వినాయకుడి విగ్రహం

seen is ours tittle is  yours - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

తెలుగులో చిన్న బడ్జెట్‌ సినిమాల్లో ఒక ప్రభంజనం సృష్టించిన సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమా తర్వాత క్రైమ్‌ కామెడీ అన్నది తెలుగులో పాపులర్‌ జానర్‌గా మారిపోయింది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... 

ప్రసిద్ధ విష్ణు దేవాలయం. తిరువనంతపురం (కేరళ).సంపద లెక్కింపు జరుగుతున్న రోజులు.. అక్కడ పనిచేస్తున్న పూజారి, సెక్యూరిటీ ఆఫీసర్‌ కలిసి ఒక వెల కట్టలేని వినాయకుడి విగ్రహాన్ని తస్కరించారు. సూర్యోదయం అవ్వడానికి ఇంకా కొద్ది సమయం ఉంది. పూజారి చేతుల్లో ఉన్న విగ్రహం, అక్కడున్న ఏ కంటికీ కనిపించకుండా గుడికి దూరంగా కారులో కూర్చొని అంతకు గంటముందు నుంచే అక్కడ ఎదురుచూస్తున్న వ్యక్తి చేతుల్లోకి వెళ్లింది.ఆ వ్యక్తి ఒక తెల్లటి గుడ్డలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకున్నాడు. కారు స్టార్ట్‌ చేశాడు. హైవే మీద ఆ కారు అలా దూసుకెళ్లిపోతోంది. ఎదురుగా పెద్ద గుంత. కారు ఎగిరి గాల్లో పల్టీలు కొడుతోంది. ఆ విగ్రహం ఎక్కడో రోడ్డు పక్కన పడిపోయింది. అందులోని వ్యక్తి అదే రోడ్డుకి అటుపక్కన పడిపోయాడు.  ఆ విగ్రహం రోడ్డు పక్కనే చాలాసేపు ఉంది. ఒక చిన్నపిల్లాడు వచ్చి తీసుకునే వరకూ అదక్కడే ఉంది. ఆ పిల్లాడి చేతుల్లోకి వెళ్లినప్పుడు ఆ విగ్రహం విలువ సున్నా. అది ఆ పిల్లాడి దగ్గర్నుంచి వాళ్ల నాన్న దగ్గరికి, ఆ నాన్న దగ్గర్నుంచి వీధి చివరి జ్యూవెలరీ వర్క్స్‌ అతని దగ్గరికి, అక్కణ్నుంచి పెద్ద షాపుకు, అక్కణ్నుంచి నగల వ్యాపారికి... చేతులు మారుతూ మారుతూ విలువ పెంచుకుంటూ పెంచుకుంటూ పోయింది. కోటీ పది లక్షల రూపాయలు. చాలా చేతులు మారిన ఆ విగ్రహం ఈ ధర దగ్గర వచ్చి ఆగినప్పుడు ఒక బ్యాగ్‌లో అనుకోకుండా పడింది. ఆ బ్యాగ్‌ స్వాతిది. తన బ్యాగ్‌లో కోట్లు విలువ గల ఒక విగ్రహం ఉన్న విషయం స్వాతికి తెలియదు. 

సూర్య, భాను, రవి.. ముగ్గురు మంచి ఫ్రెండ్స్‌. ఏ పని చేసినా కలిసి చేస్తారు. వాళ్లకంటూ ఉన్న ఒక్కటే పని దొంగతనం. జేబులు కొట్టడం, చిన్న చిన్న మోసాలు చేయడం, అప్పటికలా బతికేయడం వాళ్ల పని. వాళ్లకు ఈ దొంగతనాల మధ్యనే, వీళ్లు దొంగలుగా కాకుండా పరిచయమయింది స్వాతి. కొద్దిరోజుల్లోనే స్వాతి ఈ గ్యాంగ్‌లో ఒకరుగా చేరిపోయింది. కాకపోతే, ఈ గ్యాంగ్‌ చేసే పనులేవీ ఆమెకు తెలియదు. సూర్య వాళ్లింటి పక్కనే ఉండే ఒక అనాథ పిల్లాడికి చదువు చెప్పేంత దగ్గరైపోయింది స్వాతి ఈ గ్యాంగ్‌కి. సూర్య అంటే ఆమెకు ప్రేమ కూడా. అలాగే సూర్యకూ. ఇద్దరిదీ మంచి జోడీ. స్వాతితో ప్రతిపూటా ఫోన్లో బిజీగా గడిపేస్తోన్న సూర్యను చూస్తూ, ‘‘వీడు ఈ మధ్య పని మానేసి ఈ పన్లో పడ్డాడు.’’ అన్నాడు రవి. అవునంటూ భాను కూడా సూర్యకు చిన్న వార్నింగ్‌ ఇచ్చింది. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సూర్య ఇంటి పక్కనుండే పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తూనే గట్టిగా అరుస్తూ చెప్పాడు – ‘‘అన్నా! టీవీ పెట్టన్నా’’. అందరూ టీవీ ముందు వాలిపోయి న్యూస్‌ చూస్తున్నారు. కేరళలోని విష్ణు దేవాలయంలో వినాయకుడి విగ్రహం చోరీకి గురైందన్న వార్త అన్ని చానళ్లలో ప్రధానంగా వినిపిస్తోంది. పిల్లాడు ఈ న్యూస్‌ ఎందుకు చూపిస్తున్నాడో సూర్యకు అర్థం కాలేదు. వాడి వైపు చూస్తూ, ‘‘ఏంట్రా!’’ అనడిగాడు. 

ఆ పిల్లాడు మెల్లిగా, జాగ్రత్తగా తన జేబులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తీసి చూపించాడు. ‘‘ఎక్కడిదిరా నీకు?’’ అడిగింది భాను. పిల్లాడు తాను ఆ విగ్రహాన్ని స్వాతి బ్యాగులో కాజేసినట్టు చెప్పాడు. సూర్య ఆ విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకొని తీక్షణంగా పరీక్షించి, ‘‘అమ్మేద్దాం!’’ అన్నాడు. ‘‘దేవుడితో వ్యాపారమా? రిస్కేమోరా..’’ అన్నాడు రవి. ‘‘రిస్కేంటిరా! యాజిటీజ్‌ ఒరిజినల్‌ లాగానే ఉంది. అమ్మితే ఎంతో కొంత వస్తుంది.’’ అన్నాడు సూర్య. దాన్ని కొనగలిగే వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టారు. సాలర్‌జంగ్‌ శంకర్‌ను పట్టుకున్నారు.శంకర్‌ఇలాంటి వెలకట్టలేని వస్తువులను కాజేసో, కాజేసిన వాళ్ల దగ్గర్నుంచి తక్కువకు కొనో దందా నడిపిస్తుంటాడు. అదే అతని వ్యాపకం. సూర్య గ్యాంగ్‌ శంకర్‌ ఇంట్లో ఉన్నారు. ‘‘విగ్రహం?’’ అడిగాడు శంకర్‌.సూర్య తన జేబులోంచి విగ్రహాన్ని తీసి శంకర్‌ చేతుల్లో పెట్టాడు. ఆ సమయానికి అక్కడున్న ఎవ్వరికీ ఆ విగ్రహం ఎంత విలువ చేయగలదన్న దానిమీద అవగాహనే లేదు. ఆ విగ్రహాన్ని పరీక్షగా చూసిన శంకర్, ‘‘ఒక్క నిమిషం..’’ అంటూ దాన్ని తన వాళ్లకు చూపించడానికి లోపలికి తీసుకెళ్లాడు. తమ దగ్గరున్న కెమికల్స్‌తో విగ్రహాన్ని పక్కాగా టెస్ట్‌ చేయించాడు. ‘‘నా అరవై ఏళ్లసర్వీస్‌లో ఇంత విలువైన విగ్రహాన్ని చూడటం ఇదే మొదటిసారి.’’ అన్నాడు శంకర్‌ గ్యాంగ్‌లోని ఓ పెద్దాయన. 

‘‘ఎంతకి అమ్మొచ్చు?’’ అడిగాడు శంకర్‌. ‘‘పది కోట్లకు పైనే సార్‌!’’ అన్నాడు ఆ పెద్దాయన. శంకర్‌కు ఎక్కడిలేని ఉత్సాహం వచ్చింది. ఒక ఐదు కోట్లు రెడీ చేస్కోమని తన వాళ్లకు చెప్పి, సూర్య గ్యాంగ్‌ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ‘‘ఎంత కావాలో చెప్పండి?’’ అడిగాడు శంకర్‌. ‘‘మీరే చెప్పండి..’’ అన్నాడు సూర్య. మూడు అన్నాడు శంకర్‌. ఏడు అన్నాడు సూర్య. చివరకు ఐదుకు ఫిక్స్‌ చేసుకున్నారు. ఐదు కోట్ల రూపాయల బ్యాగ్‌ను వాళ్లకు ఇచ్చేయమంటూ సైగ చేశాడు శంకర్‌. సూర్య, రవి, భాను ఎగై్జటింగ్‌గా డబ్బులు అందుకోవడానికి ఎదురుచూస్తున్నారు. రవి అప్పుడే టైమ్‌ చూస్కొని, ‘‘ఆగండి. ఏం లేదు కొంచెంపెద్ద అమౌంట్‌ కదా.. ఐదు నిమిషాలు పోతే రాహుకాలం అయిపోతుంది. అప్పుడు తీస్కుంటే బాగుంటుందని..’’ అన్నాడు. ‘‘ఏంట్రా నీ ఎదవ చాదస్తం..’’ విసుక్కున్నాడు సూర్య. ‘‘ఏ.. ఐదు లక్షల కోసం ఐదు నిమిషాలు ఆగలేవా? చచ్చిపోతావా?’’ విసుగ్గానే చెప్పాడు రవి. శంకర్‌ వీళ్లిద్దరి మాటల్ని వింటూ షాకింగ్‌గా చూస్తూండిపోయాడు. ‘‘ఐదంటే.. ఐదు లక్షలేగా?’’ అన్నాడు అనుమానంగా. ‘‘ఏ! ఐదు వేలనుకున్నావా?’’ వెటకారంగా అన్నాడు రవి. ‘‘ఆరు లక్షలని వినిపిస్తేనూ..’’ శంకర్‌ ఆనందాన్ని దాచిపెడుతూ సమాధానమిచ్చాడు.     ‘‘రాహుకాలం దాటేసింది. మీరిచ్చేయండి..’’ అన్నాడు రవి. శంకర్‌ బ్యాగులోంచి ఐదు లక్షలు తీసి వాళ్ల చేతుల్లో పెట్టాడు. వాళ్లు అంతసేపూ బేరమాడింది కోట్ల రూపాయలకని, వాళ్లు ఒరిజినల్‌లా ఉందని తెచ్చిచ్చిన వినాయకుడి విగ్రహం నిజంగానే ఒరిజినల్‌ అని అప్పటికి సూర్య గ్యాంగ్‌కి తెలియదు.   

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top