అక్కడ మనవాళ్లు లక్ష ఉద్యోగాలిచ్చారు..

Indian companies create over 1 lakh jobs in US - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో భారత కంపెనీలు 1800 కోట్ల డాలర్ల పెట్టుబడులతో లక్షకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించారు. అమెరికా భూభాగంలో భారతీయ మూలాలు పేరిట వెల్లడైన నివేదిక ప్రకారం అమెరికాలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత, ఆర్‌అండ్‌డీ పరిశోధనలపై కూడా భారత కంపెనీలు భారీ మొత్తం వెచ్చించాయి. అమెరికాలోని 50 రాష్ర్టాల్లో దాదాపు 100 భారత కంపెనీలు లక్షా13వేల423 మందికి ఉద్యోగాలు సమకూర్చాయి. భారత కంపెనీలు ప్రధానంగా న్యూజెర్సీ, టెక్సాస్‌, కాలిఫోర్నియా, న్యూయార్క్‌, జార్జియా రాష్ర్టాల్లో అత్యధికంగా ఉద్యోగాలను అందుబాటులోకి తెచ్చాయని ఈ నివేదిక పేర్కొంది.

భారత కంపెనీల్లో 87 శాతం కంపెనీలు రానున్న ఐదేళ్లలో స్ధానిక అమెరికన్లకే అధికంగా ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత ఐటీ పరిశ్రమ, ప్రొఫెషనల్స్‌ ఇతోథికంగా తోడ్పడుతున్నారని అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్‌ సర్నా అన్నారు.

దశాబ్ధాలుగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి భారత ఐటీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులతో పాటు స్ధానికులకు ఉపాధి అవకాశాలు సమకూరుస్తున్నట్టు ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సహకారం మరింత బలపడుతుందని యూఎస్‌ సెనేటర్‌ క్రిస్‌ వాన్‌ హెలెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Back to Top