రియల్ హీరో శ్రీహరి

రియల్ హీరో శ్రీహరి - Sakshi


ప్రముఖ సినీనటుడు, రియల్ హీరో రఘుముద్రి  శ్రీహరి   క్రమశిక్షణ గల మంచి నటుడుగా పేరు తెచ్చుకోవడమే కాకుండా  పలువురి హృదయాలలో చిరస్థాయిగా నిలిచే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హీరోగా, విలన్గా‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అనేక రకాల పాత్రలు పోషించి అందరి మన్ననలు పొందిన శ్రీహరి కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ ముంబై లీలావతి ఆస్పత్రిలో ఈ సాయంత్రం కన్నుమూశారు. కేరెక్టర్ ఆర్టిస్ట్గా అగ్రస్థానంలో ఉన్న శ్రీహరి సేవాకార్యక్రమాలలో కూడా ముందుండేవారు. అక్షర ఫౌండేషన్ ద్వారా  ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించిన, పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించిన, ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న రియల్ హీరో శ్రీహరి.  



శ్రీహరి-శాంతిశ్రీలకు ఇద్దరు కుమారులతోపాటు అక్షర అనే ఒక  కుమార్తె కూడా ఉండేది. ఆ ఒక్క కుమార్తె  పసికందుగా ఉన్నప్పుడే మృతి చెందింది. ఆ  కుమార్తె జ్ఞాపకార్ధం అక్షర ఫౌండేషన్‌ స్థాపించి ఎంతో మందికి సహాయం అందించారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా అనేకమందికి సహాయం అందించారు. తన సంపాదనలో సగ భాగాన్ని ఈ ఫౌండేషన్కు ఇస్తానని ఆయన ప్రకటించారు.  హైదరాబాద్ నగర శివారు  మేడ్చల్‌ మండలంలోని ఫ్లోరైడ్ బాధిత గ్రామాలను గుర్తించారు. వారికి  2009 నుంచి ఫౌండేషన్ ద్వారా శుద్ధి చేసిన నీటిని అందించేందుకు పూనుకున్నారు. లక్ష్మాపూర్, అనంతారం, నారాయణపూర్ గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించారు.  ఈ గ్రామాలకు స్వచ్చమైన నీరు అందించేందుకు ఒక నీటి శుద్ధి ప్లాంట్ను ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులకు పలు సౌకర్యాలు కల్పించారు. ఆ గ్రామల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు.  మధ్యాహ్నం భోజనం చేసేందుకు పేద విద్యార్థులు ప్లేట్లు, యూనిఫారాలను పంపిణీ చేశారు. అక్షర ఫౌండేషన్ తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆ గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము నీటి సమస్యతో  సతమతమవుతున్నామని ఆ గ్రామస్తులు, విద్యార్థులు చెప్పారు. శ్రీహరి స్పందించి అక్షర ఫౌండేషన్‌ ద్వారా మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసి, ఇంటింటికి వాటర్ క్యాన్లను పంపిణీ చేశారని తెలిపారు. శ్రీహరి సాయం మరిచి పోలేమని చెప్పారు.



ఇతర ప్రాంతాలలోని వారికి కూడా సహాయసహకారాలు అందించారు.  నెల్లూరు జిల్లా కావలి అరుంధతీవాడలో బడి పిల్లలకు అక్షర ఫౌండేషన్‌ ద్వారా  పుస్తకములు, పలకలు, పెన్నులు పంపిణీ చేశారు. సరిహద్దులో కాపుకాసే సైనికుల వల్లే మనం కంటినిండా నిద్రపోతున్నామని,  అలాంటి వీరులు యుద్ధంలో మరణిస్తే వారి పిల్లలు అనాధలవుతున్నారని, అటువంటివారి పిల్లలను దత్తత తీసుకుని వారికి కూడా సహాయం చేద్దామని అనుకున్నారు.  ఎంతో కష్టపడి స్వయం కృషితో హీరోగా ఎదిగిన శ్రీహరి ఎంతోమందికి సహాయం చేసి మంచి మనిషిగా గుర్తింపుపొందారు. ఎంత ఎత్తుకు ఎదిగా ఒదిగి ఉండే మనస్తతత్వం శ్రీహరిదని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిచారు. తక్కువ వయసులోనే శ్రీహరి కన్నుమూయడం బాధాకరం. 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top