ఆచితూచి మాట్లాడండి కామ్రేడ్స్‌!

AP Vittal Writes Guest Column On Left Parties CPM And CPI - Sakshi

విశ్లేషణ

సీపీఎం నేత బృందా కారత్‌ ఏపీలో ఒక సభలో మాట్లాడుతూ మోదీని ఏమాత్రం విమర్శించలేదంటూ సీఎం జగన్‌పై ఆరోపించారు. కానీ హుజూర్‌నగర్‌లో ఉపఎన్నికలతో సహా పాలకవర్గ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంపై వామపక్షాలు ప్రతి సందర్భంలోనూ వేస్తున్న తప్పటడుగులను, వామపక్షాల అనైక్యతను సరిదిద్దడంలో బృందా కారత్‌ తన వంతు కృషి చేస్తే బాగుంటుంది. పైగా, ఎన్నడూ లేనివిధంగా ఏపీలో గిరిజనులు, దళితులు, మైనారిటీలు, బీసీలు తదితరుల అభ్యున్నతికి వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంక్షేమ చర్యల గురించి బృందా తెలుసుకుని ఉంటే బాగుండేది. సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న శక్తులతో శ్రామిక వర్గ పార్టీలు కలిసి పనిచేయడం ఇప్పటి అవసరం.

ఇటీవల సీపీఎం నేత బృందా కారత్‌ విశాఖ పట్నంలో అనుకుంటాను.. ఒక సభలో మాట్లాడుతూ, ‘జగన్‌ ఏమన్నా ఫెవికాల్‌తో పెదాలు అంటించుకున్నారా? మోదీని ఏమీ విమర్శించలేదు’ అన్నారు. నాకు తెలిసినంతవరకు బృందాకారత్‌ నిబద్ధత గల నాయకురాలు. పైగా సీపీఎం పార్టీ తరపున ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికై ఏర్పాటు చేసుకున్న ఒక కమిటీ నేత కూడా. గిరిజనుల అభివృద్ధి కోసం గత పాలకులు ఎన్నడూ చేయని విధంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వాన ఎలా కృషి చేస్తున్నదో ఆమెకు సరైన సమాచారం లభించినట్లు లేదు. ఒక గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత జగన్‌కే దక్కింది. తన మంత్రివర్గంలో 60 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ గిరిజన మైనారిటీ మహిళా ప్రతినిధులకు స్థానం కల్పించారు జగన్‌. ఇంతవరకు ఈ విధంగా సామాజిక న్యాయాన్ని ఆచరించిన రాజకీయపార్టీ గానీ, ముఖ్యమంత్రి గానీ మరెవరైనా ఉన్నారా? అలాగే ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా వెళ్లినప్పుడు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ప్రత్యేకించి ఆదివాసీ గిరిజనుల కోసం వైద్య కళాశాల, విద్యాసంస్థలు, వైద్య సదుపాయం అలాగే ఆ ప్రాంతంలో ఉన్న కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేక డయాలసిస్‌ కేంద్రాలు, రక్తశుద్ధి అవసరమైన వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల ఆర్థిక సదుపాయం ఇవన్నీ కల్పించే కృషి ప్రస్తుత రాష్ట్ర పాలనలో నిజాయితీగా జరుగుతున్నది కదా. ఆ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేసింది జగన్‌ ప్రభుత్వమే కదా! అమలు క్రమంలో ఏవైనా లోపాలుంటే సహజంగా ప్రజానుకూల ప్రభుత్వానికి బాధ్యతగల ప్రతిపక్షం తగు సూచనలిచ్చి, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. 

పైగా ప్రతి 50 ఇళ్లకు వలంటీర్లను ఏర్పాటు చేసి, ప్రజల గడపవద్దకు ప్రభుత్వాన్ని తీసుకువెళ్లి, వాళ్లలో అర్హులకు ప్రభుత్వ రేషన్‌ అందించడం, ఇతరత్రా రేషన్‌ కార్డులు, పెన్షన్‌ సదుపాయాలు, కులధృవీకరణ పత్రాలు, మొదలగు సమస్యలు తీర్చే వలంటీర్‌ వ్యవస్థకు జగన్‌ ఏర్పాటు చేయడం అపూర్వం కాదా! దానిని కూడా గోనెసంచులు మోసినందుకు అయిదువేల జీతం అంటూ అపహాస్యం చేయడం, ఆ గ్రామ వాలంటీర్లను అవమానించడమే కదా! చంద్రబాబు కృష్ణా జిల్లాలో ఆ గ్రామ వలంటీర్ల నియామక పత్రాలనందించే సంఖ్యను చూసి ఉండరు. వారి స్పందన గమనించారా? ఆ సభలో జగన్‌ ప్రసంగం విన్నారా? ఆ వలంటీర్లలో అత్యధికులు యువతీయువకులు. ఇలా మా గ్రామంలో మా ప్రజలకు జగనన్న కుటుంబంలో పెద్దకొడుకు వలే ఏర్పాటు చేయడం, ఈ వలంటీర్‌ వ్యవస్థ, దాని ద్వారా మాకు, మా వారికి, మా ఊరికి ప్రజాసేవ చేసే అవకాశం రావడం మా అదృష్టం అని ఆ యువతీయువకులు స్పందించడం.. ఎంత హృద్యమైన దృశ్యమో అనిపించింది.  బాబుగారు ప్రతి సభను ఒక ఈవెంటుగా మార్చి, తాను ఆ ఈవెంట్‌ మేనేజర్‌గా వ్యవహరించడం ఎంత అహంకార ఆడంబర ప్రదర్శనగా ఉండేదో కదా. తద్భిన్నంగా ఏదో పెద్దన్న,  చెల్లెళ్లు, తమ్ముళ్లు కలిసి తమ కుటుంబం కోసం ఏం చెయ్యాలి అని చర్చించుకున్నట్లు సాగింది జగన్‌ సభ. అందుకే బాబు ఉక్రోషం పట్టలేకపోతున్నారు. 

ఈ వ్యాసం మొదట్లో బృందాకారత్‌ జగన్‌ను విమర్శించిన ప్రస్తావన తేవడం ఎందుకంటే, ప్రస్తుతం చంద్రబాబు వ్యవహార శైలి వంటిది కమ్యూనిస్టులకు తగనిదని, తెలియజేసేందుకే! ఇటీవల సీపీఐ నేత నారాయణ కూడా గత స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్లి జగన్‌ అక్రమ వేధింపుల వల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు సమక్షంలోనే అన్నారు. ఆ ప్రకటన చూసిన మిత్రుడొకరు సీపీఐ వారు చంద్రబాబుకు దగ్గరవనున్నారా? అని అడిగాడు. 2009లో చంద్రబాబుతో మహాకూటమి కట్టిన తర్వాత, ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనుభవం తర్వాత, చంద్రబాబు గారితో కమ్యూనిస్టులు ఎవరూ చేతులు కలపరనే అనుకుంటున్నానని అన్నాను. కమ్యూనిస్టు పార్టీలకు ప్రజాభ్యుదయం, పురోగామి తత్వం, లౌకిక విధానాలు వంటి శాశ్వత విలువలు ఉంటాయి. బాబు లాంటి వారికి అధికారంలోకి రావడమే ముఖ్యం కాబట్టి వారు కమ్యూనిస్టులతోనైనా ఎన్నికల్లో జతకట్టగలరు. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక సంస్థ అయిన ఆరెస్సెస్, బీజేపీ వంటి వారితో సైతం పొత్తుకు వెనుకాడరు. కానీ కమ్యూనిస్టులకు మాత్రం బాబులాంటి వారితో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలే.

ఈ సందర్భంగా జగన్‌ ఆచరణను కమ్యూనిస్టులు మర్చిపోకూడదు. పైగా బీజేపీ హిందూ మతతత్వ ఎజెండాను కాదని, మన రాష్ట్రంలో జగన్‌ పాలన సర్వ మతసమానత్వాన్ని పాటిస్తూ నడుస్తున్న విషయం వాస్తవం కాదా? దాన్ని గుర్తించకుండా, ఇంతకు ముందు బాబు పాలనలో ప్రజలు స్వర్గధామంలో ఉన్నట్లు జగన్‌పై విమర్శలు గుప్పించడం కమ్యూనిస్టులకు కూడని పని.ప్రధాని మోదీ కార్పొరేట్‌ సంస్థలకు అత్యధిక లాభాలు లభించే విధంగా ఆర్థిక విధానాలు అవలంభించి, మన దేశ మౌలిక ఆర్థిక పరిస్థితిని క్షీణింప చేస్తున్నారు. కానీ వైఎస్‌ జగన్‌ మాత్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచి వారి కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా దృఢనిశ్చ యంతో పయనిస్తున్నారు. అదే రైతు భరోసా, గ్రామ స్వరాజ్‌ వివిధ కార్పొరేషన్ల ప్రధాన ఉద్దేశం. ఈ పాలన అందిస్తున్న ప్రత్యామ్నాయ విధానాలను సరిగా బేరీజు చేసుకోకుండా, ప్రతిపక్షపాత్ర పోషిం చడం అంటే కాళ్లల్లో కట్టె పెట్టడమేనని కమ్యూనిస్టులు భావించడం సరికాదు.

ఈ సందర్భంగానే తప్పులెన్నువారు తమతప్పులెరగరు అన్నట్లు త్వరితగతిని మన ప్రజాభిమాన గ్రాఫ్‌ పడిపోతున్నప్పుడు తీవ్ర ఆత్మవిమర్శను నిజాయితీగా చేసుకోవాలని కమ్యూనిస్టులతో నాకున్న పేగు సంబంధంతో కోరుతున్నాను. సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి, హైదరాబాద్‌లో నిర్వహించిన సీపీఎం తెలంగాణ కార్యదర్సి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపు సభలో లాల్‌ నీల్‌ నినాదం ఇచ్చారు. దాని అర్థం. వర్గపోరాట శక్తులు అలాగే సామాజిక అణచివేతకు గురవుతున్న వర్ణ(కుల) వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు, ఇతర వెనుక బడిన కులాలతో ఐక్యపోరాటం అవసరం అని భావించాము. దానికి ఆచరణ రూపం ఇస్తూ బహుజన, వామపక్ష సంఘటన (బీఎల్‌ఎఫ్‌)పై తెలం గాణ రాష్ట్రకమిటీ తత్సంబంధిత నేతలందరితో సంప్రదించి ఒక సృజనాత్మక మార్గాన్ని చేపట్టింది. అయితే వర్ణ (కుల) వ్యవస్థ నిర్మూలనా పోరాటం అనేది వర్గపోరాటాలకు, వర్గఐక్యతకు భంగం అని భయపడి, భయపెట్టే కామ్రేడ్లు ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో, కేంద్ర కమిటీల్లో మెజారిటీగా ఉన్నారు. వారు ఈ బీఎల్‌ఎఫ్‌ ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ మెజారిటీకి మైనారిటీ లోబడి ఉండాలనే పార్టీ నిబంధన ఆధారంగా దాన్ని వదిలిపెట్టాలని బలవంతం చేశారు. ఫలితంగా పార్లమెంటు ఎన్నికలో బీఎల్‌ఎఫ్‌ను విడిచి సీపీఐతో కలిసి ఎన్నికలలో తెలంగాణ సీపీఎం అయిష్టంగా జతకట్టింది.

ఇప్పుడు హుజూర్‌నగర్‌లో శాసనసభకు ఉపఎన్నిక  వచ్చింది. పై కమిటీ కామ్రేడ్లు తెలంగాణ సీపీఎం పార్టీకి ఒంటరిగానే పోరాడమని తాఖీదు పంపారు. అక్కడ సీపీఐ టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తోంది. గతంలో సీపీఎం నిర్మించిన బీఎల్‌ఎఫ్‌లోనే బాధ్యతలు నిర్వహించిన, మరో కమ్యూనిస్టు పార్టీ ఎంసీపీఐ (యూ), కంచ ఐలయ్య, కాకి మాధవరావు, తదితర సామాజిక న్యాయపోరాట సంస్థల నేతలు కొందరు కలిసి బీఎల్‌ఎఫ్‌ పేరుతో ఒక అభ్యర్థిని పెట్టింది. ఈ స్థితిలో సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది. ఇప్పుడైనా తమ అభ్యర్థి రంగంలో లేడు గనుక తామే నిర్మిం చిన బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిని బలపరచడం సీపీఎం కర్తవ్యం. తెలంగాణ సీపీఎం విషయంలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట కేంద్రీకృత నియంతృత్వాన్ని అమలు జరిపి, ఆ పార్టీ పైకమిటీ ఏం ఆదేశిస్తుందో చూడాలి. ఒకవేళ సీపీఎం, తాను బీఎల్‌ఎఫ్‌ని బలపర్చడం లేదని ప్రకటిస్తే, తెలంగాణలో ప్రత్యేకించి, దేశవ్యాప్తంగాను సీపీఎం ప్రతిష్ట దిగజారుతుంది. విస్తృత ప్రజా సమీకరణ చేయాల్సిన మౌలిక లక్ష్యానికి సీపీఎం దూరమవుతుంది. కానీ ఆ తప్పు నిర్ణయాన్ని సీపీఎం చేయదని ఆశిద్దాం. అణగారిన ప్రజల, కష్టజీవుల విస్తృత ఐక్య పోరాటమే మార్క్సిజాన్ని మన దేశ ప్రత్యేకతకు అన్వయించడం!

- డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top