సులువైన వంటకాలు.. అదిరిపోయే రుచులు

Three Snack Recipes With Easy Steps - Sakshi

స్నాక్‌ సెంటర్‌

పచ్చి బఠాని పూరీ
కావలసినవి: గోధుమపిండి – 3 కప్పులు, కొత్తిమీర పేస్ట్‌ – 1 కప్పు, రవ్వ – 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చి బఠాని – 1 కప్పు, జీలకర్ర  పొడి– అర టీ స్పూన్‌, ధనియాల పొడి – 1 టేబుల్‌ స్పూన్, పచ్చిమిర్చి – 2 (ముక్కలు చేసుకోవాలి), నూనె – సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – కొద్దిగా

తయారీ: ముందుగా పచ్చి బఠానీలు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బఠానీ, జీలకర్ర , ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ ముద్దను ఒక బౌల్‌లో వేసుకుని, అందులో గోధుమపిండి, రవ్వ, ధనియాల పొడి, కొత్తిమీర పేస్ట్‌తో పాటూ కొద్దిగా నీళ్లు వేసుకుని పూరీపిండిలా కలుపుకుని.. ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో పూరీలు చేసుకుని, నూనెలో దోరగా వేయించేయాలి.

పనీర్‌ పకోడా
కావలసినవి:  సెనగపిండి – 1 కప్పు, పనీర్‌ –ఒకటిన్నర లేదా 2 కప్పులు, కారం – 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి – 2 (చిన్నగా తురుముకోవాలి), మిరియాల పొడి – చిటికెడు, గరం మసాలా – 1 టీ స్పూన్, కొత్తిమీర తురుము – అర టేబుల్‌ స్పూన్‌, ఉప్పు – కొద్దిగా, నూనె – సరిపడా, నీళ్లు – తగినన్ని

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో సెనగపిండి, కారం, గరం మసాలా, మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. అందులో పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర తురుము, ఉప్పు వేసుకుని.. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనె వేడి చేసుకుని చిన్న చిన్న పనీర్‌ ముక్కలను అందులో ముంచి నూనెలో దోరగా వేయించుకోవాలి.

పెసరపప్పు హల్వా
కావలసినవి:
 పెసరపప్పు – 1 కప్పు, వేడి నీళ్లు – 2 కప్పులు, నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు, కిస్మిస్‌ – 2 టీ స్పూన్లు, బాదం తరుగు – 2 టీ స్పూన్లు, జీడిపప్పు తరుగు – ఒకటిన్నర టీ స్పూన్లు, నీళ్లు – పావు కప్పు, చిక్కటి పాలు – ముప్పావు కప్పు, పంచదార – అర కప్పు, ఏలకుల పొడి – చిటికెడు, కుంకుమ పువ్వు – పావు టీ స్పూన్‌ + పాలు – 3 టేబుల్‌ స్పూన్లు(కలిపి పక్కన పెట్టుకోవాలి)

తయారీ: ముందుగా వేడి నీళ్లలో 2 గంటల పాటు పెసరపప్పు నానబెట్టాలి. తర్వాత మిక్సీ పట్టుకుని పేస్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాత్ర పెట్టుకోవాలి. పాత్రలో నెయ్యి వేసుకుని వేడి కాగానే.. కిస్‌మిస్, బాదం తరుగు, జీడిపప్పు తరుగు వేసుకుని దోరగా వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యిలో పెసరపప్పు పేస్ట్‌ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. దగ్గర పడగానే.. నీళ్లు, ఆ తర్వాత పాలు వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు పంచదార కూడా వేసుకుని మరోసారి బాగా తిప్పాలి. తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా ఏలకుల పొడి, కుంకుమ పాలు వేసుకుని బాగా కలిపి స్టవ్‌ ఆప్‌ చేసుకోవాలి. సర్వ్‌ చేసుకునే ముందు కిస్మిస్, బాదం తరుగు, జీడిపప్పు తరుగుతో పాటు నచ్చిన ఢ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుని తింటే హల్వా చాలా రుచిగా ఉంటుంది.
సేకరణ: సంహిత నిమ్మ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top