‘హోదా’ గోదాలో కొత్త కదలిక

Devulapalli Amar writes on AP Special status fight - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం ఇవాళే ఉద్యమం ప్రారంభం కాలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు నుండి ఈనాటి వరకూ ప్రత్యేక హోదా కోసం అన్ని వేదికల మీదా మాట్లాడుతున్నారు. దాని వల్ల రాష్ట్రానికి జరిగే లాభాలను గురించి ప్రజలకు చెబుతూనే ఉన్నారు. ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి ఆయన ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగితే దాన్ని భగ్నం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అదే ప్రత్యేక హోదా పాట పాడటం హాస్యాస్పదం.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేలోపున, అంటే ఏప్రిల్‌ 6 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రకటించడంతో హోదా అంశం మళ్లీ ఊపందుకుంది. దీనితో అధికార తెలుగుదేశం పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారయింది. హోదా రాకపోతే చరిత్ర క్షమించదన్న వాస్తవం అర్థంకాని తెలుగుదేశానికి ఇది ఆషామాషీ వ్యవహారం కాదని జగన్‌ మళ్లీ తేల్చి చెప్పినట్టయింది. హోదా కోసం ఎవరు నిజాయితీగా పోరాడుతున్నారో ప్రజలకు మరొకసారి అర్థమయింది. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు, అందుకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం’ అని బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎప్పుడో తేల్చేసింది. అట్లా కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన మరుక్షణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం దాన్ని స్వాగతించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే, మరుక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందరి నిద్రలూ చెడగొట్టి ఆ ప్రకట నను స్వాగతిస్తూ కొన్ని గంటలు ప్రసంగించారు.

ఏపీని బీజేపీ మోసం చేసిందా? ఎలా!
ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ ఉండదు, అది సంజీవని కాదు, ప్రత్యేక హోదా వల్ల జరిగే లాభం కంటే ఎంతో ఎక్కువ లాభం జరిగే విధంగా కేంద్రం నిధుల వరదలెత్తించబోతున్నది, దాన్ని అడ్డుకునేందుకు, అభివృద్ధి జరగకుండా చూసేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తున్నది అని చంద్రబాబునాయుడు ఆనాడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దగ్గర పట్టుబట్టి ఒప్పించుకున్న అంశం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ప్రతిపత్తి అయిదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని నాడు రాజ్యసభలో ఉన్న ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, మరో అడుగు ముందుకు వేసి, పదిహేనేళ్లు కావాలన్నారు. 2014 ఎన్నికల ప్రచార సందర్భంగా ఎన్‌డీఏ నాయకులు ఇరువురూ(మోదీ, బాబు) అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్పని సరిగా ఇస్తాం అని ప్రజలకు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇద్దరూ మాట మార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం మనం అడిగిన దానికంటే చాలా ఎక్కువే ఇచ్చింది అని చెప్పారు. మరి ఇప్పుడేమయింది? కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తే వాటికి రాష్ట్రం లెక్కలు చెప్పడంలేదనీ,పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనీ కేంద్రంలో ఎన్‌డీఏ ప్రధాన భాగస్వామి బీజేపీ ప్రతినిధులు చెబుతూ ఉంటే, ప్యాకేజీ పేరు చెప్పి మోసం చేశారు, నిధులు ఇవ్వడం లేదు అని రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

ఎక్కడ బెడిసినట్టు?
ఇద్దరికీ ఎక్కడ చెడింది? గత వారంరోజులుగా ఒకరినొకరు బహిరంగంగానే ఎందుకు విమర్శించుకుంటున్నారు? ఈ ఆరోపణలూ ప్రత్యారోపణలకు ఏ మాత్రం అయినా విలువ ఉండాలంటే అవతల నరేంద్ర మోదీ కానీ, అమిత్‌ షా కానీ నోరు విప్పాలి. ఇవతల చంద్రబాబునాయుడు నోరు తెరవాలి. ఆ పని ఎందుకు జరగడం లేదు? మిత్రధర్మం లేదా సంకీర్ణధర్మం అనుకుంటే అటు కానీ, ఇటు కానీ ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదు కదా! అంతర్గతంగా మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుని బయటికి వచ్చి ఒకే స్వరంతో మాట్లాడితే కదా సంకీర్ణ ధర్మాన్ని పాటించినట్టు! కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇచ్చింది తీసుకోవాలి, ఆ తరువాత మరింత కావాలని అడుక్కోవాలి అన్న ధోరణిని చంద్రబాబునాయుడు ఎందుకు అవలంబిస్తున్నారు? ఎందుకు ఎక్కడికక్కడ సర్దుబాటు ధోరణిని అవలంబిస్తున్నది? నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఇదే పరిస్థితి. సంకీర్ణ భాగస్వాములు కూడా అవసరం అయినప్పుడు కనీస స్నేహపూర్వక విమర్శ అయినా చేస్తారు, ఆ సాహసం కూడా ఎందుకు చంద్రబాబు చెయ్యలేకపోతున్నారు? అంత బలహీన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, దాని అధినేత ఎందుకు ఉన్నారు? అందుకు గల బలమయిన కారణాలు ఏమిటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అప్పాయింట్‌మెంట్‌ కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఫెడరల్‌ రాజ్యంలో ఎందుకు ఉన్నది? రాష్ట్రంలో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయినా బిక్క మొహం వేసుకుని ప్రధాని పిలుపు కోసం ఎదురుచూస్తూ ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్కపూట లోక్‌సభలో నోరు విప్పి మాట్లాడినందుకు పార్లమెంట్‌ సభ్యుడు గల్లా జయదేవ్‌కు ఊరేగింపులు, సన్మానాలు ఎందుకు చేస్తున్నారు? పదే పదే అదే పాట అరుణ్‌ జైట్లీ నోట పాడించినందుకా తెలుగుదేశం విజయోత్సవాలు? మేము బోలెడు నిధులు ఇచ్చాం, వాటికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదు అని చెబుతున్న బీజేపీ ఎంఎల్‌సీ సోము వీర్రాజుకు జవాబు చెప్పే స్థితిలో తెలుగుదేశం నాయకులు ఎందుకు లేకుండా పోయారు?

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికమంత్రి మాట్లాడరేం?
ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు సరే, రెండురోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, వీర్రాజు విడుదల చేసిన లెక్కల్లో తప్పులుంటే రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధికారికంగా ఆ తప్పులను సరి చేయవచ్చు కదా! ఆయన అయినా ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్రం నుండి ఎన్ని నిధులు వచ్చాయి, వాటిని ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఖర్చు చేశామన్న విషయం తెలుసుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ఉంది కదా! వాళ్లు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చామన్న విషయం మరిచిపోయి మేము ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అన్న ధోరణిలో ఉంటే

ప్రజలెట్లా సహిస్తారు?
తాజా పరిస్థితే తీసుకుందాం. హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలన్న విషయం గుర్తొచ్చిన తెలుగుదేశం పార్టీ బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు లేవని బయటికొచ్చి మాట్లాడుతున్నా ఆ పార్టీ అధినేత మాత్రం నోరు విప్పి ఒక్క మాటా మాట్లాడటం లేదు. చీటికి మాటికి మీడియా ముందుకొచ్చి గంటల తరబడి మాట్లాడిందే మాట్లాడే అలవాటు మొదటి నుండీ ఉన్న చంద్రబాబునాయుడు పెదవి విప్పక పోవడం వెనక రహస్యం ఏమిటి? ఎన్ని లీకులు ఇచ్చినా, వందిమాగధ మీడియాలో ఎంత రాయిం చినా అధినేత నోరు విప్పి మాట్లాడితేనే కదా శ్రేణులు పరిస్థితిని అర్ధం చేసుకునేది. ఆయన ఆ పనికి సిద్ధంగా లేరన్నవిషయం స్పష్టం అవుతున్నది. అదే సమయంలో క్రమక్రమంగా బీజేపీ నుండి దూరం జరగాలి, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో తాను ఇచ్చిన 600 హామీలు ఎందుకు అమలు కాలేదని ఎవరూ ప్రశ్నించకుండా కేంద్రం నుండి సహకారం లేని కారణంగా అభివృద్ధి చెయ్యలేకపోయామని చెప్పుకుని జనాన్ని మళ్లీ ఓట్లు అడగాలన్నది చంద్రబాబు ఆలోచన. ప్రజలు ఎప్పుడయినా ఒక్కసారి మోసపోతారుకానీ అన్నిసార్లు మోసపోరు కదా!

ఆది నుంచి వైకాపా నినాదం అదే
విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం ఇవాళే ఉద్యమం ప్రారంభం కాలేదు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు నుండి ఈనాటి వరకూ ప్రత్యేక హోదా కోసం అన్ని వేదికల మీదా మాట్లాడుతున్నారు. దాని వల్ల రాష్ట్రానికి జరిగే లాభాలను గురించి ప్రజలకు చెబుతూనే ఉన్నారు. ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి ఆయన ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగితే దాన్ని భగ్నం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అదే ప్రత్యేక హోదా పాట పాడటం హాస్యాస్పదం. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉద్యమాల్లో భాగస్తులు కావద్దని ప్రజ లకు పిలుపునిచ్చిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి ప్రతిపత్తితో వచ్చే ప్రయోజనం ఏదీ ఉండదని దబాయించిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రిదే. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను అరెస్ట్‌ చేయించి, అక్రమ కేసులు పెట్టిన చరిత్ర ఆయన ప్రభుత్వానిది. పదహారు మాసాల తరువాత తనను కలుసుకున్న చంద్రబాబునాయుడి నియోజకవర్గాల పెంపు కోరికను ప్రధాని మోదీ అంగీకరించి ఉంటే ఏ గొడవా ఉండేదికాదు.

ఎవరి కోసం ఖర్చు చేశారో తేల్చాలి
ఇక్కడ బీజేపీ ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులకురాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదు అని వారు ఫిర్యాదు చేస్తే సరిపోదు. కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత అన్న లెక్కలతో బాటు, ఆ నిధులు ఎక్కడ ఎందుకు ఎవరికోసం ఖర్చు చేశారో తేల్చేందుకు కూడా ప్రయత్నించాలి. లేకుంటే జరిగేది ఒక్కటే. ఎన్‌డీఏ రథం దిగిపోయి చంద్రబాబు బీజేపీని నిందించడం ప్రారంభిస్తారు. ఇది చంద్రబాబుకు కొత్త కూడా కాదు, ఆ సంగతి బీజేపీకి కూడా అనుభవంలో లేనిది కాదు. పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణకు బయలుదేరిన డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తదితర మేధావుల బృందం, దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోనూ అత్యంత సంపన్నుడయిన చంద్రబాబునాయుడు పాలనలో అత్యధిక ప్రజలు పేదరికంలో ఎందుకు ఉన్నారు, వారి సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు అన్న నిజాన్ని నిగ్గు తేలిస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రులు అందరిలో అత్యంత సంపన్నుడు చంద్రబాబునాయుడే అని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) నివేదికలో పేర్కొన్నట్టు ఈరోజే పత్రికల్లో వచ్చింది మరి!


- దేవులపల్లి అమర్‌

datelinehyderabad@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top