో భాషే ప్రధాన పాత్ర పోషించింది. 

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని స్కూల్‌ విద్యను సమాన స్థాయికి తీసుకువచ్చే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు, ఆయన చుట్టూ ఉండే మీడియా నెట్‌వర్క్‌ దీన్ని వ్యతిరేకిస్తే అందులోని అంతరార్ధాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని దిగువ కులాలవారూ, పేద ప్రజానీకం గమనించలేకపోరు. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగల అత్యంత నిర్ణయాత్మకమైన ఈ కీలక విధానాన్ని వ్యతిరేకిస్తే తమకు మున్ముందు మనుగడే ఉండదని చంద్రబాబు, ఆయన వెనకున్న ఇంగ్లిష్‌ మీడియం వ్యతిరేకులు గ్రహిస్తే మంచిది.


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త రాజకీయ సిద్ధాంతవేత్త, సామాజిక కార్యకర్త 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top