గేట్ ఉమన్ విధుల్లోనూ రాణింపు | Woman allowed to gate | Sakshi
Sakshi News home page

గేట్ ఉమన్ విధుల్లోనూ రాణింపు

Oct 7 2014 11:47 PM | Updated on Sep 2 2017 2:29 PM

గేట్ ఉమన్  విధుల్లోనూ రాణింపు

గేట్ ఉమన్ విధుల్లోనూ రాణింపు

పురుషాధిక్య ప్రపంచంలో ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు...

పురుషాధిక్య ప్రపంచంలో ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు... కానీ పురుషులకు దీటుగా రైల్వే లెవల్ క్రాసింగ్ గేటు వద్ద గేట్‌మన్ విధులు నిర్వహిస్తూ మహిళలు అన్నింటా ముందు ఉంటారని నిరూపిస్తోంది రాధారాణి. పురుషులకు మాత్రమే సాధ్యమైన ఈ ఉద్యోగ బరువు బాధ్యతను భుజాల మీద వేసుకుని, ధైర్యంగా ముందుకు సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి అనుకుని ఉన్న బెండిగేటు లెవల్ క్రాసింగ్ గేటు వద్ద గేట్‌మెన్ విధులు నిర్వహిస్తున్న కింతల రాధారాణి తనను పలకరించిన ‘సాక్షి’ కి ఇలా చెప్పింది...


‘‘మాది పలాస మండలం గరుడఖండి గ్రామం. నాన్న ధర్మారావు 36 ఏళ్లగా గ్యాంగ్ మెన్, గేట్‌మెన్‌గా ఇక్కడే విధులు నిర్వహించారు. నా తల్లిదండ్రులకు ముగ్గురు సంతానంలో నేను చివరి అమ్మాయిని. మా అక్కలిద్దరి పెళ్లిళ్లూ చేసేందుకు నాన్నకు చాలా అప్పయింది. నేను డిగ్రీ చదువుకున్నాను. ఏదో ఒక ఉద్యోగం చేస్తూ, నాన్నకు ఆసరాగా నిలబడదామనుకున్నాను. ఇంతలోనే నాన్నకు ఆరోగ్యం క్షీణించింది. విధులు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఆయన తన ఉద్యోగానికి వీఆర్‌ఎస్ తీసుకుని ఆ ఉద్యోగంలో నన్ను నియమించాలంటూ రైల్వే శాఖకు అర్జీ పెట్టుకున్నారు. ఆయన విజ్ఞప్తిని ఉన్నతాధికారులు సహృదయంతో మన్నించి, 5 నెలల కిందట నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు.

 గేట్‌మన్ విధులు నిర్వహించడంలో ఒకింత ఇబ్బందులు ఉన్నప్పటికీ మెల్లగా అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాను. తోటి ఉద్యోగుల తోడ్పాటు, తండ్రి నేర్పిన పాఠాలు నాకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. రైల్వే శాఖలో డిపార్టుమెంటల్ పరీక్షలు రాస్తూ ఉన్నతోద్యోగానికి ప్రయత్నిస్తున్నా’’ అని చెబుతున్న రాధారాణి తన విధి నిర్వహణలో మరింత మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిద్దాం.
 - గుంట శ్రీనివాసరావు

 పూండి(వజ్రపుకొత్తూరు), శ్రీకాకుళం జిల్లా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement