సాక్షి, ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టు ఈ రోజు (శనివారం) షరతులతో కూడిన విడుదల మంజూరు చేసింది. దీప్కేను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, రూ.50,000 బాండ్ సమర్పించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని హామీ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.
సీఈసీ వ్యతిరేఖ నిరసనల్లో భాగంగా, కనాట్ ప్లేస్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం అరెస్టు చేశారు. దీప్కేతో పాటు అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమెను శనివారం తెల్లవారుజామున విడుదల చేశారు. కాగా ఈ రోజు దీప్కేకు బెయిల్ మంజూరు చేశారు.
ఎన్నికల అక్రమాలపై నిరసనగా కనాట్ ప్లేస్లో శుక్రవారం సాయంత్రం ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ర్యాలీ నిర్వహించేందుకు యువ నాయకులు ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముందుగానే పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీప్కే, నేహా బోరాలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీసుల చర్యల నేపథ్యంలోనూ విద్యార్థులు, ఇతర నిరసనకారులు చిన్నచిన్న ర్యాలీలు నిర్వహిస్తూ జాతీయ జెండాలను ప్రదర్శించారు.
ఇదిలా ఉండగా, సీజేపీ నాయకులు ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశంగా ఉన్న ప్రాంతాన్ని గత వారం రద్దు చేయడంతో, అక్కడ అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, నేహా బోరా, అభిజీత్ దీప్కేల అరెస్టులపై ప్రతిపక్ష నాయకులు స్పందిస్తూ, జాతీయ జెండాను ప్రదర్శించడం నేరం కాదని పేర్కొంటూ యువ నాయకులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో అభిజిత్ దీప్కేకు ఈ రోజు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి: దీప్కే ఎక్కడ?


