దశావతారం

దశావతారం


కథ


స్త్రీల కోసం ఒక సంస్థ రెస్క్యూ హోం నడుపుతుంటే అక్కడ నాకు డ్యూటీ వేసారు. ప్రేమ పేరుతో  వంచించబడ్డ అమ్మాయిలు,  బ్రోతల్ హౌస్‌ల నుండి రక్షించబడిన వాళ్ళు ఇలా అందరూ ఒక రకంగా జీవచ్ఛవాలే. అవును సార్ నేను నిద్రపోయి చాలా సంవత్సరాలే అయింది. హోటల్లో ఆయన పెట్టించిన సాంబారు ఇడ్లీ తింటూ చెప్పాను. బెయిలు మీద  విడిపించి సరాసరి ఇక్కడకు తీసుకొచ్చాడు.  మూడు నెలలైంది జైలుకెళ్ళి. బెయిలు దొరకడం కష్టమే అన్నారు. మరి ఈ పెద్దాయన ఎలా ఇప్పించాడో, ఎందుకు ఇప్పించాడో తెలీదు. 


ఉన్న మూడు నెలల్లో పక్క ఖైదీలు ఒకటే గొడవ వీడేంటి సార్ అసలు నిద్రపోడు, గుడ్లగూబలా! ఏరా పారిపోడానికి పథకాలేస్తున్నావా? అని సెంట్రీలు వెటకారమాడేవాళ్ళు. ఎక్కడ నుండి ఎక్కడికి పారిపోవాలి.జైల్లో కూర్చుని నా ఆత్మ కథ రాసుకోడానికి నేనేం మహాత్ముడిని కాను కానీ పాపాత్ముడినీ కాను.  మరి సహాయం చేసిన ఈ బాబు అడిగితే నా కథ చెప్పకుండా ఉండలేకపోతున్నాను.


ప్రస్తుతం ఇరవై రెండో ఏడు...

అసలు నేనెందుకు మందు తాగుతాను చెప్పండి. నాకు పదేళ్ళు నిండకుండానే మా నాన్న తాగి తాగి మా అమ్మని చావగొట్టాడు. తర్వాత వాడు చచ్చాడు. మరి ఆ రోజు తాగి పట్టుబడ్డవేంటి అంటారా. అరేయ్ తాగుడు అలవాటు లేదా అని పగలబడి నవ్వి నా ముక్కు మూసి అర గ్లాసు మద్యం నోట్లో పోసారండి ఖాకీ బాబులు. 


ఒరేయ్ అమ్మాయిల (సభ్యత కోసం ఈ మాట) కంపెనీలో ఇమడలేకపోయా అన్నావ్, రెస్క్యూ హోంలో తిన్నగా ఉద్యోగం చేసావా, ఎవతినో ప్రేమించావట, అది జెల్ల కొట్టిందట, నువు తన్నులు తిని ఉద్యోగం పోగొట్టుకున్నావు, బార్‌లో బౌన్సర్ ఉద్యోగం పోయిందా.  నీ బ్యాక్‌గ్రౌండ్ తెలీక ఇదిగో ఈ అయ్యగారు నెల క్రితం డ్రైవర్ ఉద్యోగం ఇచ్చారు. ఎంత కృతజ్ఞత ఉండాలి.  పెద్దింటి అమ్మాయి జైలుకెళ్తే పెళ్ళవుతుందా. వెంటనే బెయిలు వచ్చే ఏర్పాటు చేస్తారు. ఆర్నెల్లో, యేడాదో శిక్ష వేస్తారు. బయటికొచ్చాక మూడు లక్షలు ఇప్పిస్తాం. వ్యాపారం చేసుకుందువు అని నచ్చ చెప్పారు. ఈ పోలీసులే నా బాల్యంలో వ్యాపారం కోసమని పోగుచేసుకున్న ఐదు వేలు ఎక్కడ దొంగతనం  చేసావురా అని లాగేసుకున్నారు.


పబ్‌లో ఫుల్లుగా తాగేసి రేయ్ నువు తప్పుకో అని మహా తల్లి డ్రైవింగ్ మొదలుపెట్టింది. ఫుట్‌పాత్ పైకి ఎక్కేసిన కారు. తాగిన మత్తు వదిలి డ్రైవింగ్ సీట్లో నుండి కంగారుగా దిగింది.  పక్క సీట్లో నుండి నేనూ కంగారుగా దిగాను. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది. ఆయనవి ఎన్ని తలలు తీసి సంపాయించిన తెలివితేటలో. డ్రైవర్  కారు కొంచెం వెనక్కి తీస్తావా అంది. సరేనమ్మా అని నేను డ్రైవింగ్ సీట్లో కూర్చునేసరికి జనం పోగడ్డారు. ఫుట్ పాత్‌పై ఒకడు చచ్చి పడున్నాడు. ఇంకోడు చావు బతుకుల్లో.  బెయిలు గురించి పట్టించుకున్నోడే లేడు. తాగి కారు నడిపానని, తప్పు జరిగిందని  వొప్పేసుకున్నా కద. ఇదిగో మీరు వచ్చి ఏర్పాటు చేసారు. నాకు నిద్ర పట్టకపోవడానికి ఇది కారణం కాదు.


నా ఇరవై ఒకటో యేట.... జీవచ్ఛవాలు

మా నాన్న పర్సనాలిటీయే వచ్చింది నాకు. పహిల్వాన్‌లా ఉండేవాడు. ఎందుకూ పనికిరానోడు కానీ కోస్తే వూరికి సరిపోతాడు అనేవాళ్ళు.సెక్యూరిటీ కంపెనీ వాళ్ళు నన్ను గార్డ్‌గా తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ పని చెయ్యాలి. ఎవడో చెప్పాడు. మా తరఫున పది వేలు తీసుకుని మాకు ఐదు వేలు ఇస్తారంట. స్త్రీల కోసం ఒక సంస్థ రెస్క్యూ హోం నడుపుతుంటే అక్కడ నాకు డ్యూటీ వేసారు. ప్రేమ పేరుతో వంచించబడ్డ అమ్మాయిలు, బ్రోతల్ హౌస్‌ల నుండి రక్షించబడిన వాళ్ళు ఇలా  అందరూ ఒక రకంగా జీవచ్ఛవాలే. సినిమా మోజుతో ఇల్లొదిలి పారిపోయి మళ్ళీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళే ధైర్యం చేయలేని ఆడ పిల్లలు. ఇది మళ్ళీ ఒక ఖైదు అని పారిపోవడానికి ప్రయత్నించే వాళ్ళు తక్కువ కాదు. వాళ్ళు పారిపోకుండా చూడడమే నా పని. ఒక అమ్మాయి ఏ కారణం వల్ల అక్కడ ఉందో తెలీదు కానీ నాకు బాగా నచ్చింది.


ఏంట్రా బాబూ ఇంతందంగా ఉన్నావు. ఈ ఉద్యోగం ఏం ఖర్మ. సినిమాల్లో ప్రయత్నం చేస్కో అంది మొదటి రోజే.  అంతవరకూ  ఏ అమ్మాయీ నాతో అంత చనువుగా మాట్లాడింది లేదు.నాకా అమ్మాయి అంటే విపరీతమైన ఇష్టముండేది. నన్ను ఏరా అని పిలిచేది. నాతో తెగ పరాచికాలాడేది. సెక్సీగా మాట్లాడి కవ్వించేది.  కోపమొస్తే నీ యయ్య అనేది.నాతో మొైబల్ రీచార్జ్, నెట్ రీచార్జ్ చేయించుకునేది. నా పుట్టిన రోజుకి బహుమతేం కొంటావురా, దీపావళికి కొత్త చీర కొను అని ఏదో ఒక సందర్భం చెప్పి సతాయించి కొనిపించుకునేది. గంటల తరబడి సెల్‌లో మాట్లాడేది. మా అమ్మావాళ్ళని, బంధువులని చెప్పేది.నాకో లక్ష రూపాయలు కావాల్రా.  అడిగింది ఒకసారి.


ఎందుకు?

స్థలం కొనుక్కోవాలని నా డ్రీం. నా పేరున అంటూ స్థలం ఉంటే అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. ఎంత చిన్నదయినా సరే నాది అనే ఫీలింగ్ చూసావూ ఎంత బాగుంటుందో!అవును, నాది అనే ఫీలింగ్. నువ్వు నా దానివి ఐషూ అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది అన్నాను. కిలకిలా నవ్వింది. అన్నట్టు మన శోభనం అక్కడే అంది. నా దగ్గర యాభై వేల వరకూ ఉన్నాయి అని చెప్పాను. ఆ డబ్బు ఎవరో స్నేహితుడి అకౌంట్ ఇచ్చి అందులో వేయించుకుంది. మిగతా డబ్బు తొందరగా సర్దరా బాబూ అంది.నా దగ్గర లేవే అంటే అప్పు చెయ్ నాయనా నాకోసం చెయ్యలేవారా అని ముద్దుగా అడిగింది. ‘నన్ను వదిలి వెళ్ళవుగా’ బేలగా అడిగేవాడిని చాలా సార్లు.


నువ్వో, నేనో చచ్చేదాకా వదలను సరేనా నమ్మకంగా చెప్పేది.మాకు ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం దొరికేది కాదు. నాకు ఎస్.ఎం.ఎస్ లు ఇవ్వడం బాగా అలవాటు చేసింది. పరాచికాలు, అలగడాలు, దెబ్బలాడడం మళ్ళీ కలిసిపోవడం, ముద్దులు అన్నీ ఎస్.ఎం.ఎస్ లోనేనేనేదైనా  సరదాగా మాట్లాడితే నా మూతి మీద సుతారంగా వేలితో కొట్టేది. నా వేలు కొరికేది. ఇలాంటి చిన్న చిన్న అనుభవాలకే పరవశించి పోయేవాడిని. ఆ అమ్మాయి మీద నా ఇష్టం అమాంతం పెరిగిపోయేది.ఏం మాట్లాడతావు అంతంతసేపు అనడిగితే నా మీద అనుమానం కదా మనం విడిపోదాం అనేది. ఒద్దొద్దు అదేంలేదు అని కంగారు పడేవాడిని.ఒకసారి ఎవర్తోనో ఒరేయ్ అని మాట్లాడేస్తోంది.


నా క్లాస్ మేట్. నువు నమ్మవు. సరే సిమ్ విరగొట్టేస్తా అంది.చచ అదేం లేదు అన్నాను. మూడు రోజులు నా వంక చూడలేదు. బాధతో విలవిల్లాడిపోయాను.నాలుగో రోజు నా వంక చూసింది. నా కళ్ళల్లో నీళ్ళు చూసి నా కోసం ఏడ్చావురా బంగారం నిన్ను చాల బాధ పెట్టాను కదా సారీరా అంది. నేను కరిగిపోయాను.ఎంతకాలం ఇలా పారిపోవడానికి పథకం వెయ్యి అంది. నేను నీ భుజాలమీద ఎక్కి గోడ అవతలికి దూకి నా చున్నీ నీకు అందిస్తానంటే సరే అన్నాను. దాని చున్నీ ఇవతలకి రాలేదు కానీ రెస్క్యూ హోం వాళ్ళు నా వెనకాల వచ్చారు. నా వొళ్ళంతా చీరిపోయి రక్తం వచ్చేలా కొట్టారు.తర్వాత కానీ తెలీలేదు అది నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయిందని. గోడ అవతల దాని అసలు ప్రియుడు కాచుకుని ఉన్నాడట.  సంవత్సరం పాటు ఏడ్చాను.  నాకు నిద్ర పట్టకపోవడానికి ఇదీ కారణం కాదు.


నా పద్దెనిమిదో యేట...

చెప్పాను కదా, మా నాన్న పుణ్యమా అని నేను మంచి వొడ్డూ, పొడుగూ ఉంటాను.  చెత్త ఏరడం అనే మంచి పని మానేసాక చాలా చెత్త పనులు చేసాను. వాటిల్లో కొన్ని...  క్లబ్‌లో బౌన్సర్‌గా అంటే తాగి ఎవడన్నా గొడవ చేస్తుంటే వాడ్ని బయటకు విసిరేయడమన్న మాట.


బార్లో నుండి ఒకతను తూలుతూ బయటకు వచ్చాడు. బయట అతడి భార్య అనుకుంటా... తాగి ఇల్లు గుల్ల చేస్తున్నావంటూ గొడవ పెట్టుకుంది. అతను కోపంతో ఆమెను ఇష్టమొచ్చినట్లు చేతులతో, కాళ్లతో తన్నడం మొదలుపెట్టాడు. అందరూ చోద్యం చూస్తున్నారు. ఆమె ప్రతిఘటించ లేక ఏడుస్తోంది. ఆమెను చూస్తే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. వాడిని చితక బాదేశాను. కస్టమర్లు దేవుళ్లంటా, క్లబ్ వాళ్లు నా ఉద్యోగం పీకేశారు.


ఒక రోజు ట్రాఫిక్ లైట్ల దగ్గర ఆటోలో కూర్చుని ఉంటే పక్కన ఒక కారు ఆగింది. కార్లో కూర్చున్న వాడు నన్నే చూస్తున్నాడు. గుర్తు పట్టాను. రాకేష్! చెత్త యేరే నేస్తుడు. నంబర్ ఇచ్చాడు తర్వాత కలవరా అని. వాడి ఆఫీస్ హంగామా చూసి ఆశ్చర్యపోయాను. అందరికీ ఉద్యోగాలిప్పించడమే నా ఉద్యోగం అన్నాడు. హోం అసిస్టెంట్ అని బాగా డబ్బున్న వాళ్ళింట్లో పని అన్నాడు. మూడో రోజే తెలిసింది. వాడు ఇప్పించింది మగ వేశ్య ఉద్యోగమని. పారిపోయాను.


నా పన్నెండో యేట....

ఎప్పటిలాగే గోనె సంచీ భుజాన వేసుకుని చెత్త ఏరడానికి బయలుదేరాను నా నేస్తులతో కలిసి. అవును సార్ మీబోటి వాళ్ళు పనికిరావని పారేసిన వస్తువులే మాకు బతుకు తెరువు. ప్లాస్టిక్, గాజు, ఇత్తడి లాంటి విరిగిపోయిన ముక్కలు పట్టుకెళ్ళి రీసైకిల్ చేసే వ్యాపారస్తులకి అమ్ముతాం. అచ్చం మా బతుకుల్లా ఉండే పగిలిపోయిన అద్దాలు, గాజు సీసాలు, తెగిపోయిన చెప్పులు, విరిగిపోయిన మొబైల్ ఫోన్ అన్నీ మా పొట్ట నింపేవే. మాకు జబ్బులు వచ్చినా బ్యాటరీలు, కంప్యూటర్ పార్టులు కాలిస్తే వచ్చే రాగితో డబ్బులు వస్తాయి.


 ఏవో పెద్ద పెద్ద కంపెనీలట ఈ పని కోసం పోటీ పడుతున్నాయని అవి వస్తే మన పని గోవిందా అని రాకేష్ గాడు చెప్పాడు. ఎందుకూ మంత్రులెవరన్నా ఆ ఏరియాకి ఏ పని మీద వచ్చినా ఆ రోజుకి మా పని ఖాళీయే.ఒక రోజు చెత్త ఏరుతుంటే మూటలో కట్టి ఉన్న పసి...... ఆ పని మానేసాను. నాకు నిద్ర  పట్టకపోవడానికి ఇది కూడా కారణం కాదు. మేం ఉండే చోట ఓ ముసలాయన చెట్టు కింద కూర్చుని డప్పు కొడుతూ ఉండే వాడు. పక్కన కూర్చుని చూసేవాణ్ణి. నేర్చుకుంటావా అబ్బాయ్ అని నా ఆసక్తి చూసి నేర్పించాడు. చేప పిల్ల ఈత కొట్టినంత సహజంగా ఒక్కరోజులోనే ఆ విద్య పట్టుబడింది. 


రా రా అబ్బాయ్ పనిబడింది అంటూ మరుసటి రోజు ఆ తాత నన్ను వెతుక్కుంటూ వచ్చాడు.డంగు టక్కు టక్కు టక్కు డంగు టక్కు టక్ అంటూ శవం ముందు వాయించే చావు బాజా. నా అరంగేట్రం అదిరింది.  డబ్బులు బాగా ముట్టినై. తాత నన్ను పొగిడాడు.  డప్పు కొట్టామా డబ్బులు తీసుకున్నామా అంతే శవం ఎవరిదన్న సంగతి మనకవసరం లేదు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు,  సంతోషించే వాళ్ళు సంతోషిస్తారు. అదొక పార్ట్ టైం ఉద్యోగం అయింది. ఒక సందర్భంలో శవం ముఖం యథాలాపంగా చూస్తే మా నాన్నలా అనిపించాడు. రెండోసారి చూడలేదు. జీవన తరంగాలు సినిమాలో కృష్ణంరాజు లా ఋణం తీరిపోయిందనుకున్నాను.


చావు బాజా ఎందుకు వాయిస్తారో తెలీదు కానీ నాకు కొంతకాలం కూడు పెట్టింది.


సిరిసిరి మువ్వ సినిమాలోని ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం పాటలో డప్పు వాద్యం మక్కీకి మక్కి దింపేస్తే తాత ఆనంద పడిపోయేవాడు. ఇంకా చాలా పాటల్ని డప్పు మీద వినిపించేవాడ్ని. చుట్టూ ఉన్న నాలాంటి పనికిమాలిన జనం శబ్బాష్ అనో వారెవ్వా అనో అనేవాళ్ళు.అయితే ప్రశంసల జల్లు కురవడానికి ఇదేమన్నా రాక్ బ్యాండా కనీసం బ్యాండు మేళం కూడా కాదు. తాతతో అదే చెప్పాను.


పిల్లాడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేస్తానంటే తల్లడిల్లిపోయిన మధ్య తరగతి తలిదండ్రుల్లా విలవిల్లాడాడు. నీకు మంచి భవిష్యత్తు ఉందిరా అన్నాడు. నీకు ప్రమోషన్ ఇప్పిస్తాగా అని ఆశ చూపించాడు. పెళ్ళికి బ్యాండు వాయించే వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ పెట్టించాడు. చావు బాజా వాయించే వాడినని వద్దు పొమ్మన్నారు. అయినా ఇప్పుడన్నీ ఎలక్ట్రానిక్ వాయిద్యాలే నువు పనికి రావన్నారు. నేర్పించండి బాబూ పిల్లాడు పైకి వస్తాడని తాత ఎంత బతిమిలాడినా ససేమిరా అన్నారు.


 ఇక నా నరసింహావతారం గురించి చెప్పి నా కథ ముగిస్తాను. ఈ సంఘటన జరిగాకే ఆ వూరు నుండి పారిపోయాను.అప్పుడు నాకు పదేళ్ళు. కొంచెం వయసుకి మించి కనిపిస్తాను. చెత్త ఏరే ప్రొఫెషన్‌లోకి అపుడే అడుగు పెట్టాను.ఒక రోజు నా నేస్తుడు, నా కన్నా నాలుగైదేళ్లు  పెద్దోడు రేయ్ టేసన్ కాడికెల్దాం ఔటర్ లో ఆగే బళ్ళలో ప్లాస్టిక్ సీసాలు బాగ దొరుకుతై అన్నాడు. అప్పడే చీకటి పడుతోంది. మేం వెళ్ళేసరికి రైళ్లు  ఏవీ ఆగి లేవు. అక్కడే పట్టాల పక్కన గోనె సంచీలు వేసుకుని కూర్చున్నాం. బాగా చీకటి పడింది.


ఇంతలో ముగ్గురు పోలీసులు వచ్చారు. ఒకడు తెలిసిన వాడే. వీళ్ళకి దొరికిపోయామే అని మా వాడేదో గొణుగుతున్నాడు.రేయ్ ఇట్రండ్రా వాళ్ళ వెనకాలే పట్టాల వెంబడి చాలా దూరం నడిచాం. పట్టాల పక్కన ఒక మనిషి పడి ఉన్నాడు. అప్పటికే అక్కడ ఇంకో పోలీసు ఉన్నాడు. రేయ్ వీడ్ని గోనె సంచిలోకి ఎక్కించండ్రా  నాకేం అర్థం కాలేదు. వాడేమైనా తాగి పడిపోయాడేమో అనుకున్నా. అదొక శవం. నాకు కాళ్ళల్లో వణుకు మొదలైంది.



ప్రభుత్వ ఆస్పత్రి.

శవాన్ని ఒక బల్ల మీద పడుకోబెట్టారు. డాక్టరు అనుకుంటా చేతికి, ముక్కుకి తొడుగులు, అదో రకం కళ్ళ జోడు, మెడ దగ్గర్నుండి మోకాళ్ళ దాకా పచ్చ గుడ్డ ఒకటి కట్టుకుని వచ్చాడు. మా ఇద్దరికీ చేతికి తొడుగులు ఇచ్చారు. ఏం చెయ్యాలి ఇక్కడ. నాకు భయంతో చెమటలు పడుతున్నాయి.శవం మీద ఉన్న బట్టలన్నీ తీసేయించారు మాతో. డాక్టరు శరీరమంతా పరిశీలించి ఏదో చెబుతుంటే ఒకతను రాసుకున్నాడు. తర్వాత తల ఊపాడు.నాతో వచ్చినవాడికి ఇది మొదటిసారి కాదనుకుంటా. వాడికి కొత్త సార్ అన్నాడు. ఐతే వాడితో చేయించరా. ప్రాక్టీస్ ఐతది అన్నాడొకడు. నా చేతికి ఒక కత్తి ఇచ్చారు. నా నేస్తుడు నాతో ఓనమాలు దిద్దిస్తునట్టు నా చెయ్యి పట్టుకుని కత్తితో ఆ శవం భుజాల దగ్గర మొదలుపెట్టి ఛాతీ దగ్గర కలిసి కింద పొత్తికడుపు వరకూ  వై ఆకారం లో కోత పెట్టాడు. రక్తం  కారింది.


వాళ్ళు చెప్పినట్టు పక్కటెముకల పై భాగాన్ని మధ్య ఉన్న బ్రెస్ట్ బోన్ తో సహా పైకి లాగాను.  ఇపుడు లోపల ఉన్న అవయవాలన్నీ కనిపిస్తున్నాయి.ఐదో తరగతి వరకూ చదివా కద సార్ మా అమ్మ చనిపోయే వరకు. క్లాస్‌లో ఎప్పుడూ నేనే ఫస్ట్ సార్, జీవశాస్త్రంలో ఐతే నూటికి నూరే. నా కొడుకు డాక్టర్ అవుతాడు అని మురిసిపోయేది మా అమ్మ.  పదేళ్ళకే పోస్ట్‌మార్టం చేస్తానని ఊహించి ఉండదు పిచ్చి తల్లి. స్ప్లీన్, పేగులు బయటకి తియ్యమన్నారు. తర్వాత కాలేయం, అన్నవాహిక, పాంక్రియాస్ అన్నీ కలిపి ఒక్కసారిగా బయటకు... చేతులు వణుకుతున్నాయి.రేయ్ ఇపుడు చెవుల వెనకాల నుండి కోయించి పుర్రె బయటకు తీయిస్తారు నా నేస్తుడు చెవిలో చెబుతున్నాడు.


దేవుడా, దేవుడా.

కడుపులో తిప్పేస్తోంది. భళ్ళున వాంతి చేసుకున్నా.  పోలీసులు తిట్టి అదంతా నాతోనే శుభ్రం చేయించి బయటకు పంపేసారు.ఈ పని చేసి ఇరవై నాలుగు గంటలూ శవాలే గుర్తొస్తుంటే మర్చిపోయేందుకు నా నేస్తుడొకడు మత్తు మందులకి బానిస అయిపోయాడు.ఇదంతా జరిగి పదేళ్ళు అయింది. అప్పటినుండీ నేను ఏ రోజూ నిద్రపోలేదు సార్. ఇది సార్. నా చదువు, ప్రేమ, ఉద్యోగాల కథ. నేను చెప్పింది నిజమే సార్. పోయిన సంవత్సరం కటక్ (ఒడిశా)లో పిల్లలతో ఇలానే చేయిస్తుంటే బయటపడి కోర్టు కలగ చేసుకుందండి.  కేసు పెట్టారండి. నా జీవితమంతా శవాలతోనూ, చచ్చినట్టు బ్రతుకుతున్న వాళ్ళతోనే ఎందుకు ముడిపడి ఉంది. ఎవరేనా చెప్పండి. నా కథ విని మీకు ఒక్క రాత్రన్నా నిద్ర పట్టకపోతే నా జీవితం ధన్యమైనట్టే. ఎందుకంటే మీరు నాబోటి వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెట్టారనే కదా.


అతను కోపంతో ఆమెను ఇష్టమొచ్చినట్లు చేతులతో, కాళ్లతో తన్నడం మొదలుపెట్టాడు. అందరూ చోద్యం చూస్తున్నారు. ఆమె ప్రతిఘటించ లేక ఏడుస్తుంది. ఆమెను చూస్తే నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది. వాడిని చితక బాదేశాను. కస్టమర్లు దేవుళ్లంటా, క్లబ్ వాళ్లు నా ఉద్యోగం పీకేశారు.


ఐదో తరగతి వరకూ చదివా కద సార్ మా అమ్మ చనిపోయే వరకు.క్లాస్‌లో ఎప్పుడూ నేనే ఫస్ట్ సార్, జీవశాస్త్రంలో ఐతే నూటికి నూరే. నా కొడుకు డాక్టర్ అవుతాడు అని మురిసిపోయేది మా అమ్మ.పదేళ్ళకే పోస్ట్ మార్టం చేస్తానని ఊహించి ఉండదు పిచ్చి తల్లి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top