అనుబంధాల సిరులు | Supplements of sankranthi | Sakshi
Sakshi News home page

అనుబంధాల సిరులు

Jan 13 2015 10:27 PM | Updated on Oct 1 2018 6:33 PM

అనుబంధాల  సిరులు - Sakshi

అనుబంధాల సిరులు

సంక్రాంతి పండుగ అనగానే తెలుగు ప్రజల హృదయాలు పులకించి పోతాయి.

 చిట్టిబోయిన రామకృష్ణరాజు, ‘సాక్షి’, ఏలూరు
 
సంక్రాంతి పండుగ అనగానే తెలుగు ప్రజల హృదయాలు పులకించి పోతాయి. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో స్వగ్రామానికి దూరంగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో స్థిరపడిన వారు కూడా తమ స్వగ్రామానికి వెళ్ళడానికి ఈ పండుగనే ఎంచుకుంటారు. సుదూరంలో ఉన్న వారసులంతా ఇంటికి రావడంతో ప్రపంచాన్నే జయించినంతగా కుటుంబ పెద్ద సంబరపడిపోవడం చూస్తుంటాం. కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుడితో సహా పండగకు ఇంటికి వచ్చిందంటే ఆ తల్లిదండ్రుల ఆనందం, హడావిడి చెప్పనలవికాదు. కొత్త అల్లుడికి కోరినవన్నీ తెచ్చిపెట్టే బాధ్యతను మామగారు భుజాలపై వేసుకుంటే తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని సంధిస్తూ అత్తగారు కొత్తకొత్త వంటకాలతో అల్లుడిపై ఆప్యాయతను చూపిస్తుంటారు. ఇక తెలుగుదనం ఉట్టిపడేలా లంగా ఓణీలు. పరికిణీలు, పంచె  కట్టులు చూడాలంటే సంక్రాంతి పండుగను మించిన పండుగ మరోటి లేదనే చెప్పవచ్చు. సంక్రాంతి ముందురోజు భోగి, మరుసటి రోజు కనుము, ఆ మరుసటి రోజు ముక్కనుముగా నిత్యం పిండివంటలు, నూతన వస్త్రాలతో అన్ని గృహాలూ కళకళలాడుతుంటాయి. ఇప్పుడంటే కోడిపందాలు ఒక దురాచారంగా పరిగణిస్తున్నప్పటికీ వాటిని కూడా సంప్రదాయంగా పాటించే కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాగే మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు క్రికెట్, షటిల్ వంటి పోటీలు నిర్వహించడానికి స్థానిక సంస్థలూ ముందుకొస్తాయి.
 
అరిసెలు, సున్నుండలు

సంక్రాంతి పండుగకు తెలుగు ప్రజలు చేసుకునే ప్రత్యేక పిండివంటల్లో అరిసెలు, సున్నుండల స్థానాన్ని మరే పిండి వంటకమూ పూరించలేదేమో! పండుగ రోజున చేసుకునే బూరెలు గారెలు, పులిహోర వంటకాలు ప్రతి పండుగలో కనిపించినా ఈ అరిసెలు, సున్నుండలు మాత్రం సంక్రాంతి పండుగనాడే ఎక్కువగా పలకరిస్తుంటాయి. అలాగే ఈ పండుగ సందర్భంగా  చేసుకునే మరికొన్ని పిండివంటల్లో పాకుండలు, కజ్జికాయలకూ ప్రత్యేక స్థానముంది. ఎన్ని అధునాతన మిఠాయిలు అందుబాటులోకి వచ్చినా వీటి ప్రాముఖ్యం వీటిదే.

దాసులు... బసవన్నలు

సంక్రాంతి పండుగకు కొత్త కళను తీసుకురావడంలో హరిదాసులు, డూడూబసవన్నల పాత్ర మరువరానిది. ధనుర్మాసం ఆరంభం నుండి ప్రతినిత్యం వేకువ జామునే హరిలోరంగ హరి అంటూ హరినామ స్మరణ చేస్తూ ప్రజలను మేల్కొలిపే హరిదాసుల సందడి ఇటీవలి కాలంలో కాస్త తగ్గినప్పటికీ కొంతమంది హరిదాసులు మాత్రం తమ వంశాచారంగా వస్తున్న వృత్తిని ఇప్పటికీ కొనసాగించడం విశేషం. హరిదాసులుగా వస్తున్న కొంతమంది వ్యక్తుల్లో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారంటే ఈ వృత్తికి వారు ఇస్తున్న విలువను అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో సంప్రదాయ పండుగలు కళతప్పుతున్నాయనే భావన సమాజంలో ఏర్పడడంతో వాటిని పునఃప్రతిష్టించే బాధ్యతను విద్యాసంస్థలు తీసుకుంటున్నాయి. విద్యాసంస్థలు తమ పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో పండుగలను నిర్వహిస్తూ సంప్రదాయాల పట్ల భావి భారత పౌరుల్లో అవగాహన పెంచుతూ పండుగల ప్రత్యేకతలను, వాటి ఔన్నత్యాన్ని చాటిచెబుతున్నాయి. సంప్రదాయంగా చేసుకునే పండుగ వెనుక ఉన్న పర్యావరణ, ఆరోగ్య రహస్యాలను కూడా తమ విద్యార్థులకు వివరిస్తుండడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి చెప్పే స్థాయిలో అవగాహన కలిగి ఉంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులోని విజయ నగేష్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన సంక్రాంతి సంబరాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కంప్యూటర్ యుగంలో వేగవంతమైన జీవనాల నేపధ్యంలో కూడా సంప్రదాయాలను కొనసాగించడంలో వివిధ వర్గాలు చేస్తున్న కృషి సమాజంలో ఎప్పటికప్పుడు పునరుత్తేజాన్ని నింపుతోందన్న ఆలోచన వెయ్యి ఏనుగుల బలాన్నిస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement