ఓ ఇల్లాలి ఉల్లాసం

Vanitha Durai tackled life in Sweden as an Indian woman - Sakshi

లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌

కదిలేంత వరకే జీవితం బెరుకు బెరుగ్గా ఉంటుంది.  కదిలాక ఎక్కడ లేని దీమా వచ్చేస్తుంది. కొత్త జీవితం అంటే ఏం లేదు. కొత్త ప్రదేశమే. అది మారిన దేశం కావచ్చు, మారిన రాష్ట్రం కావచ్చు, ఆఖరికి మారిన ఇల్లయినా కావచ్చు. 

వనితా దురై గోథెన్‌బర్గ్‌ వెళ్లే వరకు స్వీడన్‌లోని ఆ తీరప్రాంత పట్టణంలో నివాసం ఉంటున్న భారతీయ మహిళలు ఎవరికివారిగా ఉండేవారు. ఐదేళ్లయింది వనిత చెన్నై నుంచి అక్కడికి వెళ్లి. వెళ్లేటప్పుడు భర్తకు మాత్రమే ఉద్యోగం. వెళ్లాక తనూ ఒక ఉద్యోగం సంపాదించుకుంది. వాల్వో కార్ల కంపెనీలో చేస్తోంది తనిప్పుడు. అయితే ఆ ఉద్యోగం ఆమెకు ఏమంత తేలిగ్గా రాలేదు. అదనే కాదు, ఏ ఉద్యోగమూ కష్టపడి తెచ్చుకోనిదే రాదు. తిరగాలి. తెలియని భాష మాట్లాడాలి. అప్లికేషన్‌లో మనకు ఉన్నాయని చెప్పుకున్న ప్రతిభాసామర్థ్యాలకు మించి ఇంటర్వ్యూలో కనబరచాలి. ఉద్యోగంలో చేరాక అంతకుమించి నిరూపించుకోవాలి. అప్పుడే పరాయిదేశంలో స్థిరపడగలం. స్థిరపడ్డాక ఏమిటి జీవితం? రోజూ ఆఫీసుకు వెళ్లిరావడం, రోజూ భర్తను, పిల్లల్ని సిద్ధం చేసి పంపించడం ఇదేనా?! ఇదే కావచ్చు. ఇందులోనే సంతోషం వెతుక్కోవచ్చు. అయితే వనిత ఈ స్థిరత్వంలోనే ఉండిపోదలచుకోలేదు. గోథెన్‌బర్గ్‌లో ఉన్న మిగతా భారతీయ ఉద్యోగులను, గృహిణులను కలుపుకుని ఏదైనా చేయాలని అనుకున్నారు. ఏదైనా చెయ్యడం తర్వాత. ముందు కలుపుకోవడం ఎలా? ఫేస్‌బుక్‌ ఉందిగా. అందులోంచి వెల్‌కమ్‌ చెప్పారు. మంచీచెడ్డా చెప్పుకున్నారు. మీ పిల్లలేం చదువుతున్నారంటే, మీ పిల్లలేం చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుకున్నారు. పండగలొస్తే వేడుకలు చేసుకున్నారు. దీపావళికి స్వీట్లు పంచుకున్నారు. క్రిస్మస్‌ వస్తే ఫ్రూట్‌ కేకులు పంపుకున్నారు. రంజాన్‌కు శుభాకాంక్షలు తెలుపుకుని ఆత్మీయ విందులకు ఆహ్వానించారు. బర్త్‌డేలు ఎలాగూ ఉంటాయి. ఏదైనా సాధించిన రోజూ ఉంటుంది. ఇటీవలే ఈ టీమ్‌లోని ఉల్లాసవంతులంతా కలిసి ఓ సెంట్రల్‌ మాల్‌లో ‘ఫ్లాష్‌మాబ్‌’ ఈవెంట్‌లో డ్యాన్స్‌ కూడా చేశారు. అంతా డ్యాన్సు వచ్చే చేయలేదు. డ్యాన్స్‌ వచ్చినవాళ్లతో కలసి చేశారు. స్త్రీత్వంలోని సౌందర్యాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. అలా గోథెన్‌బర్గ్‌లో ఒక అందమైన భారతీయ మహిళా దేశం ఆవిర్భవించింది. ఆ దేశం వ్యవస్థాపకురాలు వనితా దురై. ఆ దేశం పేరు ‘ఇండియన్‌ ఉమెన్‌ ఇన్‌ గోథెన్‌బర్గ్‌’. ముప్పై నాలుగేళ్ల వనితా దురై స్వీడన్‌ తనకెంత బాగా నచ్చిందో చెబుతున్నప్పుడు చూడాలి ఆమె కళ్లను. ఆ మెరుపు గోథెన్‌బర్గ్‌ మొత్తాన్నీ వెలిగిస్తున్నట్లుగా ఉంటుంది. 

‘‘స్వీడన్‌ వచ్చాక, ఒక ఉద్యోగం వెతుక్కునేవరకు పరిస్థితులు కాస్త గడ్డుగా ఉన్నట్లనిపిస్తాయి. ఉద్యోగంలో చేరాక అంతా మనోహరంగా మారిపోతోంది. నాకైతే కుటుంబ జీవితానికి స్వీడన్‌ని మించిన దేశం లేదనిపిస్తుంది. సెలవుల్ని, సాయంత్రాలను ఇక్కడ తప్ప ఎక్కడా ఇంత ఆహ్లాదకరంగా అనుభూతి చెందలేమేమో అనిపిస్తుంది. చుట్టూ అన్నీ మైదానాలే. ఎక్కడా రద్దీ ఉండదు. కాలుష్యం కనిపించదు. శబ్దాలు ఉండవు. ఈ సంస్కృతిలోంచి వీచే ఏ దేవగానమో మార్మికంగా చెవులకు సోకుతూ మనసును ప్రశాంత పరుస్తుంటుంది. అంతా కలిసి కూర్చొని దీర్ఘంగా ముచ్చటించుకుంటూ కాఫీ తాగే ఇక్కడి ‘ఫికా’ కల్చర్‌ కోసమైనా చెన్నై నుంచి ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణించి రావచ్చు. ఇక్కడి వాళ్లు ఎంత హ్యాపీగా, రియల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటారో చెప్పలేను. మనం మనలా ఉంటే చాలు, వాళ్లలో కలిసిపోవచ్చు’’ అని వనితా దురై పెట్టిన పోస్టును ఇండియాలో, విదేశాల్లో ఉన్న ఆమె ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ ఒక ట్రావెలాగ్‌లా చదివి గోథెన్‌బర్గ్‌ను కాఫీ పరిమళాలతో కలిసి ఆస్వాదిస్తున్నారు. కదిలేంత వరకే జీవితం బెరుకు బెరుగ్గా ఉంటుంది.  కదిలాక ఎక్కడ లేని దీమా వచ్చేస్తుంది. కొత్త జీవితం అంటే ఏం లేదు. కొత్త ప్రదేశమే. అది మారిన దేశం కావచ్చు, మారిన రాష్ట్రం కావచ్చు. ఆఖరికి మారిన ఇల్లయినా కావచ్చు.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top