బెంగాలీ భలే.. | Bengalis to celebrate Dasara festival | Sakshi
Sakshi News home page

బెంగాలీ భలే..

Oct 3 2014 12:26 AM | Updated on Jul 29 2019 6:03 PM

బెంగాలీ భలే.. - Sakshi

బెంగాలీ భలే..

దసరాకు బెంగాలీలకు ఉన్న అనుబంధం తెలియనివారుండరు. నవరాత్రి వేడుకలను పశ్చిమ బెంగాల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు.

దసరాకు బెంగాలీలకు ఉన్న అనుబంధం తెలియనివారుండరు. నవరాత్రి వేడుకలను పశ్చిమ బెంగాల్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. సిటీలో కూడా దసరా మంటపాలకు స్ఫూర్తి అక్కడి వేడుకలే. ఈ నేపథ్యంలో.. నగరంలో దశాబ్దాలుగా  స్థిరపడిన విభిన్న రంగాల బెంగాలీ ప్రముఖులతో ముచ్చటించినప్పుడు...
 
 49వ పండుగ..
 ‘ఇది మా సంఘం ప్రారంభించిన తర్వాత జరుగుతున్న 49వ పండుగ.  ఈ వేడుకల్లో పాల్గొనడం కోసం కోల్‌కతా, ముంబై నుంచి సైతం కళాకారులు ‘వచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో మ్యూజిక్, డ్రాయింగ్, అంత్యాక్షరి... ఇలా ఉదయం అంతా పోటీలే. సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ కార్యక్రమాలు జరుగుతున్న ఆవరణలో  40 వరకూ బెంగాలీ రుచులు చూపించే ఫుడ్ స్టాల్సే ఉన్నాయి’ అని వివరించారు బంగీయ సాంస్కృతిక సంఘ్‌అధ్యక్షుడు దీపక్  భట్టాఛార్జీ.
 
 అమ్మవారి దగ్గరే...
‘దసరా నవరాత్రులంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్‌లున్నా, ఈవెంట్లున్నా, అన్నీ బంద్. ఈ 10 రోజులూ ఇక్కడే గడిపేస్తాం. నిష్టగా పూజలు చేస్తాం. నిండుగా చీరలు కడతాం. అంతేనా.. ఆడతాం. పాడతాం. ఓహ్.. సంబరాలంటే ఇవీ’ అంటూ హుషారుగా చెప్పారు నటి శిల్పా చక్రవర్తి. రాష్ట్రవ్యాప్తంగా పరిచయమున్న ఈ ప్రముఖ టీవీ యాంకర్.. తెలుగమ్మాయి కాదంటే నమ్మలేం. ఆమెలోని అచ్చమైన బెంగాలీని బయటికి తెచ్చే సమయం అంటే దసరా పండుగే. ‘ఇక్కడ జరిగే నవరాత్రులే నాకు బాగా ఇష్టం’ అంటున్నారు శిల్ప.  
 
 సామూహిక వేడుక
 ‘మాది తూర్పు బెంగాల్. ఇప్పుడది బంగ్లాదేశ్ అయింది. మా తాతల కాలంలోనే హైదరాబాద్ వచ్చేశాం’ అంటూ చెప్పిన నటి చందనా చక్రవర్తి.. అన్ని కుటుంబాలు కలసి ఒక్క చోట చేరి సామూహిక పూజలు, కార్యక్రమాలు నిర్వహించడమే తమ వేడుకలోని విశిష్టత అంటున్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమమైనా, కుల మతాలకు అతీతంగా అందరూ ఒక్కటే అన్న భావనతో సంబరం చేసుకుంటామని అంటున్నారామె. మంటపాలను ఒక థీమ్‌తో అలంకరించడం బెంగాలీ దసరా వేడుకల్లో మరో విశేషం’అని చెప్పుకొచ్చారు.
 
 సంస్కృతికి ప్రతీకగా..

ఏడాదికి రెండుసార్లు కోల్‌కతా వెళ్లినా దసరా సరదా మాత్రం ఇక్కడే అంటున్నారు అసిమా సేన్‌గుప్తా. నగరంలోని పాపులర్ ఎడ్యుకేషన్ సొసైటీ కి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న అసిమా 40 ఏళ్లుగా సికింద్రాబాద్‌లో నివసిస్తున్నారు. స్థానిక బెంగాలీల కోసం వారి స్వరాష్ట్రానికి తీసిపోని విధంగా పండుగ సంబరాలను నిర్వహిస్తున్నారు.
 - సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement