అవినీతి నిరోధకచట్టం.. పారదర్శకత

Guest Column By IYR Krishna Rao Over Corruption And Transparency - Sakshi

సందర్భం

ముస్సోరీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమిలో ఐఏఎస్‌ ఆఫీసర్‌ల శిక్షణ రెండు భాగాలుగా జరుగుతుంది. తొమ్మిది నెలల మొదటి భాగం శిక్షణ తరువాత జిల్లాలలో శిక్షణకు వెళ్లి తిరిగి మూడు నెలల రెండో భాగం శిక్షణకు అధికారులు ముస్సోరికి వస్తారు. మా శిక్షణ సమయంలో రెండో భాగం శిక్షణకు వచ్చినప్పుడు అకాడమి పరిపాలనాధికారిగా అప్పు గారు ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో శిక్షణ చాలా ఉత్సాహపూరితంగా నడిచింది. చిన్న చిన్న గ్రూపులలో చాలా అంశాలు చర్చించేవాళ్ళం. అందులో ఒక అంశం నాకు బాగా గుర్తు. సమర్థవంతమైన అవినీతి అధికారి లేదా అసమర్థుడైన నిజాయితీపరుడైన అధికారులలో ఎవరు మెరుగు అనే అంశం. తర్వాత మెల్లగా తెలిసిన విషయం ఏమిటంటే అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్ల మూలంగా నిజాయితీపరుడైన సమర్థవంతమైన అధికారిని అవినీతిపరుడిగా చిత్రీకరించే అవకాశాలున్నాయని. నిర్ణయాలు తీసుకోని అధికారులు, అవినీ తిపరులైన, ఫైళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకునే అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పదవుల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని. 

చాలామంది నిజాయితీపరులు, సమర్థులు అయిన అధికారులకు ఇబ్బంది కలిగించిన సెక్షన్‌ 13(1)డి(జీజీ)(జీజీజీ). ఒక ప్రభుత్వ అధికారి తన అధికారిక స్థానాన్ని దుర్వినియోగపరిచి ఎవరికైనా మేలు చేకూర్చినా లేక తన చర్యల ద్వారా ఇంకెవరికైనా మేలు కలగజేసినా.. అది ప్రజాహితానికి అనుగుణంగా లేకపోతే దుష్ప్రవర్తనగా పరిగణిస్తారు. న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా అధికార దుర్వినియోగానికి విస్తృత నిర్వచనాన్ని ఇచ్చారు. తనకు అధికారం లేకపోయినా నిర్ణయం తీసుకోవటం నుంచి హేతుబద్ధంగా లేని నిర్ణయాల వరకు, అవసరం లేని అంశాలు పరిగణనలోకి తీసుకోవటం, అవసరమైన అంశాలు పరిగణలోకి తీసుకోకపోవటం అన్నీ అధికార దుర్వినియోగ నిర్వచనం కిందికి తీసుకొని రావడం జరిగింది.

కానీ, అధికారులు తీసుకునే ఏ నిర్ణయాన్నయినా అధికార దుర్వినియోగంగా చిత్రీకరించి నేరపూరితమైన దుష్ప్రవర్తన కింద చర్య ప్రారంభించవచ్చు. అలాగే ప్రతి పరిపాలనాపరమైన చర్య ఎవరో ఒకరికి మేలు చేకూరుస్తుంది. ఇక ప్రజాహితం అనేది కోర్టుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సమయంలో ఉన్న సమాచారానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో పరిశీలిస్తే మరొకరకంగా గోచరించవచ్చు. ఈ రెండు సెక్షన్ల కనుగుణంగా పరిశోధనా సంస్థలు నిజాయితీపరులైన సమర్థ అధికారులపై చర్యలు ప్రారంభించాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు విధివిధానాలను సరిగ్గా పాటించలేదు అనే ఒకే నెపం మీద నేరపూరిత చర్యలు వీరిపై మోపారు. ఎటువంటి అవినీతిగానీ, ఆర్థికంగా లాభపడ్డారని గానీ ఆధారాలు లేకపోయినా కేవలం నిర్ణయం తీసుకునేటప్పుడు జరిగిన విధాన లోపాలను నేరపూరిత లోపాలుగా పరిగణించి చర్యలు ప్రారంభించారు. దీనితో అధికారులలో నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక రకమైన భయం ఏర్పడింది.

ఈ అంశాలను గుర్తించే ఈనాడు ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో మౌలికమైన మార్పు తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగపరి చినా, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినా నేరపూరితమైన చర్యగా పరిగణిస్తారు. అంతకు ముందు చట్టంలో ఉన్న 13 సెక్షన్‌ సమూలంగా మార్చడం జరిగింది. అధికారులు తీసుకున్న చర్యల మూలంగా ఎవరికైనా లబ్ధి జరిగితే వారు నేరపూరిత చర్య జరిపినట్టుగా భావించే విధానాన్ని పూర్తిగా తొలగించారు. నిజాయితీగా, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవాలనుకునే అధికారులకు భవిష్యత్తులో దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఉంటాయని భావించకుండా పనిచేసుకునే అవకాశాన్ని ఈ మార్పులు కల్పిస్తాయి.

కానీ పరిశోధనా సంస్థలు ఏ ప్రభుత్వ ఉద్యోగిపై అయినా విచారణ చేయాలంటే ప్రభుత్వ అనుమతి ఈ చట్ట సవరణ ద్వారా తప్పనిసరి చేశారు. ఈ మార్పులు పరిశోధనా సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి ప్రతిబంధకం కావచ్చు. దీనికి బదులు నిరంతరంగా అనుమతినిచ్చే అధికారాన్ని ఒక అధికారుల కమిటీకి అప్పగించి ఉంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేది. ఏ అవినీతి నిరోధక చట్టమైనా ఒక్క నిజాయితీపరుడైన అధికారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. కొందరు అవినీతిపరులు తప్పించుకున్నా ఫర్వాలేదు. నిజాయితీపరుడైన అధికారి ఇబ్బందికి గురైతే అధికారుల మనోసై్థర్యం దెబ్బతింటుంది. దీనితో నిర్ణయాలు తీసుకోవటానికి జంకుతారు. దీని దుష్ప్రభావం అభివృద్ధి కార్యక్రమాల అమలు మీద ఉంటుంది.

వ్యాసకర్త
ఐవైఆర్‌ కృష్ణారావు
ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
iyrk45@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top