షహనాజ్‌ అను నేను..! | women sarpanch Sahanaj special | Sakshi
Sakshi News home page

షహనాజ్‌ అను నేను..!

Mar 27 2018 12:13 AM | Updated on Mar 27 2018 12:13 AM

women sarpanch Sahanaj special - Sakshi

సర్పంచ్‌గా ఊరి మంచిచెడ్డలు చూడబోతున్న షహనాజ్‌.. త్వరలోనే ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని ఊళ్లోవాళ్లకు డాక్టరమ్మగా కూడా  వైద్య సేవలు కూడా అందించబోతున్నారు. 

మేవాత్‌.. రాజస్తాన్, హరియాణా  కలిసి పంచుకుంటున్న ప్రాంతం. గడ్జన్‌ గ్రామం! ఈ రెండు రాష్ట్రాల ఫ్యూడల్‌ స్వభావం ప్రబలంగా ఉన్న ఊరు. ఇక్కడి ఆడపిల్లలను స్కూళ్లకు పంపరు. తల మీద గూంఘట్‌ ఉండాల్సిందే. అలాంటి ఊరు మైనారిటీ వర్గం పాలనలో ఉన్నది. హనీఫ్‌ ఖాన్‌ అనే వ్యక్తి దాదాపు 55 ఏళ్లు (2015 వరకు) గడ్జన్‌కు సర్పంచ్‌గా పనిచేశాడు. ఇంకా కూడా కొనసాగునేమో.. కొనసాగడానికి  వీల్లేదని కోర్టు తీర్పునిచ్చింది. కారణం.. సర్పంచ్‌ పదవికి కనీస విద్యార్హత టెన్త్‌క్లాస్‌. హనీఫ్‌ ఖాన్‌ పదవ తరగతి చదవకపోయినా చదివినట్టు డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ పెట్టి పదవిలో ఉన్నారని కోర్టులో రుజువు కావడంతో రాజీనామా తప్పలేదు. అయితే ఇది కాదు ఇక్కడి కథ!

మరి అసలు కథేంటి?
ఆయన మనవరాలు షహనాజ్‌ ఖాన్‌ ఇప్పుడా ఊరికి సర్పంచ్‌. తాతలాగా  చదువుకోని మనిషి కాదు. గడ్జన్‌ ఊళ్లోని ఇతర ఆడపిల్లల్లా పేరు వరకు రాయడం తెలిసిన అమ్మాయీ కాదు. గూంఘట్‌తో కాదు వ్యక్తిత్వంతో గౌరవాన్ని అందుకోవాలనే మనస్తత్వం ఆమెది. హహనాజ్‌ ఒక మెడికో. సర్పంచ్‌ ఎన్నికలప్పటికి ఎంబీబీఎస్‌ ఫోర్త్‌ ఇయర్‌లో ఉంది. ఆ ఊరికి అతి చిన్న.. ఉన్నత చదువున్న సర్పంచ్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ‘‘మేవాత్‌ ప్రాంతంలో ఆడపిల్లలను స్కూళ్లకు పంపరు.  నన్నే  ఎగ్జాంపుల్‌గా చూపించాలిప్పుడు ఆ  ఊళ్లోని తల్లిదండ్రులకు’’అని చెప్తుంది షహనాజ్‌.

తాతే కాదు అమ్మ కూడా...
షహనాజ్‌ తల్లి జహీదా కూడా రాజకీయ నాయకురాలే. భరత్‌పూర్‌ జిల్లాలోని కమన్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. తండ్రి జలీజ్‌ ఖాన్‌ కమన్‌ ప్రధాన్‌గా పనిచేశాడు. తాత, తండ్రి, తల్లి.. వీళ్లందరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న షహనాజ్‌ గడ్జన్‌కు ఎంతో సేవ చేయాలని ఊవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువు, ప్రాథమిక అవసరాలైన తాగునీరు, ఆరోగ్యం, శానిటేషన్‌ మీద దృష్టిసారించింది. మేవాత్‌లో టీబీ ప్రబలంగా ఉంది. ‘‘ఆరునెలల్లో నయమయ్యే ఈ వ్యాధిని  అవగాహన లేక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. దీని మీద యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలనుకుంటున్నాను’’ అంటోంది ఇంకొన్ని రోజుల్లో  డాక్టర్‌ పట్టాపుచ్చుకోబోతున్న షహనాజ్‌.  

చదువు.. పదవి.. 
ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్‌లోని తీర్థంకర్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న షహనాజ్, గుర్‌గావ్‌లోని సివిల్‌ హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్‌ చేయాలనుకుంటోంది. ఇక్కడితోనే ఫుల్‌స్టాప్‌ పెట్టకుండా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌నూ పూర్తిచేయాలనుకుంటోంది. మరి సర్పంచ్‌ బాధ్యతలు? అని ప్రశ్నిస్తే ‘‘నా ప్రజాసేవకు ఇవేవీ అడ్డుకావు’’ అంటూ సమాధానమిస్తోంది. తాను నేర్చుకున్న వైద్యాన్ని ప్రజాసేవలో భాగం చేయాలనుకుంటోంది ఈ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ సర్పంచ్‌! యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. ఉత్సాహవంతులైన అమ్మాయిలు ఉండటం మరీ మంచి విషయం! 
– శరాది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement