వివేకం : జాతక చక్రం | horoscope is not rule a human life | Sakshi
Sakshi News home page

వివేకం : జాతక చక్రం

Oct 27 2013 2:44 AM | Updated on Jun 1 2018 8:31 PM

వివేకం :  జాతక చక్రం - Sakshi

వివేకం : జాతక చక్రం

నా జాతకం బాగోలేదు, ఏది చేసినా కలిసి రావడం లేదు’ అంటూ చాలామంది విధి మీద తోసేస్తుంటారు.‘దైవ నిర్ణయాన్ని ఎదిరించి సమయం వృథా చేయడం కంటే, జీవితాన్ని దాని మానాన వదిలేయడమే సమంజసం’ అంటూ కొందరు వేదాంతం మాట్లాడుతుంటారు.

 ‘నా జాతకం బాగోలేదు, ఏది చేసినా కలిసి రావడం లేదు’ అంటూ చాలామంది విధి మీద తోసేస్తుంటారు.‘దైవ నిర్ణయాన్ని ఎదిరించి సమయం వృథా చేయడం కంటే, జీవితాన్ని దాని మానాన వదిలేయడమే సమంజసం’ అంటూ కొందరు వేదాంతం మాట్లాడుతుంటారు.
 
 ఓటమి సంభవిస్తే జాతకాలు, సంఖ్యాశాస్త్ర సహాయాన్ని కోరడమేనా? జాతకాలు చెప్పేవారు ప్రేమతో కాక, తప్పు చేశామనే భావనను మీలో సృష్టించి, మిమ్మల్ని వశపరుచుకోవాలని చూస్తుంటారు. మీ గెలుపు ఓటములను నిర్ణయించేది మీ తలరాత అని నమ్మకం కలిగిస్తుంటారు. మీ తెలివితక్కువతనాన్ని వారు ఉపయోగించుకుంటున్నారు.
 
 కాని అపజయానికి నిజమైన కారణం మీ చేతకానితనమే అని ఒప్పుకోవటానికి ఎందుకు సంశయిస్తున్నారు? ఒకటి అర్థం చేసుకోండి. సరైన రీతిలో నడుచుకుంటే, మీకు చెందవలసినవి మీకు అందకుండా చేసి, పగ తీర్చుకోవడానికి దేవుడేమీ సినిమా విలన్ కాదు.మీకు కడుపు నిండా భోజనం దొరకాలని ముందే నిర్ణయించబడిందని అనుకుందాం. ఎవరూ మిమ్మల్ని గమనించకుండా ఒక అడవిలోకి వెళ్లి కూర్చోండి. పక్కన ఒక పండు పడినా ముట్టుకోకండి. దేవుడు ఇష్టపడితే, ఆయనే స్వయంగా వచ్చి, మీ నోట్లో ఆ పండును పెడతారని వేచి చూడండి. విధి జయిస్తుందా? లేక, మీ ఆకలా?
 
 నా దగ్గర ఒక పాత మోడల్ మారుతీ కారు ఉండేది. దాన్ని కొనటానికి ఒకరు నా దగ్గరికొచ్చారు. ‘స్వామీజీ! మీ కారు నంబరు నాకు చాలా అదృష్టం కలిగిస్తుంది. ఎంత ధర చెప్పినా కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అన్నాడు.
 
 ‘ఏ నంబరును గురించి చెప్తున్నారు? రిజిస్ట్రేషన్ నంబరా లేక ఇంజిన్ నంబరా?’ అని నవ్వాను.
 అతను తికమకపడ్డాడు. తన జోస్యుల్ని అడిగి మళ్లీ వచ్చాడు. ‘రిజిస్ట్రేషన్ నంబరే ప్రధానం’ అన్నాడు. ఇంగ్లిషులో ఉన్న అక్షరాలన్నీ లెక్కలేసి, జోస్యుడు చెప్పిన తేదీన, చెప్పిన టైమ్‌కి 99,999 రూపాయలిచ్చాడు.
 
 ‘మాట్లాడుకున్న దాంట్లో ఒక రూపాయి తక్కువైందని తప్పుగా అర్థం చేసుకోకండి. అది నా కలిసొచ్చే అంకె’ అంటూ తగ్గిన ఒక రూపాయికి బదులుగా ఒక విలువైన వస్తువును బహుమానంగా ఇచ్చాడు.
 ‘మొదట కారును నడిపి చూడండి. చాలా భాగాలు వదులుగా ఉన్నాయి’ అన్నా.అతను నంబర్ ముఖ్యం అంటూ, కారును పరీక్ష కూడా చేయకుండా తీసుకెళ్లాడు. కాని ఒక్క నెలకే ఎవరికో అమ్మేశాడు.
 
 కారు ముందు సీటు స్ప్రింగ్ ఊడిపోయి, వెనక్కి వాలిపోయింది. ఏదో భూతం వెనుక నుండి తనను లాగుతున్నట్టు భయపడి కారును అమ్మేశాడు. కారును తీసుకొనిపోతూ, గుడి ముందు ఆయన కొట్టిన టెంకాయ ఫలించలేదు. నలిగిపోయిన నిమ్మకాయలు వృథా! ముఖ్యంగా ఆయన అదృష్టంగా భావించిన నంబరు కూడా కలిసి రాలేదు.
 
 ఆయనలాగానే ప్రతిదానికీ జోస్యం చూసేవారు చాలామంది ఉన్నారు. గ్రహాలు, పరిహారాలు అంటూ మాట్లాడుతారు.జీవమున్న మీరు చేసే తెలివిమాలిన పనులకు, జీవం లేని గ్రహాలే కారణమనడం కేవలం చేతకానితనం.
 
 సమస్య - పరిష్కారం
 మనిషి గెలుపు ఓటములకు జాతక చక్రం కారణమంటారా? న్యూమరాలజీ ప్రకారం పేరు మారిస్తే ఫలితం ఉంటుందా?
 -టి.ప్రకాశరావు, అనంతపురం
 
 సద్గురు: తెలివిగల మనిషి ఎప్పుడూ ఎవ్వరూ చేయనిది చేయవచ్చు. ఆ అవకాశం ఉంది, అవునా? అదే ఒక మూర్ఖుడుని చూసిన వెంటనే మీరు వాడు జీవితమంతా ఎలా బతుకుతాడో ఇప్పుడే చెప్పేయవచ్చు. అవునా, కాదా? ఓ కాయితం ముక్క మీద మీరెలా బతుకుతారో రాశారు, అంటే అర్థం ఏమిటి? అంటే మీరు తెలివి లేనివారని అనుకోవటం లేదా? ఇది ఎలాగంటే, పౌర్ణమి, అమావాస్యలకు, మానసిక స్థితి సరిగా లేనివారు అది ఇంకొంచెం కోల్పోతారు. మీక్కూడా అలానే అవుతుందా? అమావాస్య, పౌర్ణములకు మిమ్మల్ని పట్టుకొని ఉండాలా? అవసరమా? వారితో పోల్చుకుంటే, మానసికంగా మీరు కొంచెం బలవంతులు. అందువల్ల, చంద్రుడెలా ఉన్నా మీలో పెద్ద మార్పేమీ ఉండదు. అదే విధంగా మీరు ఇంకొంచెం సమతుల్యంగా ఉంటే, ఏ గ్రహం ఎక్కడ ఉన్నా, మీరు మీ గుణానుగుణంగా ఉంటారు. అంతేకాని, ఈ చిన్న చిన్న శక్తులు చెప్పినట్లు కాదు. ఈ నక్షత్రాలు, గ్రహాలు ఏమిటి? అవన్నీ నిర్జీవులు. ప్రాణం లేని రాళ్లు, రప్పలు. ఈ నిర్జీవులు బలమైనవా, మానవులు బలమైనవారా? మీరిప్పుడు నాకు కచ్చితంగా చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement