మీటూ దెబ్బకు సీట్లు ఖాళీ!

women empowerment : mee to elections by women - Sakshi

యు.ఎస్‌.లో ఎన్నికలు

ఫిబ్రవరిలో రెండు చోట్ల ‘మీటూ’ ఎన్నికలు జరగ్గా..  మార్చి 13న ఒకటి, ఏప్రిల్‌ 24న మరొకటీ మీటూ  ఎన్నికలు జరగబోతున్నాయి. టిమ్‌ మర్ఫీ అనే ఆయన  తన వివాహేతర ప్రియసఖికి.. ‘అబార్షన్‌ చేయించుకో’  అని మెజేస్‌ ఇచ్చినందుకు, ట్రెంట్‌ ఫ్రాంక్స్‌ అనే ఆయన  తన బిడ్డలకు అద్దెతల్లులుగా ఉండమని తన మహిళా  సిబ్బందిని కోరినందుకు ఈ రెండు ఎన్నికలూ అవసరమయ్యాయి. 

‘మీటూ’ ధర్మాగ్రహానికి మగవాడి దురహంకార సౌధాలు ఒకటొకటిగా బీటలు వారుతున్నాయి! దాగి ఉన్న బొద్దింకలను కూడా బయటికి రప్పించి, మట్టుపెట్టే ‘స్ప్రే’లా, ఈ స్త్రీల ఉద్యమమైన ‘మీటూ’..  ఒక్కొక్క పెద్దమనిషి నిజ స్వరూపాన్నీ రచ్చకీడుస్తోంది. సాటి మహిళలకు ఆత్మస్థయిర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు చిత్రపరిశ్రమలో ఉన్న లైంగిక హింసోన్మాదులపైనే జరుగుతున్న ‘మీటూ’ పోరాటం క్రమంగా పాలనా భవనాలలోకి సైతం ధైర్యంగా చొరబడి, కామ పిశాచాలైన ప్రజాప్రతినిధులను సీట్లలోంచి లాగి అవతల పడేస్తోంది! దాంతో ఇప్పుడు యు.ఎస్‌.లో తరచూ ఎన్నికలు జరగడం మామూలైపోయింది. లైంగిక వేధింపులకు పాల్పడిన సెనెటర్లు రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడడంతో వారి స్థానాలలో కొత్తవారిని ఎన్నుకునేందుకు దాదాపు ప్రతినెలా ఒక పోలింగ్‌ జరుగుతోంది! ఓక్లహోమాలో ఆ రాష్ట్ర సెనెటర్‌ (ఎగువసభ సభ్యుడు) తనను ముద్దుపెట్టుకోడానికి ప్రయత్నించినట్లు ఊబర్‌ మహిళా డ్రైవర్‌ ఒకరు ఆరోపించడంలో తాజాగా ఆయన పదవి గండంలో పడింది.

కాలిఫోర్నియాలో ఆ రాష్ట్ర అసెంబ్లీమ్యాన్‌ (దిగువసభ సభ్యుడు), పాలనా విభాగాలలో పని నిమిత్తం వచ్చిన ఒక మహిళా లాబీయిస్టును ఆమె రెస్టురూమ్‌ వరకు వెంబడించి, ఆమె ఎదురుగానే స్వీయస్ఖలన చర్యకు పాల్పడడంతో అతడి సీటు కూడా ఖాళీ అయింది. మిన్నెసోటా రాష్ట్రంలో మరో లాబీయిస్టు.. ఒక ప్రజాప్రతినిధి తనను లైంగికంగా లోబరుచుకునేందుకు నిరంతరం తనపై ఒత్తిడి తెచ్చాడని, ఒక టెక్స్‌›్ట మెసేజ్‌ కూడా ఇచ్చాడని బయటపెట్టడంతో ఆయన స్థానంలోకి కొత్త వ్యక్తి అవసరమయ్యాడు! అతడు పంపిన మేసేజ్‌ సారాంశం ఇది: ‘‘ఏకాంతవేళ ఖరీదైన మద్యాన్ని స్వల్పంగా సేవించి, రుచికరమైన ఆహారాన్ని భుజించి, భోజనానికి ముందరో... తర్వాతో మైమరిపించే శయన మందిర సుఖాన్ని పొందాలని ఉందని నేను నీతో అంటే కనుక.. అది నిన్ను వణికించే విషయం అవుతుందా?’’ ఈ టెక్స్‌›్టని తీసుకెళ్లి ఆ లాబీయిస్టు నేరుగా స్టేట్‌ సెనెట్‌కు ఫిర్యాదు చేయడంతో నియోజకవర్గంలో ఆయనకు నూకలు చెల్లాయి.!  ఇటీవలి కాలంలో ఇలా పన్నెండు మందివరకు స్టేట్‌ సెనెటర్‌లు, ఫెడరల్‌ సభ్యులు (కేంద్రంలో ఎగువ, దిగువ సభలైన ‘సెనెట్‌’, ‘హౌస్‌’ సభ్యులు) లైంగిక ఆరోపణలు ఎదుర్కొని, రాజీనామా చెయ్యడంతో ఆ స్థానాలను భర్తీ చెయ్యడం కోసం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి అమెరికన్‌ ప్రజలు ‘మీటూ ఎన్నికలు’గా నామకరణం చేశారు! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top