ఆయన హీరో!

ఆయన హీరో! - Sakshi


వైఎస్సార్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే కొన్ని ఘట్టాలు(ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ)


అది 1991 మార్చి ఆరు... పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌... రాజీవ్‌ గాంధీ మద్దతుతో చంద్రశేఖర్‌ ప్రధానిగా ఉన్నారు. రాజీవ్‌గాంధీ ఇంటి వద్ద హర్యానా పోలీసులిద్దరిని రాజీవ్‌ గాంధీ సెక్యూరిటీ గుర్తించారు. దీనిపై కాంగ్రెస్‌ ఎంపీలు 1991 మార్చి 6న జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తీవ్ర స్థాయిలో ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజీవ్‌గాంధీపై నిఘా పెట్టించారా? వారు అక్కడ ఎందుకు ఉన్నారంటూ గొడవ చేశారు. వెంటనే బయటకెళ్లిన చంద్రశేఖర్‌... తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి ఎన్నికలు జరిగి 14 నెలలే అయింది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరూ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ (క్యాంటిన్‌)లో కూర్చున్నారు. ‘చంద్రశేఖర్‌ రాజీనామా చేశారు.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా?’ అంటూ చర్చించుకుంటున్నారు.హాల్‌ అంతటా గందరగోళం. ఆహారం కోసం ఓ బిహార్‌ ఎంపీ సర్వర్‌ను పిలిచాడు. ఆ గందరగోళం, పని హడావుడిలో అతనికి వినిపించకపోవడం లేదా గమనించకపోవడం జరిగింది. రెండోసారి పిలిచినా అదే పరిస్థితి. దీంతో బిహార్‌ ఎంపీకి చిర్రెత్తుకొచ్చి ఆ సర్వర్‌ను లాగి చెంపపై కొట్టారు. ఆ దెబ్బ శబ్దం సెంట్రల్‌ హాల్‌లో ప్రతిధ్వనించింది. అప్పటి వరకు ఎంపీల మధ్య చర్చోపచర్చలతో ఉన్న ఆ హాల్‌లో ఒక్కసారిగా పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌. నాలుగు బెంచీల దూరంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల మధ్య కూర్చొని ఉన్న వైఎస్‌ ఒక్క ఉదుటన లేచి నాలుగు అంగల్లో సర్వర్‌ వద్దకు వెళ్లారు. ‘ఏయ్‌.. ఇధరావో, ఇధరావో’ అంటూ ఆ బిహార్‌ ఎంపీని పిలిచారు. ‘సే సారీ టు హిమ్‌’ అన్నారు. ‘వాడు ఏం చేశాడో తెలుసా’ అని బిహార్‌ ఎంపీ ఏదో చెప్పబోతుంటే... వైఎస్‌ తన చేతితో బల్లపై టాక్‌మని కొట్టి ‘డోంట్‌ టాక్, ఫస్ట్‌ ఆస్క్‌ హిమ్‌ ఫర్‌ అపాలజీ. యూ హావ్‌ నో రైట్‌ టు టాక్‌’ అన్నారు. మొత్తం హాల్‌ అంతా నిశ్శబ్దమయిపోయింది. అప్పుడు ఓ పెద్దావిడ వచ్చి ‘పోయిందనుకున్నాను. నమ్మకమంతా పోయిందనుకున్నాను. ఈ దేశంలో ఇక పేదవాడిని ఏం చేసినా అడిగేవారెవరూ ఉండరనుకున్నాను. నువ్వు ఒక్కడివి కనిపించావు అడిగేవాడివి’ అన్నారు.తర్వాత ఆవిడ ఎవరని నేను విచారించాను. ఆమె బిహార్‌కు చెందిన మాజీ ఎంపీ తారకేశ్వరీ సిన్హా అని తెలిసింది. ఆ తర్వాత ఎంపీలందరూ వైఎస్‌కు మద్దతుగా వచ్చారు. అప్పుడు బిహార్‌ ఎంపీ ‘సారీ నేను ఎదో అవుట్‌ ఆఫ్‌ మూడ్‌లో ఉన్నాను’ అని ఏదో చెప్పబోతుండగా సర్వర్‌ ‘నాదే తప్పు సార్‌’ అన్నాడు. అప్పుడు వైఎస్‌ కలుగజేసుకుని ‘ఇక్కడ నీ పని నువ్వు చేస్తున్నావు. మా పని మేము చేస్తున్నాము. ఇక్కడ ఎవరూ ఎవరి కన్నా తక్కువ కాదు, ఎక్కువ కాదు. పార్లమెంట్‌లో మేమే ఒకరిని కొట్టే పరిస్థితి వస్తే ఈ దేశంలో పరిస్థితి ఏమిటి? నువ్వేమీ ఫీల్‌ అవకు’ అంటూ సర్వర్‌ని  సముదాయించారు. తర్వాత కొద్దిసేపటికి ఆ బిహార్‌ ఎంపీ వచ్చి ‘రాజశేఖరరెడ్డి.. ఆ యామ్‌ సారీ. ఇందాక నేను ఏదో మూడ్‌లో ఉండి అలా చేశాను’ అన్నారు. ‘‘ఓకే... అది నా ఇమిడియట్‌ రియాక్షన్‌. ఆ యామ్‌ ఆల్‌సో సారీ’’ అంటూ వైఎస్‌ కూడా హుందాగా బదులిచ్చారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top