పిల్లల కన్నీళ్లు తుడిచేవారేరీ?

Achyutha Rao Article On Children Problems - Sakshi

రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు అనేక బాధలకు గురవుతున్నారు. కానీ 18 ఏళ్లు దాటిన ఓటరులైన పౌరుల మీద దృష్టి పెట్టిన నేతలకు పిల్లల సమస్య పెద్దదిగా అనిపించడం లేదు. తెలంగాణలో ఇంటర్మీడియట్‌ బోర్డు పుణ్యమా అని సుమారు 20మంది బాలబాలికలు ఉరేసుకుని ఉసురు తీసుకున్నారు. కనీసం, పిల్లలను కోల్పోయిన దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను పరామర్శించడానికి కూడా ఈ నేతలకు మనసు రాలేదు. బాలల హక్కుల సంఘం పిటిషన్‌తో హైకోర్టు ములు గర్రతో గుచ్చితే తప్ప వీరిలో కదలిక రాలేదు. పిల్లలు పరీక్షల్లో ఫెయిల్‌ అయి నంత మాత్రాన నుయ్యో, గొయ్యో చూసుకోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పే విద్యా సంస్థ ఒక్కటి కూడా లేదు. పైగా, చదవనైనా చదవాలి లేదా చావాలి అన్న రీతిలో నిద్రాహారాలకు సైతం విద్యార్థులను దూరం చేస్తున్న సంస్థలు ఎన్నో.  

విద్యా వ్యవస్థ సంగతి అలా వుంచితే, బాలబాలికలకు కనీస రక్షణ కూడా కరువవుతోంది. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది నాలుగు నెలల్లోనే వందకు పైగా అత్యాచారాలు జరిగినట్టు ఎఫ్‌ఐఆర్‌ నివేదికలే చెబుతున్నాయి. అనేక సందర్భాల్లో ఉపాధ్యాయులే కీచక పాత్ర పోషించడం విషాదకరం. హత్యల విషయంలో కూడా తెలుగు రాష్ట్రాలు రెండూ పోటీపడుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే, మరోవైపు బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతు న్నాయి. హైటెక్‌ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబు ఏలుబడిలోని అనంతపురం జిల్లాలో అన్నం దొరకక మట్టితిని బాలిక చనిపోయిన ఘటన అందరి హృదయాలను కలిచివేసినా, ఏలికలో మాత్రం ఎటువంటి స్పందన కలిగించలేదు. అన్నివిధాలుగా పిల్లలు హీనంగా, దీనంగా బతుకుతూ వుంటే ఏలినవారు మాత్రం ఓట్లవేటలో మునిగితేలుతున్నారు. ఓటు హక్కులేని ఈ పిల్లల గొడవ వారికి వినిపించడం లేదు. కానీ, పిల్ల లపై ప్రేమ ఉన్నవారు, వారి హక్కుల కోసం పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 

-అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం 
మొబైల్‌ : 93910 24242
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top