దారి చూపే నేస్తమా! | somanathudu poet friendship story | Sakshi
Sakshi News home page

దారి చూపే నేస్తమా!

Jan 11 2015 1:10 AM | Updated on Sep 28 2018 4:15 PM

దారి చూపే నేస్తమా! - Sakshi

దారి చూపే నేస్తమా!

చిన్న మాటలతో పెద్ద భావాన్ని తెలియపరిచే రచన చేయడంలోనే కవి వివేకముందంటున్నాడు పాల్కురికి సోమనాథుడు.

పద్యాన వనం
ఉరుతర గద్య పద్యోక్తుల కంటె - సరసమై పరగిన జానుదెనుంగు
చర్చింపగా సర్వ సామాన్య మగుట - గూర్చెద ద్విపదలు గోర్కి దైవార
దెలుగు మాట లనంగ వలదు వేదముల - కొలదియకా జూడు డిల నెట్టులనిన
బాటి తూమునకును బాటియౌనేని - బాటింప సోలయు బాటియకాదె
అల్పాక్షరము ననల్పార్థ రచన - కల్పించుటయ కాదె కవివివేకంబు.

 
చిన్న మాటలతో పెద్ద భావాన్ని తెలియపరిచే రచన చేయడంలోనే కవి వివేకముందంటున్నాడు పాల్కురికి సోమనాథుడు. దానికి ఓ చక్కని పోలిక కూడా చెప్పాడు. తెలంగాణలో మన్నికలో ఉన్న తూకాల్ని  ప్రస్తావించిన తీరు అద్భుతం. సంక్లిష్టమైన సంస్కృత పదాల ముందు తెలుగు మాటలు అల్పంగా కనిపిస్తాయని చిన్నబుచ్చుకోవద్దంటాడు. తూమెడు ధాన్యానికి సోలెడు ధాన్యం సరిసమానమయ్యేట్టయితే, సోలెడుకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కదా! గద్య-పద్య పద్ధతిలో కాకుండా జనపదాల్లో వాడుకలో ఉండి, చాలా సరసంగా ఉండే జానుతెనుగు భాషనే ఎంపిక చేసుకున్నాను అంటాడు. జనపదాల్ని చేరాలని ద్విపద పద్ధతిన తన బసవపురాణం రాశాడు.
 
సోమనాథుడు 13వ శతాబ్ది వాడని ప్రతీతి. తెలుగులో నన్నయ ఆదికవి అయినా, ఆయన రాసింది ఎక్కువ సంస్కృతమనే విమర్శ ఉంది. అందుకే తెలంగాణ ప్రాంతపు భాషావేత్తలు, పరిశోధకులు పాల్కురికి సోమనాథుడే తెలుగులో ఆదికవి అని వాదిస్తున్నారు. కుమార సంభవం రాసిన నన్నెచోడుడు కూడా కొంత తేలికైన తెలుగులోనే రచనకు పూనుకున్నట్టు కనిపిస్తుంది. ఇతడు నన్నయకన్నా పూర్వీకుడని కొందరు, కాదు సమకాలీకుడని ఇంకొందరు, తర్వాతి వాడని మరికొందరు వాదిస్తున్నా, సరైన కాల నిర్ధారణ జరిగినట్టులేదు. ‘‘మును మార్గ కవిత లోకంబున వెలయగ దేశి కవిత బుట్టించి తెనుంగును నిల్పి రంధ్ర విషయంబున జన చాళుక్యరాజు మొదలగు పలువుర్’’ అంటాడు.
 
సోమర్సెట్ మామ్ లాంటి ఆంగ్ల రచయితలు తేలికైన భాషలో రచనలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని ఇమిడ్చి చెప్పడం కవి సామర్థ్యం కిందే లెక్క. తెలుగులో కూడా మినీ కవితలు, రుక్కులు, ప్రపంచపదులు, టుమ్రీలు, నానీలు లాంటి సాహితీ ప్రక్రియలన్నీ ఇదే లక్ష్యాన్ని సాధించాయి.  

తక్కువ పదాల్లో, మాటల్లో, అక్షరాల్లో భావాల్ని వ్యక్తీకరించడం ఒక కళే! సోషల్ మీడియాలో అది అవసరం కూడా! ఎస్సెమ్మెస్ టెక్స్ట్ అయితే, చెప్పదలచుకున్నది 140 క్యారెక్టర్లలో చెప్పేయాల్సిందే!  మధ్యలో ఒకటి, రెండు దశాబ్దాలు చదవటం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఇటీవలి రెండు, మూడేళ్లుగా ఆ మంచి అలవాటు గాడిన పడుతోందనడానికి పుస్తక ప్రదర్శనలకు పెరుగుతున్న ఆదరణే సంకేతం. తప్పుటడుగులు పడకుండా దారి మలచుకోవడానికి ఉపయోగపడే ఏ పుస్తకమైనా ఓ మార్గదర్శి!
 - దిలీప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement