జ్ఞాపకాలు వీచే చోట! | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాలు వీచే చోట!

Published Mon, Jun 23 2014 10:50 PM

జ్ఞాపకాలు వీచే చోట!

కళ

షన్హన్(గుండ్రనివి), జంగ్షన్(మడవడానికి వీలున్నవి)  పేరుతో రెండు రకాల విసనకర్రలు ఉన్నాయి. పరిమాణంలో ఎలా ఉన్నా అందంలో మాత్రం వేటి ప్రత్యేకత వాటిదే. గాలి కోసం మాత్రమే కాకుండా ఇంటిలో అలంకారానికి కూడా వీటిని వాడుకునేవారు.

 ఉక్కపోతలో...విసనకర్రలు వీస్తుంటే శరీరానికి తగిలే గాలి హాయిగా ఉంటుంది.
 విసనకర్రల్లో రంగు రంగుల బొమ్మలుంటే?
 మనసుకు హాయిగా ఉంటుంది.
 ఈ  ఏసీ కాలంలో విసనకర్రలు ఎక్కడివి? వాటి మీద బొమ్మ లెక్కడివి? అనిపించవచ్చుగానీ, చైనాలో మాత్రం...బొమ్మల విసనకర్రలను సేకరించడం ఇప్పటికీ హాబీగా ఉంది. మూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఈ కళకు చైనాలో ఇప్పటికీ డిమాండ్ ఉంది.
 షన్హన్(గుండ్రనివి), జంగ్షన్(మడవడానికి వీలున్నవి)  పేరుతో రెండు రకాల విసనకర్రలు ఉన్నాయి. పరిమాణంలో ఎలా ఉన్నా అందంలో మాత్రం వేటి ప్రత్యేకత వాటిదే. గాలి కోసం మాత్రమే కాకుండా ఇంటిలో అలంకారానికి కూడా వీటిని వాడుకునేవారు.
 మరొకటి ఏమిటంటే, అభిరుచిని, అంతస్తులను కూడా ఇవి ప్రతిబింబించేవి. కొన్ని సందర్బాల్లో ఈ కళాత్మక విసనకర్రలను కవితలతో కలిసి అలంకరించేవారు.
 ‘‘విసనకర్రల మీద బొమ్మల చిత్రణ అనేది కత్తి మీద సాములాంటిది’’ అన్నాడు మింగ్ రాజుల కాలం నాటి చిత్రకారుడు యున్మింగ్.
 ఇటీవల బీజింగ్‌లో ప్రాచీన కాలానికి చెందిన  ‘చైనీస్ ఫ్యాన్ పెయింటింగ్స్’ ఎగ్జిబిషన్ ఒకటి జరిగింది. అవి చూసిన వాళ్లకు..గత కాలం నాటి కళాసౌందర్యం కళ్లకు కట్టింది.
 ‘‘అవి వీచకుండానే చల్లటి గాలి నుదుటిని తాకింది’’ అన్నాడు ఒక యువ చిత్రకారుడు.
 ‘‘అవి మౌనంగా ఉంటూనే ఎంతో మాట్లాడాయి’’ అన్నాడు గాయకుడు ఒకరు.
 ఎవరూ ఎలా స్పందించినా...విసనకర్రలు మాత్రం గంభీరంగా కనిపించాయి. చెప్పకనే తమ గొప్పతనాన్ని చెప్పాయి!
 

Advertisement
Advertisement