breaking news
Somanathudu
-
తెలుగునాట బొమ్మలాట
నేడు వరల్డ్ పప్పెట్రీ డే ఓ మధు, సాక్షి భరతాది కథల జీరమఱుగల... నారంగ బొమ్మలనాడించు వారు... కడు అద్భుతంబుగ కంబసూత్రంబు... లారగ బొమ్మలాడించువారు ... అనే పద్యం 12వ శతాబ్దానికి చెందిన పాల్కూరి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో మనకు కనిపిస్తుంది. అలాగే ఆలయాలలో లభ్యమయిన ఆనాటి శాసనాలను బట్టి కూడా చూసినప్పుడు బొమ్మలాటలు అంతకు ముందునుంటే ఉన్నాయనే విషయం రూఢీ అవుతుంది. వేమన యోగిగా మారడానికి కూడా తోలుబొమ్మలాట కారణమైందని ఒక కథనం ప్రాచుర్యంలో వుంది. నాచనసోముడు బొమ్మలాట గురించి తన రచనలలో కూడా ప్రస్తావించాడు. తెలుగువారి ఆటను మరాఠీ వారు తేర్పుగా ఆడించి తమ వశం చేసుకున్నారని పరిశోధనలు తెలుపుతున్నాయి. అయినా నేటికీ తెలుగు జానపద కళారూపాలలో ఒకటిగా బొమ్మలాటలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలలో వివిధ రకాల బొమ్మలాటప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. వాటిలో కొన్ని: మందెచ్చులు: కథకి ఎక్కువ ప్రాముఖ్యత వుంటుంది. గొల్లకులానికి ఆశ్రీత కులస్తులు ఈ బొమ్మలాటను ప్రదర్శిస్తుంటారు. చెక్కబొమ్మలు: చక్కని చెక్కబొమ్మలు తయారు చేసి రామాయణ, మహాభారత గాథలు ప్రదర్శిస్తుంటారు. తోలుబొమ్మలు: బాగా ప్రాచుర్యంలో వున్న తోలుబొమ్మలాటలో ఒక్కొక్క బొమ్మను మలచటం నుంచి ప్రదర్శించే తీరు వరకూ చక్కటి కళా నైపుణ్యాన్ని చూడవచ్చు. పెద్దమ్మలు: నెత్తిన బొమ్మలు పెట్టుకుని ఆడిస్తారు. కీలుగుర్రాలు: గుర్రాలతో కూడిన బొమ్మలాట బుట్టబొమ్మలు: బొమ్మలను తొడుక్కుని ఆడుతారు. ప్రత్యేకంగా కథలు చెప్పటం వుండదు. పటం కథలు! పటాలపై చిత్రీకరించిన బొమ్మల ఆధారంగా కథ చెబుతారు. వీటిలో తోలు, కొయ్య, చెక్కబొమ్మలాటలలో మాత్రమే పూర్తి నిడివి బొమ్మలను చూపిస్తూ కథ చెప్పటం జరుగుతుంది. మార్చి 21 ప్రపంచ వ్యాప్తంగా మార్చి 21ని పప్పెట్రీడేగా సెలబ్రేట్ చేసుకోవటం 2000 సం॥నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో రకరకాల పప్పెట్ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా ప్రతి ఏడాది ఆదిలాబాద్‌లోని కళాశ్రమంలో జరిగే మిత్ ్రమిలాన్ వేడుకలలో... దేశవిదేశాల నుంచి అనేకమంది ప్రముఖులు పాల్గొంటారు. ఈ కళాసంరంభంలో మూడు రకాల బొమ్మలాట ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అలాగే కొడంగల్‌లోనూ రంగారెడ్డి జిల్లా కళాకారులు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సప్తపర్ణిలోనూ పిల్లల కోసం బొమ్మలాట నిర్వహిస్తున్నారు. (ఇన్పుట్స్: గంజి మాధవీలత, పప్పెటీర్, రీసెర్చ్ స్కాలర్) -
దారి చూపే నేస్తమా!
పద్యాన వనం ఉరుతర గద్య పద్యోక్తుల కంటె - సరసమై పరగిన జానుదెనుంగు చర్చింపగా సర్వ సామాన్య మగుట - గూర్చెద ద్విపదలు గోర్కి దైవార దెలుగు మాట లనంగ వలదు వేదముల - కొలదియకా జూడు డిల నెట్టులనిన బాటి తూమునకును బాటియౌనేని - బాటింప సోలయు బాటియకాదె అల్పాక్షరము ననల్పార్థ రచన - కల్పించుటయ కాదె కవివివేకంబు. చిన్న మాటలతో పెద్ద భావాన్ని తెలియపరిచే రచన చేయడంలోనే కవి వివేకముందంటున్నాడు పాల్కురికి సోమనాథుడు. దానికి ఓ చక్కని పోలిక కూడా చెప్పాడు. తెలంగాణలో మన్నికలో ఉన్న తూకాల్ని ప్రస్తావించిన తీరు అద్భుతం. సంక్లిష్టమైన సంస్కృత పదాల ముందు తెలుగు మాటలు అల్పంగా కనిపిస్తాయని చిన్నబుచ్చుకోవద్దంటాడు. తూమెడు ధాన్యానికి సోలెడు ధాన్యం సరిసమానమయ్యేట్టయితే, సోలెడుకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కదా! గద్య-పద్య పద్ధతిలో కాకుండా జనపదాల్లో వాడుకలో ఉండి, చాలా సరసంగా ఉండే జానుతెనుగు భాషనే ఎంపిక చేసుకున్నాను అంటాడు. జనపదాల్ని చేరాలని ద్విపద పద్ధతిన తన బసవపురాణం రాశాడు. సోమనాథుడు 13వ శతాబ్ది వాడని ప్రతీతి. తెలుగులో నన్నయ ఆదికవి అయినా, ఆయన రాసింది ఎక్కువ సంస్కృతమనే విమర్శ ఉంది. అందుకే తెలంగాణ ప్రాంతపు భాషావేత్తలు, పరిశోధకులు పాల్కురికి సోమనాథుడే తెలుగులో ఆదికవి అని వాదిస్తున్నారు. కుమార సంభవం రాసిన నన్నెచోడుడు కూడా కొంత తేలికైన తెలుగులోనే రచనకు పూనుకున్నట్టు కనిపిస్తుంది. ఇతడు నన్నయకన్నా పూర్వీకుడని కొందరు, కాదు సమకాలీకుడని ఇంకొందరు, తర్వాతి వాడని మరికొందరు వాదిస్తున్నా, సరైన కాల నిర్ధారణ జరిగినట్టులేదు. ‘‘మును మార్గ కవిత లోకంబున వెలయగ దేశి కవిత బుట్టించి తెనుంగును నిల్పి రంధ్ర విషయంబున జన చాళుక్యరాజు మొదలగు పలువుర్’’ అంటాడు. సోమర్సెట్ మామ్ లాంటి ఆంగ్ల రచయితలు తేలికైన భాషలో రచనలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని ఇమిడ్చి చెప్పడం కవి సామర్థ్యం కిందే లెక్క. తెలుగులో కూడా మినీ కవితలు, రుక్కులు, ప్రపంచపదులు, టుమ్రీలు, నానీలు లాంటి సాహితీ ప్రక్రియలన్నీ ఇదే లక్ష్యాన్ని సాధించాయి. తక్కువ పదాల్లో, మాటల్లో, అక్షరాల్లో భావాల్ని వ్యక్తీకరించడం ఒక కళే! సోషల్ మీడియాలో అది అవసరం కూడా! ఎస్సెమ్మెస్ టెక్స్ట్ అయితే, చెప్పదలచుకున్నది 140 క్యారెక్టర్లలో చెప్పేయాల్సిందే! మధ్యలో ఒకటి, రెండు దశాబ్దాలు చదవటం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఇటీవలి రెండు, మూడేళ్లుగా ఆ మంచి అలవాటు గాడిన పడుతోందనడానికి పుస్తక ప్రదర్శనలకు పెరుగుతున్న ఆదరణే సంకేతం. తప్పుటడుగులు పడకుండా దారి మలచుకోవడానికి ఉపయోగపడే ఏ పుస్తకమైనా ఓ మార్గదర్శి! - దిలీప్‌రెడ్డి