వాసన లేని పువ్వు

Vasana Leni Puvvu Story On Funday - Sakshi

కథా ప్రపంచం

స్నానానికి వెళ్లబోతూ ఎనిమిదేళ్ల గోకుల్‌ వారి పెరటి అరటి తోటలో నిలుచున్నాడు. వాడు గత కొద్ది నెలలుగా ఈ అలవాటు చేసుకున్నాడు. అకస్మాత్తుగా వాడి దృష్టి పలకబారిన ఒక అరటిగెల పైన పడింది. మెడను వంచి మళ్లీ చూశాడు. తడి ఆరిపోయిన పెదవులను చప్పరించాడు. వాడి కళ్లు ఆనందంతో మెరిశాయి. చప్పట్లు కొట్టుకుంటూ ఇంటి లోపలికి పరుగెత్తాడు. 
తన అక్క పదేళ్ల కుసుమ్‌ని చేరుకుని ఆమె చెవిలో ఇలా అన్నాడు: ‘‘అక్కా! మన పెరట్లో ఒక అరటి గెల పండుతోంది.’’
‘‘నిజంగానా!’’ కుసుమ్‌ కళ్లు పెద్దవి చేస్తూ అడిగింది. 
గోకుల్‌ ఆమె చేతిని పట్టుకుని తోటలోనికి తీసుకుపోయాడు. చూపుడు వేలుతో పండబోతున్న అరటిగెలను చూపించాడు. ‘‘చూశావా? ఆ గెల పసుపు పచ్చగా లేదూ! అంటే పండబోతోంది.’’
‘‘ఔను సుమా!’’ అంది కుసుమ్‌. ‘‘ఆ గెల ఇంచుమించు ఆకుల్లో దాక్కొని ఉంది. నీకెలా కనపడిందబ్బా?’’ 
ఆమె మాటను పట్టించుకోకుండా గోకుల్‌ అరటి గెలవైపే చూస్తున్నాడు. వాడికి నోరూరుతోంది. ఆ తీక్షణమైన చూపులకు తట్టుకోలేక పండిన అరటిపండొకటి నోట్లో పడినట్లూ, దాన్ని నెమ్మదిగా మెత్తగా మింగుతున్నట్లూ అనుభూతి పొందుతున్నాడు.

మొత్తం మీద ఆ అక్కా తమ్ముళ్లిద్దరూ ఆ అరటిపళ్లు తినడం కోసం ఉవ్విళ్లూరడం, కలలు కనడం ప్రారంభించారు.
ప్రధాన ద్వారం గుండా తమ తండ్రి తోట వైపు వస్తూ ఉండటం కుసుమ్‌ చూసింది. ‘‘నాన్న వస్తున్నారు చూడు’’ అంది తమ్ముడితో.
‘‘ఏరీ ఎక్కడ?’’ అంటూనే గోకుల్‌ అయిష్టంగానే అరటిగెల నుంచి దృష్టి మరల్చాడు.
నిజంగానే నాన్న వస్తున్నాడు.
పిల్లలిద్దరూ ఒకేసారి తండ్రి వైపు పరుగెత్తారు. పండుతున్న అరటిగెల గురించి అతడికి సమాచారం ఇవ్వడానికి ఇద్దరూ పోటీ పడుతున్నారు. అక్క తమ్ముడి కంటే ముందుంది. గోకుల్‌ తండ్రిని చేరుకోకుండానే బిగ్గరగా అరిచాడు. ‘‘నాన్నా! నాన్నా! అరటిగెల పంటకొచ్చింది.’’
గొలాప్సేనా రాజకుమార్‌ ఇద్దరు పిల్లల్నీ చెరో చేత్తో పట్టుకున్నాడు. మనసులోనే చిరునవ్వు నవ్వుకున్నాడు. అరటిగెల గురించి తండ్రి సూక్ష్మ వివరాలు అందివ్వడంలో ఇద్దరూ నిమగ్నమయ్యారు. ఏ చెట్టు? ఏ గెలలో? ఎన్ని పళ్లు? వాటి రంగు.. గెల ఏ వైపు వంగింది మొదలైనవి విశదీకరించి చెబుతున్నారు.

రాజకుమార్‌! అంటే రాకుమారుడు.
అతడి తాత ముత్తాతలు ఎటువంటి రాజులో వారి రాజ్యం ఎంతటిదో ఇప్పటి రాజకుమార్‌కు తెలీదు. కాని తన తండ్రి ఎటువంటి రాజో అతడు కళ్లారా చూశాడు.
ఒక సింహాసనంలాంటి పెద్ద కుర్చీలో కూర్చునేవాడు. అదే పనిగా హుక్కా పీలుస్తుండేవాడు. బహుశ అదే అతని అధికారిక చిహ్నమేమో! భుక్తి కోసం ఏ వృత్తీ చేపట్టి ఎరుగడు. కాని ఆశ్చర్యకరంగా రాత్రీ పగలూ వంటపొయ్యి వెలుగుతూనే ఉండేది. అతిథులు వస్తూ పోతూ ఉండేవారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసుకునే వయస్సూ జ్ఞానమూ ఆనాటికి గొలాప్సేనాకు లేవు. బహుశ రాజభరణాలు కామధేనువుల్లా ఉండేవేమో! అవి ఆగిపోగానే తండ్రి స్తబ్దుడైపోయాడు. అతిథులూ తగ్గిపోయారు. ఐశ్వర్యంతో పాటు విలాసాలూ పోయాయి. అంతిమ దశలో అప్పుల కుప్పగా మిగిలిపోయాడు. చేతిలో హుక్కాతోనే తుదిశ్వాస విడిచాడు. తల్లి కూడా చనిపోయింది.
ఆ దశలోనే గొలప్సేనాకు పెళ్లయింది. కుటుంబ భారమంతా అతడిపైనే పడింది. ఆస్తులను తగులబెట్టి తండ్రి చేసిన అప్పులు తీర్చాడు. ఏమీ లేనివాడయ్యాడు.
దుబారా తండ్రి నుంచి అతడికి సంక్రమించిన భోగభాగ్యాలు రెండే రెండు: ఒకనాటి నివాసస్థలంలో సగభాగం, లేమిని వెక్కిరించే గుర్తుగా రాజకుమార్‌ అనే పేరు.

ఆ ఘన నామధేయం వారసత్వంగా లభించి ఉండకపోతే వ్యవసాయమో, కాయకష్టమో, కూలీనాలీనో చేసుకుని అతడు దారిద్య్రం నుంచి విముక్తుడయ్యేవాడు. సంసారమూ నెట్టుకు రాగలిగేవాడు. ఉజ్వలమైన సాంప్రదాయపు అవశేషంగా బలిపశువైపోయాడు.
తండ్రి విలాసాల మీద పెట్టిన శ్రద్ధ కొడుకు విద్యాబుద్ధుల మీద పెట్టలేదు. కీర్తిప్రతిష్ఠలకూ హోదాకూ, ఈనాటి జీవికకూ పొంతన కుదరలేదు. ఖర్చులకూ రాబడికీ సమతూకం లేకుండా పోయింది. జీవితం దినదిన గండంగా మారింది.
ఒకనాడు నిత్యాగ్నిహోత్రంగా వెలిగిన పొయ్యిలో ఇప్పుడు పిల్లి నిద్రపోతోంది.
చాలా సైనిక రిక్రూట్‌మెంట్లకు వెళ్లాడు. ఫలితం లేకపోయింది. ఉద్యోగాలకు విద్యార్హతలు అవసరమయ్యాయి. కాని రాచరికపు వాసనలు ఎందుకూ కొరగాలేదు.
అన్ని కోణాలనూ పరిగణించి అతడొక కిరాణా కొట్టు పెట్టాడు. రాచబిడ్డ ఈ పని చేయడం సమాజం హర్షించలేదు. అయినా అందరినీ నమ్మి, ఎగ్గొట్టే వాళ్లకు అరువులిచ్చి, తిరిగి వసూలు చేసుకోలేని, గట్టిగా అడగలేని మెతకతనం వల్ల కొద్ది నెలల్లోనే ఆ వ్యాపారం మూతపడింది. ఆ తర్వాత ఎన్నో పనుల్లో ప్రవేశించి చేతులు కాల్చుకున్నాడు.
బిష్ణుప్రియ మణిపురి ప్రజల్లో అచ్చిరాని అంశాలు రెండు ఉన్నాయని ప్రతీతి. అవి: దుకాణాలు నడపడం, సాంఘిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించడం. వీటి ప్రామాణికతను గొలాప్సేనా నిరూపించినట్లయింది.
సుమారు ఎనిమిదేళ్ల పాటు అతడు ఒంటరిగానే పేదరికపు భారాన్ని మోశాడు. అతడికి సహాయపడేవారు ఎవరూ లేకపోయారు. భార్య కమలిని ప్రోద్బలం మీద గ్రామంలో దళారీ పనిచేసే బలదేవ్‌ దగ్గరకు వెళ్లాడు.
‘‘అయ్యా! నేను ఈ సంసారభారాన్ని మొయ్యలేకపోతున్నాను. పూట గడవడం కష్టంగా ఉంది. మీరే నాకు ఎలాగైనా సహాయం చెయ్యాలి. నాకొక మూడు బీగాల భూమి ఇప్పించండి. కౌలు రైతు పని చేసుకుంటూ బతుకుతాను. లేకపోతే పిల్లలు పస్తులుండాల్సి వస్తుంది.’’

బలదేవ్‌ నిర్ఘాంతపోయాడు.
‘‘ఏమిటీ? మీరు కౌలురైతు పని అంటే వ్యవసాయం చేస్తారా? మీకేమైంది?’’
‘‘ఔను! నేనన్నది వ్యవసాయమే. నేను కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ రాచరికపు కుహనా హోదాల నుంచి నేను విముక్తుణ్ణి కావాలి. లేకపోతే పిల్లలు ఆకలితో మాడిపోతారు.’’
‘‘ఏంటి మాట్లాడుతున్నావు? నువ్వొక రాచబిడ్డవు. నాగలి పట్టుకుంటావా? అసలు అటువంటి నిర్ణయం నువ్వెలా తీసుకున్నావు? ఆ మాట నీ నుంచి వినడానికే నామోషీగా ఉంది. మన బిష్ణుప్రియ మణిపురి ప్రజల పరువు ప్రతిష్ఠలను, నాగరికతా సంస్కృతులనూ మంటగలిపేస్తావా? రాచరికపు విలువలను మట్టిపాలు చేస్తావా?’’ బలదేవ్‌ అభిమానపు చిరుకోపంతో అన్నాడు.
‘‘నిజమేనయ్యా! కాని ఈ రాచరికం నాకు గుదిబండలా తయారైంది. తిండీ కరువైంది.’’ బాధపడ్డాడు గొలాప్సేనా.
‘‘కృష్ణ! కృష్ణ! ఇవన్నీ భగవంతుడి నిగూఢమైన లీలలు. ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు. రేపు నీకో చక్కని సంపద ఏర్పడవచ్చు. ఆ సర్వంతర్యామి నీతో దోబూచులాడుతున్నాడు. ఇప్పుడు నిరాశతో ఉన్నావు. నీకు మేమందరమూ లేమా?’’ బలదేవ్‌ ఓదార్చడానికి ప్రయత్నించాడు.
‘‘నా ఉద్దేశం అది కాదు. కాని నాకు వ్యవసాయం తప్ప మరో మార్గం కనపడటం లేదు.’’
‘‘మరో మార్గం లేదన్న మాట నేనొప్పుకోను.’’ బలదేవ్‌ కొంచెం చనువుగా అన్నాడు. ‘‘మీ నాన్న గొంటాగిరీ, మీ తాత సెనరిగిరి సేద్యం అంటే ఏమిటో తెలియకుండానే అషై్టశ్వర్యాలతో తులతూగి బతికారు. మరి నువ్వెందుకు బతకలేవు?’’

‘‘నేను వాసనలేని పువ్వుని. జీవితంలో చితికిపోయాను. చతికిలబడిపోయాను. రేపటికి పొయ్యి ముట్టించే పరిస్థితి లేదు.’’
బలదేవ్‌ ఈ మాట విననట్లే నటించాడు. తన ధోరణిలో ఉపన్యాసమే కొనసాగించాడు. ‘‘మన బిష్ణుప్రియ మణిపురి సమాజమే పాతాళానికి దిగజారిపోతోంది. అగ్రకులాలూ పతనమైపోతున్నాయి. మన సంఘాలను తిరిగి వెలిగించగలిగేవారు మీ రాజకుమారులే. మీరు కూడా దుక్కి దున్నడం ప్రారంభిస్తే ఈ జాతిని భగవంతుడే రక్షించాలి. ఇతరుల ముందు ఎలా తలెత్తుకోగలం? నువ్వే చెప్పు!’’
‘‘నాలాంటి రాచరికపు వారసులు ఎందుకూ కొరగానివారు. సరే! నేను దుక్కి దున్నను. కాని నా మాట పూర్తిగా వినండి. పిల్లలు పస్తులుండటం చూడలేకపోతున్నాను.’’ అంటూ గొలాప్సేనా ఇలా మొరపెట్టుకున్నాడు: ‘‘అయ్యా! పిల్లల కోసం కొన్ని కాధీల (వెదురు కొలపాత్రలు) వడ్లగింజలు అప్పుగా ఇవ్వండి. రానున్న పంట కాలంలో ఏదో చేసి తిరిగి ఇచ్చేస్తాను.’’
బలదేవ్‌ గొంతు తగ్గించి ఇలా అన్నాడు: ‘‘మహారాజా! నీకు అప్పుగా ఇచ్చే అర్హత మాకెక్కడిది? కావలసినన్ని గింజలు నువ్వు ఊరికే తీసుకెళ్లొచ్చు. కాకపోతే రానున్న ఆదివారం విష్ణుమూర్తి పండుగ ఒకటి ఉంది. వీటన్నిటి వల్లా..’’
గొలాప్సేనాకు మనుషుల నైజం తెలీదు. తెల్లనివన్నీ పాలేనని నమ్ముతాడు. కాని కొద్ది క్షణాల తర్వాత బలదేవ్‌ అంతరంగంలోని కపటం అర్థమైంది.
‘‘అలాగా’’ అంటూ తన ముఖ కవళికలు కనపడకుండా తలదించుకుని గొలాప్సేనా తిరిగి వచ్చేశాడు.

వీధిలో కనపడిన తన ఇద్దరు పిల్లలనూ తనతో పాటే ఇంటి ఆవరణలోనికి తీసుకొచ్చేశాడు. కమలిని వరండాలో ఒక స్తంభానికి ఆనుకుని భర్త రాక కోసం ఆశగా ఎదురు చూస్తోంది.
గొలాప్సేనా ఒకసారి ఆమె వైపు చూసి లోతుకుపోయిన తన కళ్లను దించుకున్నాడు. అతడి చిన్నప్పటి పౌష్టికాహారం చెక్కిళ్ల మీద కాంతినైతే మిగిల్చింది. కాని ఆ కళ్లు.. కమలిని అతని ముఖాన్ని చక్కగా చదవగలదు. ఒక దీర్ఘనిశ్వాసం విడిచి ఆమె స్తంభానికి దూరంగా వచ్చింది. 
‘‘వెళ్లండి. మీ నాన్నగారితో స్నానాలు చేసి రండి. భోంచేద్దురుగాని..’’ అంది కమలిని పిల్లలిద్దరితోనూ.
గొలాప్సేనా స్నానం చేసి వచ్చి భోజనానికి ఒక పీట మీద కూర్చున్నాడు. వడ్డిస్తూ ఆమె అడిగింది: ‘‘బలదేవ్‌ ఏమంటాడు?’’
‘‘ఏమీ ప్రయోజనం లేదు’’ క్లుప్తంగా సమాధానం చెప్పాడు.
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం నెలకొంది. 
కమలిని నెమ్మదిగా అంది: ‘‘రేపేం చెయ్యడం? ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు.’’
‘‘ఇంటికి తిరిగి వస్తూ గౌర్హరీ తాత దుకాణం వద్ద ఆగాను.’’
‘‘మళ్లీనా?..’’
‘‘మరేం చెయ్యను చెప్పు? నేను.. నేను..’’ వాక్యం పూర్తి కాకుండానే పిల్లలిద్దరూ లోనికి వచ్చారు.

వడ్డించిన కంచం వైపు చూసి కుసుమ్‌ అంది: ‘‘అమ్మా! మళ్లీ ఆ కందగడ్డల కూరే చేశావా?’’
‘‘ఔను. ఇది మంచి పోషకాహారం. విటమిన్లు మెండుగా ఉంటాయి’’ అంది కమలిని నచ్చచెప్పే ధోరణిలో.
‘‘విటమిన్లున్నాయి అని చెబుతూ నువ్వు రోజూ కందగడ్డలే వండుతున్నావు. చాలా కొంచం అన్నం పెడుతున్నావు. నాకు ఈ రుచీ పచీ లేని తిండే వద్దు..’’ అంటూ కుసుమ్‌ కంచం వద్ద నుంచి లేచిపోయింది.
అక్క బాటనే ఆమె తమ్ముడు కూడా లేచిపోయాడు.
‘‘మీకు అన్నం కావాలంటే ఇంకా ఎక్కువ పెడతాను. రండి. కూర్చోండి.’’ అంటూ నచ్చచెప్పి కూర్చోబెట్టింది. అక్కతో పాటే గోకుల్‌ కూడా తిరిగి కూర్చున్నాడు. కొంతసేపటికి కుసుమ్‌ అంది: ‘‘అమ్మా! నాకు మరికొంచెం అన్నం వడ్డించు.’’ గోకుల్‌ కూడా అడిగాడు.

కమలిని పాత్ర నుంచి పట్టెడన్నం తీసి ఆ ఇద్దరికీ చెరి సగం పంచిపెట్టింది. నిజానికి ఆ అన్నం ఆమె తన కోసం ఉంచుకుంది. గొలాప్సేనా తానూ మరికొద్దిగా వడ్డించుకోవాలని అనుకుని, కమలిని పరిస్థితి చూసి ఆగిపోయాడు.
కంచంలో సగం అన్నం విడిచిపెట్టి, మంచినీళ్ల గ్లాసు పట్టుకుని నిల్చుండిపోయాడు.
‘‘ఏమైంది?’’ అని గాభరాపడుతూ అడిగింది కమలిని.
‘‘నా పొట్టలో బాగాలేదు. ఎక్కువగా తినకూడదనుకుంటున్నాను.’’ అంటూ బయటకు నడిచాడు.
కమలినికి అర్థమైపోయింది.
అతడి వైపు విషాదంగా చూసి, నీరు నిండిన తన కళ్లను శాలువా అంచుతో ఒత్తుకుంది.
ఆ కంచం తను తీసుకుంది.

గొలాప్సేనా వచ్చి పరుపు మీద చేరగిల్లాడు. అక్కడి నుంచి భోజనం చేస్తున్న కమలిని కనపడింది. ఆమె తను వదిలిన అన్నం తింటోంది. ఆమె చేతులూ, చెవులూ, మెడా బోసిగా ఉన్నాయి. ఒక్క నగ కూడా లేదు. ఆమె ప్రఖ్యాత విద్వాంసుడు ధనాపండిత్‌ కుమార్తె. వారు ఆగర్భ శ్రీమంతులు. కేవలం వంశగౌరవం చూసి తనకిచ్చి పెళ్లి చేశారు.
పెళ్లి అయిన తర్వాత ఆమెకు ఒక జత గాజులు కూడా చేయించలేకపోయాడు. ఆమె పేదరికాన్ని మొదటగా చూసింది తన ఇంటి వద్దనే. అయినా ఆమె ఊరుకోలేదు. కుట్లూ అల్లికలూ చేసుకుంటూ వేడినీళ్లకు చన్నీళ్లుగా ఎంతో కొంత సంపాదించేది. కాని ఒక నెలరోజులుగా ఆ రాబడి కూడా పడిపోయింది. దారాలూ ఇతర వస్తువులూ కొనడానికి డబ్బు లేదు. అయినా జీవితం పట్ల ఆశ చావలేదు.
పిల్లలిద్దరూ రోజుకు ఒకటి రెండు సార్లయినా అరటితోటలోకెళ్లి పళ్లు ఎంత వరకు ముగ్గాయో చూస్తున్నారు.
‘‘అక్కా! అరటిపళ్లు ఎప్పుడు తిందాం?’’ గోకుల్‌ అడుగుతూనే ఉన్నాడు.
‘‘తిందాం.. ఆగు మరి.’’ అంటోంది కుసుమ్‌.
వ్యవసాయం వృత్తిగా స్వీకరించమని కమలిని అతణ్ణి పోరుపెడుతోంది. ఆమె తనదైన వాదనను వినిపించసాగింది: ‘‘జనక మహారాజు వ్యవసాయదారుడే కదా! మన రాచరికం జనకుడి కన్నా గొప్పదా?’’ అంటూ ఉండేది.
‘‘నిజంగా ఇది నమ్మదగ్గ అంశమే’’ అని ఆలోచిస్తూనే గొలాప్సేనా నిద్రలోకి జారుకునేవాడు.
ఆ సాయంకాలం అరటిపళ్ల గెలను కోసి ఖాళీగా ఉన్న కొట్టంలో పెట్టాడు.

గోవర్ధన పూజ రానే వచ్చింది. ఉదయాన్నే లేచి, పల్లె పిల్లలందరూ ఒక్కొక్క చెరువు నుంచి మట్టి సేకరించడంలో తలమునకలైపోయారు. కుసుమ్, గోకుల్‌ కూడా అందరిలాగే ఇంటి ఆరుబయట కూర్చొని మట్టి విగ్రహాలను చేసే పనిలో పడ్డారు. కుసుమ్‌ ఒక ఎద్దుని చేసింది. గోకుల్‌ రెండు వెదురు కర్రలను తీసుకుని, వాటిని ఒక దారంతో కట్టి నాగలి రూపం వచ్చేట్లు తయారు చేశాడు. ఒక మనిషి బొమ్మని కూడా చేసి, దాన్ని నాగలి వెనుక కట్టి, మనిషి దుక్కి దున్నుతున్న నమూనా తయారు చేశాడు.
ఇద్దరు పిల్లలూ సామాజిక మండపం దగ్గరకు ఈ బొమ్మను పట్టుకుని వెళ్లారు.
బలదేవ్‌ మరి ఇద్దరు దళారీలు గోకుల్‌ని సరదాగా ప్రశ్నించారు: ‘‘అయితే అబ్బాయీ! నాగలితో దున్నుతున్నదెవరు?’’
గోకుల్‌ తన చేత్తో మలచిన మట్టి నమూనాను ఒక విధమైన సంతృప్తితో చూస్తూ కళ్లెగరేసి ఇలా బదులిచ్చాడు: ‘‘ఇంకెవరు? నేనే.’’
ఆ సమాధానం విని బలదేవ్‌తో పాటు మిగిలిన ఇద్దరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.

గొలాప్సేనా అరటిపళ్ల గెలను తీసుకుని తన ఇంటి వరండాపై కూర్చున్నాడు. చెట్టు మీదనే పళ్లు పక్వానికి రావడం ప్రారంభమైంది కనుక పైనున్న రెండు పెడలూ వాటికవే ముందుగా ముగ్గిపోయాయి.
‘‘అరటి గెలను బజారుకు తీసుకెళ్తున్నప్పుడు మన పిల్లలు కంటపడకుండా జాగ్రత్తపడండి’’ అంది కమలిని. ఒక గుడ్డతో ముఖం తుడుచుకుంటూ అతణ్ణి తొందరపెట్టసాగింది. ‘‘ఇప్పుడే వెళ్లు. పిల్లలొచ్చేస్తారు. వాళ్లొస్తే మాత్రం గెలను బయటకు తీసుకెళ్లనివ్వరు’’ అని మరీ మరీ హెచ్చరించింది.
‘‘అలాగే’’ అంటూ గొలాప్సేనా నిట్టూర్చాడు. బయల్దేరబోయాడు.
‘‘వీలైతే ఒక పళ్ల పెడను పిల్లల కోసం అట్టే పెట్టకూడదా!’’ అంది.
‘‘ఎలా కుదురుతుంది?’’ గెలను పట్టుకుని మెట్లు దిగుతూ అన్నాడు.

‘‘ఎన్నో బేరసారాల తర్వాత గౌర్హరీతాత మొత్తం గెలను ఆరు రూపాయలకు కొనడానికి నిశ్చయమైంది. అందులో మళ్లీ ఒక పెడ మనం తీసి ఉంచేస్తే ఊరుకుంటాడా? బియ్యం పప్పులూ కొనడానికి డబ్బు చాలదు.’’
ఇంతలో పిల్లలిద్దరూ ‘‘వ్వావ్‌... అరటి పళ్లు’’ అనుకుంటూ రానే వచ్చారు. వెదురు గేటుకు చెరోవైపు నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రిని చేరుకున్నారు.
అతడి వెనుక నుంచి కుసుమ్‌ అరటిగెలను చుట్టుకుని ఇలా అంది: ‘‘నాన్నా! వొద్దు! గెలను ఎక్కడికీ తీసుకెళ్లకు. వొద్దు నాన్నా!’’
గోకుల్‌ కూడా ‘‘పళ్లు మనమే తిందాం నాన్నా!’’ కుసుమ్‌తో పాటే గెలను పట్టుకుని వేలాడాడు.
కమలిని కన్నీరు ఆగలేదు. తన ముఖాన్ని శాలువతో కప్పుకుంటూ ఇంటిలోనికి పరుగెత్తింది.
గొలాప్సేనా కోపంగా వెనక్కు తిరిగాడు. ‘‘ఈ పళ్లు మనం తినడానికి కాదు. వొదలండి. చెప్తున్నాను కదా! వొదలండి.’’  పళ్ల గెలను పిల్లల పట్టు నుంచి గుంజుకోవడానికి ప్రయత్నించాడు. పిల్లలు ఇంకా గట్టిగా పట్టుకున్నారు. గొలాప్సేనాకు కోపం తారస్థాయికి చేరింది. చాచిపెట్టి ఇద్దరికీ చెరో లెంపకాయ కొట్టాడు. వారి లేత బుగ్గలు కందిపోయాయి. పిల్లలు ఒక్కసారిగా గొల్లుమన్నారు.

వారి నుంచి గెలను బలవంతంగా తీసుకున్నాడు. గొలాప్సేనా పిల్లలను ఎన్నడూ చెయ్యి చేసుకోవడం ఎరుగడు. అప్రయత్నంగా అతడి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.
అరటిపళ్ల ఉత్సాహం పిల్లల్లో నీరుగారిపోయింది. కమలిని వంటగదిలోనికి వెళ్లి గుడ్లనీరు కుక్కుకుంది.
ఎప్పుడూ లాలించే నాన్న ఈరోజు ఎందుకు కొట్టాడో పిల్లలకు తెలీదు. వారి చెంపలపై కన్నీరు ప్రవహించసాగింది.
గొలాప్సేనా బలవంతంగా గేటువైపు అడుగులు వేశాడు. అతడిలో వికలమైన మనస్సు బరువుగా ఉంది. ఒక చేతిలో అరటిగెల భారంగా ఉంది. అమాయకులైన పిల్లలను కొట్టిన రెండో చెయ్యి అపరాధ భావనతో కిందకు వేలాడుతూ ఉంది.
తండ్రి వీధి మలుపు తిరిగి కనుమరుగయ్యేంత వరకు పిల్లలు నిశ్చేష్టులై స్థాణువుల్లా నిలుచున్నారు.
బిష్ణుప్రియ మణిపురి మూలం : స్మృతికుమార్‌ సిన్హా
 అనువాదం: టి.షణ్ముఖరావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top