
చైతన్యదీప్తి
నిరాడంబరంగా జీవించింది. నిదానమే ప్రధానం అన్నట్టు సాగింది. కానీ వేసిన ప్రతి అడుగూ చరిత్రలో నిలిచిపోయే విధంగా వేసింది.
నిరాడంబరంగా జీవించింది. నిదానమే ప్రధానం అన్నట్టు సాగింది. కానీ వేసిన ప్రతి అడుగూ చరిత్రలో నిలిచిపోయే విధంగా వేసింది.
- సుచేత గురించి ఒకచోట రాసిన మాటలు
ఒక రాష్ట్రానికి... మహిళ ముఖ్యమంత్రి కావడం కుదురుతుందా? మగవాళ్ల కనుసన్నల్లో కదిలే రాజకీయ ఎత్తుగడల మధ్య మహిళకు అసలది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించారు సుచేతా కృపలాని. ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని ఆమె ఉవ్విళ్లూరలేదు. ఆ పదవే ఆమె కోసం ఎదురు చూసింది. స్వాతంత్య్రం కోసం ఆమె చేసిన పోరాటమే ఆ మెట్లెక్కిచ్చింది.
దేశవిభజనకు దారి తీసిన నోవాఖలి దాడుల సమయంలో అందించిన సేవ... ఆమెను ఆ స్థాయిలో నిలబెట్టింది. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ... గాంధీజీ ఆమె మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని తన సత్తా నిరూపించుకున్న మహిళ సుచేతా కృపలానీ. భారత జాతీయ కాంగ్రెస్‌తో పని చేసినప్పటికీ ఆమె కాంగ్రెస్ అండతో మనలేదు. కాంగ్రెస్ నీడన ఎదగలేదు.
తనకు తానుగా తనను నిలబెట్టుకున్న వ్యక్తిత్వం ఆమెది. ఆచార్య కృపలాని... నెహ్రూతో విభేదించి సొంతంగా ‘కృషక్ మజుందార్ ప్రజాపార్టీ’ పెట్టినప్పుడు ఆయనకు అండగా నిలిచారామె. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి భర్తకు నైతిక మద్దతునిచ్చారు. కాంగ్రెస్‌లో చీలికలు వచ్చిన తర్వాత ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భార్యాభర్తలు రెండు పార్టీల్లో పని చేసినప్పుడు కూడా ఆమె తన పరిధి పట్ల స్పష్టమైన అవగాహనతో వ్యవహరించారు. భర్త గెలుపు కోసం ప్రచారం చేయలేదు. కానీ భర్త ఆరోగ్యం, మంచిచెడ్డలను చూసుకునేవారు.
సుచేతకు తాను చేస్తున్న పని పట్ల ఎంతో నిబద్ధత ఉంటుందనడానికి నిదర్శనం ఆమె వివాహమే. తనకంటే ఇరవై ఏళ్లు పెద్దవాడైన ఆచార్య కృపలానీతో వివాహాన్ని రెండు కుటుంబాలూ తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా ఆమె నిర్ణయం మారలేదు. లోక్‌సభ సభ్యురాలిగా ఆమె చట్టసభలో విధాన నిర్ణయాల్లోనూ అంతే స్పష్టమైన పాత్ర నిర్వహించారు. ఆ కార్యదక్షత ఉత్తరప్రదేశ్ రాజకీయ క్లిష్టత పరిష్కారానికి ఆధారమైంది.
1962లో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరస్పర విభేదాలతో రెండుగా చీలిపోయింది. కమలాపతి త్రిపాఠీ ఒక వర్గానికి నాయకత్వం వహించగా, సి.బి.గుప్తా మరొక వర్గాన్ని నడిపించారు. ఆ సమయంలో సి.బి గుప్తా నుంచి సుచేతకు ఆహ్వానం వచ్చింది. కాంగ్రెస్‌లో తలెత్తిన విభేదాల కారణంగా రాష్ట్రాన్ని నడిపించగలిగిన దీటైన నాయకత్వం చాలా అవసరమంటూ ఆ బాధ్యత తీసుకోవలసిందిగా ఆమెను కోరారాయన.
ముఖ్యమంత్రిగా...
1963లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సుచేత కృపలానీ దృఢచిత్తంతో రాష్ట్ర సమస్యలను చక్కబెట్టారు. సమర్థమైన కార్యనిర్వహణతోపాటు, సునిశితమైన రాజకీయ నాయకురాలిగా గుర్తింపుపొందారు. ఆమె హయాంలో ఉద్యోగులు 62 ఓజుల పాటు కొనసాగించిన సుదీర్ఘమైన నిరసన పోరాటాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. జీతాలు పెంచి తీరాలన్న ఉద్యోగుల డిమాండ్‌కు ఆమె తలవంచకపోవడంతోపాటు తన వాదనతో ఉద్యోగ సంఘాల నాయకులను సమాధానపరిచారామె.
మనదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ సుచేత. నిరాడంబరత, నిజాయితీతోపాటు తెలివైన, కష్టపడే తత్వం కలిగిన సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా మొదటి గుర్తింపు కూడా ఆమెదే. అత్యంత నిరాడంబరంగా జీవించిన కృపలానీ దంపతులు రాజకీయాల నుంచి వైదొలిగిన తరవాత వారి మనోభీష్టానికి తగినట్లు న్యూఢిల్లీలో అందమైన పొదరింటిని నిర్మించుకుని జీవించారు. సంపాదించిన డబ్బుని లోక్ కల్యాణ్ సమితి ద్వారా నిరుపేదల ఆరోగ్యసేవలకే ఖర్చు చేశారు. జాతీయోద్యమంలో ఉద్యమకారిణిగా నిప్పుకణికలా రగిలిన సుచేత... గృహిణిగా కూడా అంతే ఒద్దిగ్గా ఒదిగిపోయేవారు.
ఇంట్లో షర్బత్తులు, జామ్‌లు చేసుకుంటూ గడిపేవారు. ఆచార్య కృపలానీ చివరి రోజుల్లో బ్రాంకైటిస్‌తో బాధపడ్డారు. ఆయన సేవలకు ఓ నర్సు ఉన్నప్పటికీ సుచేత అర్ధరాత్రిళ్లు రెండుసార్లు లేచి ఆయనను చూసుకునేవారు. ఆ సమయంలో కూడా తన గుండె నొప్పిని చెప్పి ఆయన్ను బాధించడం ఇష్టం లేకపోయిందామెకి. వారి విశ్రాంత జీవితం అలా సాగుతున్నప్పుడే ఆమె ఆటోబయోగ్రఫీని ఒక వార పత్రికకు ధారావాహికగా రాయడం మొదలుపెట్టారు. కానీ అది నాలుగు వారాలకు మించి కొనసాగలేదు. ఎందుకంటే 1974 డిసెంబర్ ఒకటవ తేదీ రాత్రి ఆమె హార్ట్ అటాక్‌తో అందరికీ దూరమయ్యారు.
భారత జాతీయ కాంగ్రెస్‌తో పని చేసినప్పటికీ ఆమె కాంగ్రెస్ అండతో మనలేదు. కాంగ్రెస్ నీడన ఎదగలేదు. తనకు తానుగా తనను నిలబెట్టుకున్న వ్యక్తిత్వం ఆమెది.
- మంజులారెడ్డి