భక్తి

Somaiya meets the route in the travel - Sakshi

కాశీ క్షేత్రానికి కాలినడకన బయలుదేరాడు రామయ్య. దారిలో అతనికి సోమయ్య అనే బాటసారి కలిశాడు. ఇద్దరూ కొద్ది సమయంలోనే స్నేహితులై కలసి ప్రయాణం చేయసాగారు.  అలా కొంతదూరం వెళ్ళేసరికి దారిలో రామయ్యకు బంగారునాణెం దొరికింది.‘‘పాపం. ఎవరో దురదృష్టవంతులు. జాగ్రత్తచేయి. తిరుగుప్రయాణంలో ఇచ్చేద్దాం’’ అన్నాడు సోమయ్య.‘‘వాడు ఎవడో పోగొట్టుకున్నాడు. వాడు దురదృష్టవంతుడు. నాకు దొరికింది. నేను అదృష్టవంతుడను. ఇద్దరం ఒకే రహదారిపై నడుస్తున్నాం. ఇది నాకే ఎందుకు దొరకాలి.? నీకు ఎందుకు దొరకకూడదు? ఎందుకంటే నేను అదృష్టవంతుడను కాబట్టి.నాకు దక్కిన అదృష్టాన్ని నేనెందుకు వదులుకుంటాను? వదులుకోను. లక్ష్మీదేవి తలుపు కొట్టినప్పుడే తియ్యాలట. అలా ఈ బంగారునాణెం నన్ను వరించింది.’’ అన్నాడు గర్వంగా. ఏమీ మాట్లాడలేదు సోమయ్య. కొద్దిరోజులకు కాశీనగరం ప్రవేశించారు. అలా ప్రవేశించిన కాసేపటికే బంగారునాణెం ఉన్న రామయ్య మూటను ఎవరో దొంగిలించారు. కట్టుగుడ్డలతో మిగిలాడు రామయ్య.‘‘ఎవరో ఆ మూట దొరికిన అదృష్టవంతులు’’ అన్నాడు సోమయ్య.ఆ మాటలకి కోపం వచ్చిన రామయ్య ‘‘వేళాకోళం చేస్తున్నావా?’’ అన్నాడు సోమయ్యను చూస్తూ.  ‘‘కాదు. నువ్వన్నదే నీకు చెబుతున్నాను. దొరికినవాళ్ళు అదృష్టవంతులు అన్నావు. బంగారునాణెం దొరికి నువ్వు అదృష్టవంతుడవు అయితే.. ఆ నాణెంతో సహా నీ మూట దొరికినవాడూ అదృష్టవంతుడే కదా!’’ అన్నాడు అతి మామూలుగా.

‘‘ఒక స్నేహితునిగా నాబాధ నీబాధ కాదా? పైగా వేళాకోళం చేస్తున్నావు..’’ అన్నాడు రామయ్య.‘‘స్నేహితుణ్ణి కాబట్టే నీ మేలుకోరి.. బంగారునాణెం దొరికినప్పుడు జాగ్రత్తచేయి తిరుగుప్రయాణంలో ఇచ్చేద్దాం అన్నాను. అది నీ అదృష్టంగా భావించి ఇవ్వనన్నావు. మనదికాని వస్తువు మన దగ్గర నిలవదు. అది వెళుతూ వెళుతూ మనది కూడా పట్టుకుపోతుంది. నువ్వే నిజమైన భక్తుడివైతే తిరుగుప్రయాణంలో ఆ వ్యక్తి ఎవరో.. ఆతను పోగొట్టుకున్న బంగారునాణెం అతనికి తిరిగి ఇచ్చి అతణ్ణి మరింత అదృష్టవంతుణ్ణి చేసేవాడివి.  ఎందుకంటే వస్తువు దొరికినవాడు అదృష్టవంతుడైతే, పోగొట్టుకున్న వస్తువును తిరిగిపొందిన వాడిది మరింత అదృష్టం. కానీ నువ్వు అసలైన భక్తుడివి కావు. అందుకే ఆ నాణెం ఉంచేసుకున్నావు. అది మొత్తాన్నే పట్టుకుపోయింది.‘‘నిజమేసుమా..! పరాయి సొమ్ము ఆశించటం నిజమైనభక్తుల లక్షణం కాదు. ఒకవేళ పోయిన నా మూట నాకు దొరికితే గనుక ఆ బంగారు నాణేన్ని అతనికి తిరిగి ఇచ్చేస్తాను..’’ అన్నాడు పశ్చాత్తాపంతో.. ఇంతలో వెనకనుండి..‘ ఎవరో వృద్ధుడు...‘‘అయ్యా..! ఈ మూట తమరిదే కదా? ఇందాక మీరు దీనిని గట్టుమీద పెట్టి గంగలో స్నానానికి దిగినప్పుడు దొంగ దీనిని తస్కరించటం చూసి వెంటాడి తరిమిపట్టుకున్నాను. ఇందాకట్నించీ మీకోసం వెదుకుతున్నాను.. ఇప్పుడు కనపడ్డారు.. తీసుకోండి’’ అన్నాడు.‘ఇన్నివేలమందిలో పోయిన వస్తువు దొరకటం చిన్నవిషయం ఏమీకాదు. ఇదే నిజమైన అదృష్టం..’’ అంటూ ఆ వృద్ధునికి నమస్కరించాడు. అతను వెళ్ళిపోయాకా..మూటలోని బంగారునాణెం బయటికి తీసి చూస్తూ..‘‘మాటల్లో మీరూ, చేతల్లో ఆ వృద్ధుడు నా కళ్ళు తెరిపించారు. దీనిని తిరుగు ప్రయాణంలో ఆ పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఇచ్చి అతణ్ణి నా అంత అదృష్టవంతుణ్ణి చేస్తాను..’’ అన్నాడు పశ్చాత్తాపపడుతూ..‘‘అదే అసలైన భక్తి..’’ అన్నాడు సోమయ్య. 
కన్నెగంటి అనసూయ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top