కంప్యూటర్ పిచ్చి... వదిలించేదెలా?!

కంప్యూటర్ పిచ్చి... వదిలించేదెలా?!


కిడ్స్ మైండ్‌‌ సెట్


మా బాబు మూడో తరగతి చదువు తున్నాడు. ఈ మధ్య మేం ఏదైనా కాదన్నా, కోపంతో ఓ మాట అన్నా ఉక్రోషం వచ్చేస్తోంది వాడికి. ఓ మూలకు పోయి నిలబడుతున్నాడు. పైకి ఏడవడం లేదు కానీ దుఃఖపడుతున్నాడని అర్థమవుతోంది. అలాంటప్పుడు మాట్లాడిస్తే నత్తి వచ్చేస్తోంది. ఇంతకుముందు ఇలా వచ్చేది కాదు. ఈ మధ్యనే అలా అవుతోంది. ఎందుకు? ఇదేమైనా మానసిక సమస్యా? 

- రాజ్యలక్ష్మి, నంద్యాల



బాబుకు ఈ మధ్య స్ట్రెస్ ఏమైనా ఎక్కువైందా? ఒకవేళ స్కూల్లో చదువు వల్ల కానీ, ఫ్రెండ్స్ టీజ్ చేయడం వల్ల కానీ తనకు ఏమైనా ఇబ్బందిగా ఉందేమో గమనించండి. వీలైతే తననే బుజ్జగించి అడగండి. చెబితే సరే. లేదంటే ఒత్తిడి చేయకుండా మరో మార్గంలో తెలుసుకోడానికి ట్రై చేయండి. ఏదీ లేకపోతే తనని మార్చడానికి మీరే మెల్లగా ప్రయత్నించాలి. తను చెప్పినట్టే ప్రతిసారీ వినడం ఎందుకు సాధ్యం కాదో వివరించండి. వీలైనంత వరకూ కసురు కోవడం, తిట్టడం లాంటివి చేయకండి. సాధ్యమైనంత నెమ్మదిగానే డీల్ చేయండి. అలా అని బాధపడతాడేమోనని అడిగినవన్నీ ఇచ్చెయ్యకండి. మీ ప్రయత్నాలన్నీ చేసినా బాబు మారకపోతే కౌన్సెలర్‌కు చూపించండి. వాళ్లే చూసుకుంటారు. నత్తికి మాత్రం ఓసారి స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించండి. స్ట్రెస్ వల్లే ఇలా వస్తోందా లేక ఇంకేదైనా సమస్య ఉందా అనేది వాళ్లే చెప్పగలరు.



మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పట్నుంచీ చదువులో చాలా చురుకు. ఎక్కువ చదువుతాడు. బాగా నాలెడ్జ్ ఉంది.  క్విజ్ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొని బోలెడు ప్రయిజులు తెచ్చుకున్నాడు. అందుకే వాడికి పనికి వస్తుందని కంప్యూటర్ కొనిచ్చాం. కానీ ఈమధ్య ఓసారి వాడి గదిలోకి వెళ్లినప్పుడు... వాడు పిచ్చి పిచ్చి వీడియోలు, ఫొటోలు చూడటం కనిపించింది. గమనించనట్టే వచ్చే శాను. ఇలాంటివి చేస్తే వాడి భవిష్యత్తు ఏమవు తుందోనని భయంగా ఉంది. మాకు విషయం తెలిసిందని తెలిస్తే ఎలా రియాక్టవుతాడోనని మరో భయం. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలి? 

- పి.స్వర్ణ, హైదరాబాద్


బాబుతో తప్పకుండా ఈ విషయం మాట్లాడండి. ఈ వయసులో ఇటువంటివి జరిగితే మౌనంగా ఉండటం మంచిది కాదు. తప్ప కుండా తనకి తప్పొప్పులు తెలిసేలా చేయాలి. కాబట్టి కూర్చోబెట్టి వివరిం చండి. అవసరమైతే పనిష్మెంట్‌గా ఒక వారం పది రోజుల పాటు కంప్యూటర్ తీసేసుకోండి. తిరిగి ఇచ్చేటప్పుడు అన్ని రూల్స్ పెట్టి ఇవ్వండి. తప్పితే కంప్యూటర్ పూర్తిగా తీసేసుకుంటానని చెప్పండి. ఇంటర్నెట్ కూడా అవసరం మేరకే ఉండేలా జాగ్రత్తపడండి. ఓ సమయం దాటాక ఇంటర్నెట్ రాకుండా చేసేయండి. కంప్యూటర్లు, ల్యాప్‌టాపుల్లో పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయండి. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్లని కరెక్ట్ చేయడం మన బాధ్యత. కానీ అది వాళ్లలో మార్పు తీసుకు వచ్చేలా ఉండాలి తప్ప అవమానించేలా, సిగ్గు పరిచేలా ఉండకూడదు. కాబట్టి కాస్త కూల్‌గానే డీల్ చేయండి.



మా పాప ఆరో తరగతి చదువుతోంది. తెలివితేటల వరకూ ఎటువంటి సమస్యా లేదు. అయితే పాప ప్రవర్తనతోనే కాస్త ఇబ్బంది. ఎందుకో తెలియదు కానీ తనకు స్వార్థం చాలా ఎక్కువ. ఎవరితోనూ ఏదీ షేర్ చేసు కోడానికి ఇష్టపడదు. చివరికి తన తమ్ముడితో కూడా ఇది నీది, ఇది నాది అని వాదిస్తూ ఉంటుంది. ఎవరికీ ఏమీ పెట్టదు, ఇవ్వదు. అలా ఉండకూడదని, అందరితోనూ పంచు కోవడం చాలా గొప్ప లక్షణమని నా భార్య, నేను చాలాసార్లు చెప్పాం. కానీ తన తీరు మారలేదు. ఎందుకిలా చేస్తోంది? చిన్నప్పుడే ఇలా ఉంటే తను మంచి వ్యక్తి ఎలా అవుతుంది? సలహా ఇవ్వండి.

- ప్రవీణ్‌రెడ్డి, విజయవాడ



చాలామంది పిల్లలు ఈ వయసులో ఇలాంటివి చేస్తారు. కానీ మరీ ఇలా మాత్రం ఉండకూడదు. షేర్ చేసుకోవాలని మీరు ఆల్రెడీ చెప్పారు. కానీ తను అలా చేయడం లేదు. కాబట్టి ఈసారి బలవంతంగానైనా ఆ పని చేయించండి. దగ్గరుండి వాళ్లకీ వీళ్లకీ తనతోనే ఏమైనా ఇప్పించండి. తను ఒప్పుకోకపోయినా, కోపం వచ్చినా వదిలి పెట్టవద్దు. అలాగే, షేర్ చేసుకోవడం వల్ల వచ్చే మంచి ఫలితాలేమిటో కూడా తనకి చెప్పండి. మనం ఇవ్వడం వల్ల ఎదుటివాళ్లు ఎలా సంతోషపడతారు, వాళ్లు కూడా తమకున్న వాటిని ఎలా పంచుతారు, ఎలా దీవిస్తారు వంటివన్నీ తనకు అనుభవమయ్యేలా చేయండి. అప్పుడు తనకే అలవాటవు తుంది. అప్పటికీ మార్పు రాకపోతే మంచి సైకాలజిస్టు సాయం తీసుకోండి.                    



డా॥పద్మ పాల్వాయ్

చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్,

హైదరాబాద్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top