
గాజా: గాజా స్ట్రిప్‌లో అంతకంతకూ పెరుగుతున్న మానవతా సంక్షోభం మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో ఆకలి చావులను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గాజాలో సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. ఇజ్రాయెల్ బందీలను వెనక్కి తీసుకురావడం, ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం జరగాలని ఒబామా పేర్కొన్నారు. ఆకలితో అక్కడి అమాయక ప్రజలు చనిపోతున్నారని, దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒబామా పేర్కొన్నారు.
గాజా స్ట్రిప్‌లోని బాధితులను కలుసుకునేందుకు, వారికి సహాయం చేసేందుకు అనుమతులు ఉండాలన్నారు. వారికి ఆహారం, నీటిని దూరంగా ఉంచడం సమర్థనీయం కాదన్నారు. మరోవైపు గాజాలో పోషకాహార లోపం ఆందోళనకర స్థాయికి చేరుకున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) ఆదివారం హెచ్చరించింది. వారికి అందే సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా నిరోధించడం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది నమోదైన 74 పోషకాహార లోపం మరణాలలో 63 జూలైలో సంభవించాయి. ఇందులో 24 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు.
While a lasting resolution to the crisis in Gaza must involve a return of all hostages and a cessation of Israel’s military operations, these articles underscore the immediate need for action to be taken to prevent the travesty of innocent people dying of preventable starvation.…
— Barack Obama (@BarackObama) July 27, 2025
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, గాజాలో దాదాపు ఐదుగురు పిల్లలలో ఒకరు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆహార నిపుణులు కూడా గాజాలో కరువు పరిస్థితులపై ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇక్కడి జనాభాకు సహాయం అందించడంపై ఇజ్రాయెల్ పరిమితులు విధించింది. కాగా ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాలోని మూడు ప్రాంతాలలో రోజుకు 10 గంటల పాటు యుద్ధానికి విరామం ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ విరామం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఉంటుందని ఇజ్రాయెల్ తెలిపింది.