వారెవ్వా.. రుచులు | Corn Cake, Paneer Sandwich Recipes | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. రుచులు

Jul 28 2019 10:40 AM | Updated on Jul 28 2019 10:40 AM

Corn Cake, Paneer Sandwich Recipes - Sakshi

పనీర్‌ సాండ్‌విచ్‌
కావలసినవి: పనీర్‌ ముక్కలు – ఒకటిన్నర కప్పులు (మెత్తగా ఉడికించి చిన్న ముక్కలు చేసుకోవాలి), బ్రెడ్‌ స్లైస్‌ – 4 లేదా 6 (త్రిభుజాకారంలో ఒక్కో స్లైస్‌ని రెండు ముక్కలు చొప్పున కట్‌ చేసుకోవాలి), బంగాళదుంప – 2 (మెత్తగా ఉడికించి ముద్దలా చేసుకోవాలి), ఉల్లిపాయ గుజ్జు – 2 టేబుల్‌ స్పూన్లు, బ్రెడ్‌ పౌడర్‌ – పావు కప్పు, మొక్కజొన్న పిండి – 3 టేబుల్‌ స్పూన్లు,కారం – 1 టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, తందూరీ మసాలా – 2 టీ స్పూన్లు, చాట్‌ మసాలా –అర టీ స్పూన్, ధనియాల పొడి – పావు టీ స్పూన్, అల్లం పేస్ట్‌ – అర టీ స్పూన్, వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్, బటర్‌ – పావు కప్పు (కరింగించి), గడ్డ పెరుగు – 2 కప్పులు(ఒక మంచి క్లాత్‌లో మొత్తం పెరుగు వేసుకుని, రెండుమూడు సార్లు గట్టిగా పిండి, 3 గంటల పాటు ఓ పక్కగా వేలాడదీయాలి. 3 గంటల తర్వాత నీటిశాతం తగ్గి, క్రీమ్‌లా తయారైన క్లాత్‌లో పెరుగును ఉపయోగించుకోవచ్చు)

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బ్రెడ్‌ పౌడర్, మొక్కజొన్న పిండి, కారం, గరం మసాలా, థందూరీ మసాలా, చాట్‌ మసాలా, ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు  అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, బటర్, ఉల్లిపాయ గుజ్జు, బంగాళదుంప గుజ్జు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పనీర్‌ ముక్కలను కూడా ఆ మిశ్రమంలో వేసుకుని.. గరిటెతో తిప్పుతూ పనీర్‌ ముక్కలకు ఆ మిశ్రమం బాగా పట్టించాలి. ఇప్పుడు రెండేసి త్రిభుజాకారపు బ్రెడ్‌ స్లైస్‌లను తీసుకుని కొద్ది కొద్దిగా ఆ మిశ్రమాన్ని పెట్టుకుని.. గ్రిల్‌ చేసుకుంటే అదిరే రుచి మీ సొంతవుతుంది.

కార్న్‌ కేక్‌
కావలసినవి:  బటర్‌ – అర కప్పు, స్వీట్‌ కార్న్‌ – 2 కప్పులు, పంచదార – ఒక కప్పు, ఉప్పు– పావు టీ స్పూన్, బేకింగ్‌ సోడా – అర టీ స్పూన్‌, మొక్కజొన్న పిండి – అర కప్పు, నీళ్లు – కొద్దిగా, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – పావు టీ స్పూన్‌
తయారీ: ముందుగా స్వీట్‌ కార్న్‌ని మిక్సీలో పెట్టుకుని ముద్దలా చేసుకోవాలి. అందులో కరిగించిన బటర్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి, పంచదార, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రేలో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకుని, మరో పెద్ద ట్రేలో పెట్టుకుని.. అడుగున నీళ్లు నింపుకుని.. ఓవెన్‌ పెట్టి స్టీమ్‌ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఐస్‌క్రీమ్‌ క్యూబ్‌ స్పూన్స్‌తో తీసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

బ్రెడ్‌ బోండా
కావలసినవి:  బ్రెడ్‌ స్లైస్‌ – 10 లేదా 12, నీళ్లు – 1 కప్పు, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, బంగాళదుంపలు – 3 (మెత్తగా ఉడికించి ముద్ద చేసుకోవాలి), పచ్చిమిర్చి పేస్ట్‌ – 1 టీ స్పూన్, అల్లం పేస్ట్‌ – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్, కొత్తిమీర గుజ్జు –1 టేబుల్‌ స్పూన్, ఆలివ్‌ నూనె – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో.. బంగాళదుంప గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర గుజ్జు, ఆలివ్‌ నూనె, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ స్లైస్‌లను నాలుగువైపులా బ్రౌన్‌ కలర్‌ ముక్కలను తొలగించి.. ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌ని నీళ్లలో బాగా తడిపి.. బంగాళదుంప మిశ్రమంలో చిన్న చిన్న ముద్ద తీసుకుని అందులో పెట్టుకోవాలి. ఇప్పడు ఆ స్లైస్‌ని నాలుగు వైపుల నుంచి కలుపుతూ.. గుండ్రంగా తయారు చేసుకోవాలి. అవసరమైతే కొద్ది కొద్ది నీళ్లతో తడి చేసుకుంటూ బంగాళదుంప మిశ్రమం కనిపించకుండా క్లోజ్‌ చేసుకోవాలి. అలా చేసుకున్న బ్రెడ్‌ బాల్స్‌ని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
సేకరణ: సంహిత నిమ్మన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement