ఆంధ్రుల అనర్ఘరత్నం

Funday special story to duggirala gopalakrishnayya - Sakshi

ధ్రువతారలు

‘ఇది చాలా విచిత్రమైన యుద్ధం. ఆంధ్రరత్న ప్రజలందరినీ కూడగట్టుకొని, చీరాల ప్రాంతాన్ని మునిసిపాలిటీగా రూపొందిస్తే ఆ గ్రామాన్ని పూర్తిగా విసర్జించి, వేరే తావులకు వలసగా వెడలి పోతామని తెలియచేశాడు. ఇది నిజంగా చాలా బ్రహ్మాండమైన ప్రయత్నం. చీరాల–పేరాల ప్రజలు పదిహేడువేల మందికి పైగా ఉన్నారు. వారందరినీ ఒక త్రాటి మీద నిలబెట్టి, వారి చేత తరతరాలుగా వారు వుంటూ వున్న ఇళ్లనీ, వాకిళ్లనీ విడిచి పెట్టించి వారిని రామనగరు పరిసర ప్రాంతాలకు తీసుకుని పోవడం అంటే మాటలా?’టంగుటూరి ప్రకాశం ఆత్మకథ ‘నా జీవితయాత్ర’లో కనిపించే మాటలివి. అది విచిత్ర యుద్ధమే. బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు గ్రామాల ప్రజలని ఊరి బయట కాపురం పెట్టించడం చరిత్రలో ఎక్కడోగాని కనిపించదేమో! పాతిక మందో ముప్పయ్‌ మందో కాదు. వందో రెండు వందల మందో కూడా కాదు. దాదాపు 17 వేల మంది. పదకొండు మాసాలు ఊరి బయట వేసుకున్న పందిళ్లలో, గుడిసెలలో నివాసం ఉన్నారు. ఆ సంవత్సరమే దారుణంగా ఎండలు కాశాయి. కక్ష కట్టినట్టు కుంభవృష్టులు కురిపించడానికి వానదేవుడు కూడా ఆ సంవత్సరాన్నే ఎంచుకున్నాడు. వృద్ధులు, పసివారు, బాలలు, మహిళలు, వారిలో గర్భిణులు – అంతా  ఒక దీక్షతో ఆ ఇక్కట్లను ప్రేమించారు. ఊరి చివరి ఇసుక పర్రలలో పాములు, మండ్రగబ్బలు, జెర్రులతో సహజీవనం చేశారు. అన్ని వేలమందిలో ఉద్యమ స్పూర్తిని నిలబెట్టడం ఎంత కష్టం! ఆ పని చేసినవారే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన బిరుదు ‘ఆంధ్రరత్న’.  

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (జూన్‌ 2,1889–జూన్‌ 10, 1928) కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలులో పుట్టారు. తండ్రి కోదండరామస్వామి ఉపాధ్యాయుడు. తల్లి సీతమ్మ. కొడుకును కన్న మూడో రోజునే ఆమె కన్నుమూశారు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన కూడా రెండేళ్లు తిరక్కుండానే చనిపోయారు. అప్పుడు పినతండ్రి, నానమ్మలు గోపాలకృష్ణయ్యను పెంచి పెద్ద చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆ వెంటనే బాపట్ల తాలూకా కార్యాలయంలో గుమాస్తాగా చేరారు. గోపాలకృష్ణయ్య గొప్ప స్వేచ్ఛాప్రియుడు. ఆ స్వేచ్ఛాప్రియత్వం ఆయన ఉద్యోగ జీవితం తొలి నాళ్లలోనే  బయటపడింది. ‘ఈ ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయడం కంటే వీధుల్లో ముష్టెత్తుకు బతికితే  బావుంటుంది. ఇదంతా గానుగెద్దు జీవితం. ఏ రోజూ ఉత్సాహమన్నది కనిపించదు. స్వేచ్ఛ లేదు. చొరవ తీసుకునే స్వాతంత్య్రం అంతకంటే లేదు. నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను. పై చదువులు చదవాలని అనుకుంటున్నాను. దయచేసి ఇందుకు అనుమతించవలసింది అంటూ ఆయన పినతండ్రికి  ఒక ఉత్తరం రాశారు. అందుకు పినతండ్రి ఒప్పుకున్నారు. అలా గుంటూరులో మెట్రిక్యులేషన్‌ చదివారు. తరువాత తన మిత్రుడు నడింపల్లి నరసింహారావు చేయూతతో స్కాట్లండ్‌లోని ఎడిన్‌» రో వెళ్లి చరిత్ర, అర్థశాస్త్రాలలో ఎంఎ చదువుకుని, ఐదేళ్ల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చేశారు. రాజమండ్రి ఉపాధ్యాయ కళాశాలలో ఆచార్యునిగా నియమితులయ్యారు. అప్పుడు అక్కడ ఆర్‌ డబ్లు్య రాస్‌ ప్రిన్సిపాల్‌. అతడి నిరంకుశత్వానికి ఎదురు తిరిగి, ఉద్యోగానికి రాజీనామా చేసి, మచిలీపట్నం జాతీయ కళాశాలలో చేరారు. అప్పుడే అనీబిసెంట్‌ నాయకత్వంలో హోంరూల్‌ ఉద్యమం ఆరంభమైంది. 1903లోనే గోపాలకృష్ణయ్యకు, దుర్గాభవానికి వివాహం జరిగింది. బందరులో ఉండగానే ఆమెకు ఆరోగ్యం పాడయింది. దీనితో ఆమె కోలుకోవడం కోసం ఎంచుకున్న ప్రదేశమే చీరాల. ఆయన కుటుంబంతో చీరాలలో అడుగు పెట్టే సమయానికి భార్యకు వైద్యం చేస్తున్న వైద్యుడు తప్ప మరొకరు తెలియదు. కానీ కొద్దికాలానికే చీరాల వాసులే కాక, పక్కనే ఉన్న పేరాల ప్రజలు కూడా ఆయన మాట చెబితే ఏం చేయడానికైనా సిద్ధమయ్యారు. 

గోపాలకృష్ణయ్య బహుభాషా కోవిదుడు. సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషలలో అభినివేశం ఉండేది. పాఠశాలలో ఉండగానే జాతీయ నాట్యమండలి పేరుతో ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించారు.  ఆంధ్ర విద్యాపీuŠ‡ గోష్టి పేరుతో ఒక సాహిత్య సంస్థను కూడా స్థాపించారు. ఇవన్నీ జాతీయోద్యమ వేడిలో ఆయన జీవితం నుంచి మెల్లగా తప్పుకున్నాయి. ఎడిన్‌బరోలో ఆయన సహాధ్యాయుడు ఆనందకుమారస్వామి. నందికేశ్వరుడు రచించిన ‘అభినయ దర్పణం’ సంస్కృత గ్రంథాన్ని ఆనందకుమారస్వామి వంటి కళామర్మజ్ఞుడి ప్రోత్సాహంతో గోపాలకృష్ణయ్య ఆంగ్లంలోకి (మిర్రర్‌ ఆఫ్‌ గెస్చర్స్‌) అనువదించారు. దీనిని 1917లో కేంబ్రిడ్జ్‌–హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ప్రచురించింది కూడా.  వీటన్నిటికీ తోడు సంగీతం తెలుసు. పాటలకు, పద్యాలకు బాణీలు కట్టడంతో పాటు, కమ్మగా పాడడం కూడా వచ్చు. వీటన్నిటి సమ్మేళనమనిపించే  రీతిలో ఉండే ఆయన ఉపన్యాసాలు ప్రజలను ఉర్రూతలూగించేవి. ‘సాధన’ పేరుతో ఒక సాహిత్య పత్రికను కూడా ఆయన వెలువరించేవారు. వీటికి తోడు గోపాలకృష్ణయ్యకు గొప్ప హాస్యచతురత ఉండేది. ఆయన విసిరిన చెణుకులు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. అందుకే ఆయన ప్రజలను అలవోకగా ఆకర్షిస్తూ ఉండేవారు.  గాంధీజీ రాజకీయ సిద్ధాంతాలు, పంథా భారత స్వాతంత్య్రోద్యమంలోని ఒక దశను విశేషంగా కదిలించాయి. అనేకమంది ఆ పంథా వైపు మళ్లారు. అది 1920 ప్రాంతం. అహింసతో ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకోవడం గాంధీజీ సిద్ధాంతంలో ప్రధానమైనది. గాంధీజీ ప్రవేశించిన తరువాత వేసిన తొలి రాజకీయ అడుగు సహాయ నిరాకరణోద్యమం. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం ఇందులో ఒకటి. గోపాలకృష్ణయ్య కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ఇదంతా 1920 నాగ్‌పూర్‌ కాంగ్రెస్‌ సమావేశాలలో గాంధీజీ రూపొందించారు. ఈ అంశం గురించే తెలుగు ప్రాంతమంతా తిరుగుతూ ప్రచారం చేసి, ఒక సంవత్సరం పాటు జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి గోపాలకృష్ణయ్య. ఖద్దరు పంచె, కండువా, తలపాగాతో, మెడలో రుద్రాక్షమాలతో సదా కనిపించేవారాయన. ఇలాంటి నేపథ్యంలోనే సరిగ్గా పన్నులకు సంబంధించిన సమస్యే ఆనాడు చీరాలకు ఎదురయింది. 

ప్రస్తుతం ప్రకాశం జిల్లాలలో ఉన్న చీరాల–పేరాల గ్రామాలను (ఆనాడు గుంటూరు జిల్లా) కలిపి మునిసిపాలిటీగా రూపొందించాలని బ్రిటిష్‌ కనుసన్నలలో నడిచే జస్టిస్‌ పార్టీ ప్రభుత్వం 1920లో నిర్ణయించింది.పానగల్లు రాజా రామరాయణం నాయకత్వంలో ఈ ఆలోచన రూపుదిద్దుకుంది. ఇందుకు ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. మునిసిపాలిటీ హోదా లేని కాలంలో అక్కడ వచ్చే పన్ను మొత్తం రూ. 4,000. కానీ మునిసిపాలిటీగా మారిస్తే పన్నుల రూపంలో రూ. 40,000 వసూలు చేయవచ్చు. కానీ సౌకర్యాలేమీ అదనంగా చేకూరవు. అయితే అక్కడ ఉన్నవారంతా చేనేత కార్మికులు, సాధారణ రైతులే.  అందుకే వ్యతిరేకించారు. అయినా మునిసిపాలిటీ ఏర్పాటయింది. ప్రజలు కౌన్సిలర్‌లుగా ఎంపికై కూడా పదవులుకు రాజీనామాలు ఇచ్చారు. పెరిగిన పన్నులకు వ్యతిరేకంగా పురుషులతో పాటు ఆనాడే మహిళలు కూడా ఉద్యమంలోకి దిగారు. ఒక మహిళ అరెస్టయ్యారు కూడా. ఆమె జైలుకు కూడా వెళ్లివచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. అప్పుడే బెజవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశాలకు వచ్చిన గాంధీజీ చీరాలను సందర్శించారు. ఈ అంశం గురించే గోపాలకృష్ణయ్య గాంధీజీ దృష్టికి తీసుకువెళ్లారు. గాంధీజీ రెండు మార్గాలను సూచించారు. ఒకటి– అహింసా మార్గంలోనే పన్నుల చెల్లింపు నిరాకరణోద్యమం నడిపించడం. రెండు అసలు ప్రజలంతా సామూహికంగా ఆ రెండు ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్లిపోవడం. 

గోపాలకృష్ణయ్య రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలంతా ఆయన మాటను తుచ తప్పకుండా మన్నించిన తీరు కూడా అద్భుతమనిపిస్తుంది. ‘చీరాల–పేరాల ఉదంతం ఆ ప్రాంతానికి చెందిన సమస్య అయినా, దాని చండ ప్రభావం వల్ల అది ముఖ్యమయిన రాష్ట్ర సమస్యగానూ, తర్వాత సాటిలేని మేటి ఉదంతంగానూ రూపొందడం చేత, అది యావత్తు భారతావని దృష్టినీ ఆకర్షించింది. ‘ఆ పోరాటం ముమ్మరంగా సాగుతూన్న రోజులలో నేను చీరాల ప్రాంతానికి వెళ్లాను. అచ్చట∙ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఆ గ్రామాలకు చెందిన యావత్తు బీదాసాదా, ముసలీ ముక్కీ, బ్రాహ్మణ, అబ్రాహ్మణాది విభేదాలు యీషణ్మాత్రమూ లేకుండా ఏకగ్రీవంగా ఆ గ్రామాన్ని వదలి ఇతర ప్రాంతాలలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆనందంగా బయల్దేరారు’ అని ప్రకాశం గారు ‘నా జీవితయాత్ర’లో రాశారు.అంతమంది చీరాల ఊరి బయట ఇసుక తిన్నెల మీద తాత్కాలిక నివాసాలలో ఉన్నారు. వీటిని నిర్మించడానికి సహకరించవలసిందిగా గోపాలకృష్ణయ్య ఇచ్చిన పిలుపును అనుసరించి ఎందరో దాతలు విరాళాలు ఇచ్చారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మూడు వేల రూపాయలు ఇచ్చింది. దీనికే రామనగరం అని గోపాలకృష్ణయ్య పేరు పెట్టారు. ప్రజలకు సేవ చేయడానికి ఆయనే ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవకుల బృందమే రామదండు. అక్కడ చీరాల, పేరాల గ్రామాలలోని తమ సొంత ఇళ్లు నక్కలకు, కుక్కలకు, పాములకు నిలయాలైపోయాయి. వీధులన్నీ అడవుల్లా తయారయ్యాయి. ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి నడిపించడమే గోపాలకృష్ణయ్య ఉద్దేశం. ఇందుకు ప్రతి కులం నుంచి ఒక వ్యక్తిని ఎంపిక చేయించారు. 

పదకొండు మాసాలు గడచిపోయాయి. ప్రభుత్వం దిగి రాలేదు. కానీ ప్రజలు అలాగే కొన్ని వారాలు ఓపిక పట్టి ఉంటే జస్టిస్‌ పార్టీ సర్కారు దిగి వచ్చేది. కానీ ఇన్ని మాసాల తరువాత సహనం ^è చ్చిపోయింది.ఇంతలోనే ఇంకొక పరిణామం కూడా జరిగింది. 1921లో బరంపురంలో ఏర్పాటయిన జాతీయ కాంగ్రెస్‌ సభలకు గోపాలకృష్ణయ్య వెళ్లారు. రామనగరం నిర్వహణకు నిధుల సమస్య తీవ్రమైంది. ఇందుకోసం విజ్ఞప్తి చేయడానికే గోపాలకృష్ణయ్య బరంపురం బయలుదేరారు. కానీ రెచ్చ గొట్టే ఉపన్యాసాలు చేస్తున్నట్టు ఆరోపిస్తూ ఆయనను దేశద్రోహ నేరం మీద అరెస్టు చేశారు. శ్రీకాకుళంలో కలెక్టర్‌ ముందు హాజరు పరిచారు. మీరు ఎంపరర్‌ను రావణుడు, బలి, హిరణ్యకశిపుడు వంటి పాత్రలతో పోల్చి చెప్పారట. నేరం కాదా! అని కలెక్టర్‌ అడిగితే. గోపాలకృష్ణయ్య తాను అలాగే మాట్లాడినట్టు ఒప్పుకున్నారు. పైగా అలాంటి పోలికలతో చెబితేనే భారతీయులకు బాగా అర్థమవుతుందని కూడా చెణుకు విసిరారు. ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించి తిరుచునాపల్లి తీసుకుపోయారు. ఆయన కారాగారానికి వెళ్లిపోవడంతోనే చీరాల–పేరాల ప్రజలలో విశ్వాసం సన్నగిల్లింది. తమ సొంత ఇళ్లకు తరలిపోయారు. ఇంతలోనే మరొక పరిణామం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టు గాంధీజీ ప్రకటించారు. దీనితో గోపాలకృష్ణయ్య కూడా నిరాశ చెందారు. గాంధీజీ మీద ఒకింత నమ్మకం కోల్పోయారనే అనిపిస్తుంది. అప్పుడు ఎందరో చేసినట్టే ఆయన కూడా స్వరాజ్య పార్టీలో చేరారు.  1926లో గోపాలకృష్ణయ్యకు  క్షయ వ్యాధి సోకింది. దానిని చాలా ఆలస్యంగా గుర్తించారు. పైగా అప్పటికి ఆయన ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోయారు. ఆ లేమి కష్టాలలోనే గడుపుతూ తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 38 సంవత్సరాలు. భారతీయ చరిత్రకారుల ఆత్మసాక్షిగా అంగీకరించవలసిన విషయం ఒకటి ఉంది. అదే – ఈ రత్నం కూడా నిర్లక్ష్యం అనే మసిగుడ్డలోనే ఉండిపోయింది.  
డా. గోపరాజు నారాయణరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top