మత వివక్ష ఆరోపణలను భారత్‌ తిప్పికొట్టాలి

Coronavirus India Should Refute Allegations Of Religious Discrimination - Sakshi

సందర్భం

భారతీయ సమాజం, రాజకీయ వ్యవస్థలోని  కొన్ని విభాగాలు ఇస్లామోఫోబియా సంకేతాలను ప్రదర్శిస్తున్నాయని, ప్రత్యేకించి కరోనా వైరస్‌ వ్యాధి (కోవిడ్‌ –19) వ్యాప్తి తర్వాత, ఇస్లామిక్‌ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి కొన్ని దేశాలలో ఆందోళన నెలకొనివుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ అభియోగాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అందరినీ లక్ష్యంగా చేసుకున్న ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో ఐక్యత, సోదరభావం ఉండాల్సిన అవసరాన్ని ఏప్రిల్‌ 19న చేసిన తన ట్వీట్‌లో మోదీ నొక్కి చెప్పారు. తబ్లిగీ జమాత్‌ చర్యలకు ముస్లింలందరినీ బాధ్యులుగా చేయడం తప్పని ఆయన అన్నారు. ఇదే అభిప్రాయాన్ని సీనియర్‌ భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఒకరు కూడా వ్యక్తం చేశారు.

గతంలోలాగే ఈ సంవత్సరం కూడా మోదీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం దయ, సామరస్యం, కరుణలను సమృద్ధిగా తేవాలని ఆయన ట్వీట్‌ చేశారు. సమానత్వం, సోదరభావం, దాతృత్వ విలువల గురించిన  ప్రవక్త సందేశాన్ని రెండు సంవత్సరాల క్రితం మోదీ గుర్తు చేసుకున్నారు. 2016లో ప్రపంచ సూఫీ ఫోరమ్‌లో ప్రసంగించిన మోదీ, ‘‘ఒక గొప్ప మతం యొక్క దృఢమైన పునాదులపై నిలిచివున్న ఇస్లామిక్‌ నాగరికత యొక్క గొప్ప వైవిధ్యాన్ని’’ గురించి మాట్లాడారు.

అదే ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఈ సూఫీ మత స్ఫూర్తి,  తమ దేశంపై వారికున్న ప్రేమ, గౌరవాలే భారతదేశ ముస్లింలను నిర్వచిస్తా’యని అన్నారు. ‘అవి మన దేశపు చిరకాల సంస్కృతియైన శాంతి, వైవిధ్యం, సమానత్వాలను ప్రతిబింబిస్తాయి...’ కదిలించే ఈ మాటలు ఇస్లామోఫోబియానో, ముస్లిం వ్యతిరేక పక్షపాతాన్నో ఎత్తి చూపవు. అయితే మరెందుకు ఉమ్మా యొక్క ఇస్లామిక్‌ విభాగాలు భారతదేశ ధోరణుల వల్ల ఇబ్బంది పడుతున్నాయి? గత విధానాలను ఆధారంగా చేసుకొని, పరస్పర విరోధులుగా ఉన్న పశ్చిమ ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసిన మోదీ మొదటి పదవీకాలంలో ఇది కనిపించలేదు. అందువల్ల, భారత ముస్లింలపై ప్రభావం చూపుతున్న లేదా ప్రభావితం చేసే ఈ రెండవసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వ విధానాలను, చర్యలను; ఈ అంశాలను పాకిస్తాన్‌ ఎలా ఉపయోగించుకోవాలని చూస్తూవుందో కూడా పరిశీలించాల్సి వుంది.

నాలుగు పరిణామాలు విశిష్టంగా కనిపిస్తున్నాయి: జమ్మూ కశ్మీర్‌లో రాజ్యాంగపరమైన మార్పులు, పౌరసత్వం (సవరణ) చట్టం లేదా సీఏఏ, దీన్ని నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌íసీ)కు ముందస్తు చర్యగా ముస్లింలు భయపడటం, ఢిల్లీ అల్లర్లు, తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు ప్రతి స్పందనలు.జమ్మూ కశ్మీర్‌లో జరిగిన రాజ్యాంగపరమైన మార్పులు భారతదేశ రాజకీయ, దేశ అధికార పరిధిలోని విషయాలుగా అరబ్‌ దేశాలలో చూడబడ్డాయి. భారతదేశం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందంటూ పాకిస్తాన్‌ చేసిన ఆరోపణలు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కశ్మీర్‌ లోయలోని జనాభా స్థితిగతుల నిర్మాణాన్ని మార్చాలని, మానవ హక్కులను పట్టించుకోవటం లేదని చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందన లేదు. మోదీ ప్రభుత్వానికీ,  దాని సైద్ధాంతిక హిందుత్వ మూలాలకూ వ్యతిరేకంగా పాకిస్తాన్‌ చేస్తోన్న తీవ్ర విమర్శ కూడా విస్మరించబడింది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గాన్‌లలోని మత రాజకీయాల పరిపాలనను పరిగణనలోకి తీసుకుంటే, సీఏఏ నుండి ముస్లింలను మినహాయించడం సహజంగానే వివక్షాపూరి తంగానూ, కొన్నిసార్లు హింసాయుతంగానూ అనిపిస్తుంది. భారతీయ ముస్లింలపై సీఏఏ ఎటువంటి ప్రభావం చూపలేదని మోదీ ప్రభుత్వం సరిగ్గానే నొక్కి చెప్పింది. ఏదేమైనా, ఇది ఎన్‌ఆర్సీకి ముందస్తు చర్య అనీ, ఇది తమలో చాలామందిని విస్థాపనకు గురిచేస్తుందనీ భావించిన అనేకమంది ముస్లింలు భయపడ్డారు.
తదనంతరం కొనసాగిన సుదీర్ఘ ఆందోళనలు గల్ఫ్‌ దేశాలతో సహా ముస్లిం ప్రపంచంలో గుర్తించబడ్డాయి. పాకిస్తాన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, జాతీయతను మంజూరుచేయడంలో మతం ఒక కారకంగా మారడం కారణంగా అంతర్జాతీయ ఉదారవాద అభిప్రాయం మరింత దూరమైనప్పటికీ గల్ఫ్‌ దేశాలు శత్రువులుగా మారలేదు. అయితే, మలేసియా, టర్కీలు మాత్రం మారాయి.

ఢిల్లీ అల్లర్లు,  కొన్ని సందర్భాల్లో కోవిడ్‌ –19 వ్యాప్తికి దోహదపడిన తబ్లిగీ జమాత్‌ చర్యలకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రతిచర్యలు  గల్ఫ్‌ దేశాలలోని కొన్ని వర్గాల అభిప్రాయాలను మార్చివేశాయి. తబ్లిగీ జమాత్‌ ప్రవర్తన నేపథ్యంలో ముస్లింలను పూర్తిగా సాధారణీకరిస్తూ వారికి వ్యతిరేకంగా నిందార్హమైన వ్యాఖ్యలు వచ్చాయి. ముస్లింలను దేశ బహిష్కారం చేయాలనే బాధ్యతారహిత డిమాండ్లు, కొన్ని గల్ఫ్‌ దేశాల్లో ఆందోళన, ఆగ్రహాలకు కారణమయ్యాయి. గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న కొంతమంది భారతీయులు సామాజిక మాధ్యమాల్లో చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు దానికి మరింత ఆజ్యం పోశాయి. 

ఇది సరిగ్గా పాకిస్తాన్‌కు కొన్ని నకిలీ సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా భారత్‌ వ్యతిరేక జ్వాలను ఎగదోసేలా మంచి అవకాశం ఇచ్చినట్లయింది. అలాగే మోదీ ప్రభుత్వం పట్ల తనకున్న నేరారోపణ చిట్టాలను తవ్వేందుకు పనికొచ్చింది. ఇప్పుడు దాని స్పష్టమైన ప్రయత్నం ఏమంటే– ఇస్లామోఫోబియాను అధికారికంగా ప్రోత్సహించిందని ఇండియాకు వ్యతిరేకంగా అత్యున్నత స్థాయిలో ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ (ఓఐసీ) చేత ఆక్షేపణ జారీ చేయించడం.

కొన్ని రోజుల క్రితం ఓఐసీ దేశాలకు ఇచ్చిన నాలుగు పేజీల లేఖలో– ముస్లింల పట్ల ద్వేషం అనే కీలక భూమికపైనే బీజేపీ అధికారంలోకి రావడమూ, అనంతరం బలపడటమూ జరిగిందని పాకిస్తాన్‌ నొక్కిచెప్పింది. ఈ ఇస్లామోఫోబియా ఆరోపణలను కరాఖండిగా ఎదుర్కోవాలి. మత రాజ్యాలైన ఇస్లామిక్‌ దేశాలు ప్రాథమికంగా వివక్షాపూరితమైనవి అన్నది నిజం. అవి కూడా వీగర్‌  ముస్లింల పట్ల చైనా అణచివేత ధోరణిని నిందించడం లేదు. పాఠశాల చర్చా కార్యక్రమాల్లో ఈ అంశాలు మెరుస్తాయేమోగానీ ప్రపంచ దౌత్యంలో ఇవి పని చేయవు. అక్కడ మార్కులు  కొట్టేయడం కన్నా, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం ముఖ్యం.

కాబట్టి ఇప్పుడు చేయవలసింది ఏమంటే– స్వీయ రక్షణలో పడకుండా, భారత్‌ తన రాజ్యాంగ స్ఫూర్తి నుంచి ఎంత మాత్రమూ దూరం జరిగిపోవడం లేదనీ, దేశ ఐక్యతను దెబ్బతీసేవారు ఎవరైనా, పార్టీలకు అతీతంగా వారి పట్ల తగిన చర్యలు తీసుకుంటున్నామనీ ఇస్లామిక్‌ దేశాలకు నమ్మకం కలిగించాలి. అలాగే ప్రపంచ ఉదారవాదుల అభిప్రాయాల పట్ల తిరస్కార భావం ప్రదర్శించకుండా, వారితో చర్చించడం కూడా ముఖ్యం.
వ్యాసకర్త: వివేక్‌ కట్జూ, మాజీ దౌత్యవేత్త

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top