
రాజపూజ్యమింత, అవమానమింత అని పంచాంగం మాత్రమే చెప్పదు. మన ఇంటి బడ్జెట్ కూడా చెబుతుంది. మిగులుతున్నది ఎంతో చూసుకోకుండా ఖర్చు చేసుకుంటూ పోతే.. అవమానం! మిగుల్చుకున్నాకే ఖర్చులకు పోతే.. రాజపూజ్యం! రాబడి ఎంతని కాదు.. పోబడి ఎంతుందనే దాన్ని బట్టే మనం ధనవంతులం.. ఘనవంతులం. ఈ రోజు కేంద్రం బడ్జెట్ సమర్పిస్తోంది. ఆ బడ్జెట్ ఎలా ఉన్నా... మన లెక్కల్ని మనం తప్పకుండా ఉంటే.. ఇంట్లో అక్షయపాత్ర ఉన్నట్లే. చేతుల నిండా ధనరేఖలు ఉన్నట్లే.
ఇంటి ఖర్చు తగ్గితే రూపాయి విలువ పెరుగుతుంది
చేతిలో డబ్బు ఉంది కదా అని ఒక వస్తువును అవసరం లేకపోయినా కొంటే మన చేతిలో ఉన్న ‘రూపాయి’ విలువను పరిరక్షించడం మనకు చేతకాలేదని అర్థం.
‘‘ఒక కుటుంబం సంతోషంగా జీవనం సాగించాలంటే... ఖర్చులకు తగినంత రాబడి ఎంత ముఖ్యమో, రాబడిని బట్టి నెల వారీ బడ్జెట్ వేసుకోవడం కూడా అంతే ముఖ్యం’’ అంటారు అర్పిత. ‘‘గత ఏడాది మీ బడ్జెట్ ఎలా ఉంది, మీ బడ్జెట్ మీకు నేర్పిన పాఠాలేమిటి?’’ అని ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ‘‘రాబడి – ఖర్చు’ ల మధ్య సమన్వయం కోసం కొంత ఎక్సర్‌సైజ్ తప్పదు. ‘మనకు వచ్చే డబ్బు– మన అవసరాల జాబితా’ను సరిపోల్చుకోవాలి. నిత్యావసరాలు, పెద్దవాళ్ల ఆరోగ్యం కోసం రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, మందుల కోసం కొంత కేటాయించాలి.
పిల్లల చదువు, మిగిలిన అవసరాల కోసం కేటాయింపు తప్పని సరి. భవిష్యత్తు భద్రత కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసి తీరాలి. ఇక మిగిలిన డబ్బులో నుంచి సినిమాలు, వెకేషన్‌లు, ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్, వాహనాల వంటివి వచ్చి చేరుతుంటాయి. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటినప్పుడు ఆ మేరకు ఖర్చు తగ్గించుకోవడానికి మధ్య తరగతి కుటుంబాల్లో సినిమానో, వెకేషన్‌నో మానుకోవాల్సి వస్తుంటుంది. ఆరోగ్య సమస్యల కారణంగా ఊహించని ఖర్చు వచ్చినప్పుడు కూడా కొన్ని సరదాలకు చెక్ పెట్టుకోవాల్సి రావచ్చు.
ఏది అవసరం?
అవసరాలను అదుపులో పెట్టలేం కానీ, సరదాలను అదుపులో పెట్టుకోవచ్చు. టీవీ ఉండాలనుకోవడం అత్యాశ కాదు. మరెవరింట్లోనో ఉన్నట్లు లక్షల విలువ చేసే టీవీ కొనాలనుకోవడమే పొరపాటు. రోజువారీ రాకపోకల కోసం వాహనం ఉండి తీరాల్సిందే, కానీ కొత్త మోడల్ వచ్చిన వెంటనే బైక్‌లు, కారులు మారుస్తూ పోతే.. ఇక ఆ దుబారాకు అంతూదరీ ఉండదు. ఇప్పుడు తరచు స్మార్ట్ ఫోన్‌లను మార్చడం ఫ్యాషనైంది. మా ఇంట్లో ఇంటికి అవసరమైన ఫర్నిచర్, గృహోపకరణాలన్నీ ఉన్నాయి. అయితే కొత్త మోడల్ కోసం ఉన్న వాటిని మార్చడం ఇంత వరకు జరగలేదు.
ఇంటి ఇండెక్స్
మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ ఒక విలువ ఉంటుంది. అది మార్కెట్ నిర్ణయించిన విలువ కాదు, మనం ఖర్చు పెట్టే తీరును బట్టి ఆ రూపాయి విలువ పెరుగుతుంది. ‘ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్’ అనేది ఎంత నిజమో, ఒక ఇంటిని చూస్తే ఆ ఇంటి వాళ్లు బడ్జెట్ విషయంలో తెలివిగా ఉన్నారా, డబ్బు దుబారా చేస్తున్నారా అనేది ఇట్టే తెలిసిపోతుంది’’ అన్నారు అర్పిత. – వాకా మంజులారెడ్డి
ఆర్థిక నిపుణులు ఆడవాళ్లే
నిజానికి ఇంటి బడ్జెట్ విషయంలో ఆడవాళ్లను మించిన ఆర్థిక నిపుణులు మరొకరు ఉండరు. వంద రూపాయలు చేతిలో పట్టుకుని వెళ్లి సంచి నిండా కూరగాయలు తీసుకురాగలిగిన నేర్పు మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువ. ధరల పట్టిక చూసిన తర్వాత ఒక్క నిమిషంలో ‘ఏ కూరగాయలను మితంగా తీసుకోవాలి, ఏ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి’ అనే నిర్ణయానికి వచ్చేస్తారు. – కె. అర్పిత, హైదరాబాద్
జాగ్రత్తగా ఉండడమే మా ప్లాన్
పేరెంట్స్ హెల్త్, వాళ్ల అవసరాలు, మా అబ్బాయి చదువు. ఇంటి ఖర్చులు అన్ని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేసుకుంటాం. డబ్బు విలువ తెలిసివాళ్లెవరూ అనవసరమైన ఖర్చులు చెయ్యరు.
జాగ్రత్తగా ఉండడమే మా ప్లాన్ అంటాడు వెంకటరమణ మోదుపల్లి. అనంతపురానికి చెందిన అతను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. భార్య స్వాతి. ఎమ్‌టెక్ చేసింది కాని గృహిణిగానే ఉంటోంది. వాళ్లకు ఒక బాబు జయంత్. నర్సరీ చదువుతున్నాడు. వెంకటరమణ ఒక్కడే కొడుకు కావడం వల్ల తల్లిదండ్రులకూ అతనే ఆధారం. ‘అందుకే ఖర్చుల విషయంలో ఆచితూచే ఉంటాం. పేరెంట్స్ హెల్త్, వాళ్ల అవసరాలు, మా అబ్బాయి చదువు. ఇంటి ఖర్చులు అన్ని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేసుకుంటాం నేను, మా వైఫ్. ఇంటి పనంతా తనే చూసుకుంటుంది. మాకు హెల్త్ కాన్షస్ కాస్త ఎక్కువే.\
కాబట్టి బయట లంచ్, డిన్నర్లకు వెళ్లడం తక్కువే. ఏదైనా ఇంట్లోనే. ఎలక్ట్రానిక్ గూడ్స్, గాడ్జెట్స్ మీద కూడా అంతగా ఖర్చు పెట్టం. స్మార్ట్ ఫోన్స్‌కూడా హై ఎండ్‌వి వాడం. షాపింగ్ వగైరా కూడా పండగలు, పుట్టినరోజులకే. ఇల్లు రెంట్, గ్రాసరీస్, పిల్లాడి స్కూల్ ఫీ, ఇతర ఖర్చులు పోను అమ్మానాన్న హెల్త్ కోసం కొంత, అనవసరమైన ఖర్చులు ఏమైనా వస్తే కొంత అని పక్కన పెట్టుకుంటాం. ఇది కాక ప్రతినెల పదివేలు సేవింగ్ చేస్తాం. డబ్బు విలువ తెలిసిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి.. అత్యంత అవసరమైతే తప్ప ఖర్చు చేయను’ అని తన ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పుకొచ్చాడు వెంకట రమణ.
లోటుంటే తగ్గిస్తాం.. మిగులు అయితే ఖర్చు చేస్తాం..
‘మా పెళ్లయి ఇంకా ఏడాది కాలేదు. కాబట్టి ఖర్చులు, సేవింగ్స్‌కు సంబంధించి మాకు సీరియస్ ప్లాన్స్ అంటూ ఏమీ లేవు.. ఈ వన్ ఇయర్.. ఫుల్ టూ ఫన్ అండ్ బిందాస్ అనే అనుకుంటున్నాం’ అంటారు బి. ప్రవీణ్ కుమార్, సౌమిత దంపతులు. వీళ్ల స్వస్థలం వైఎస్సార్ కడపజిల్లా, జమ్మలమడుగు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రవీణ్ కుమార్ స్పైస్‌జెట్‌లో కెప్టెన్. గణిత శాస్త్రంలో మాస్టర్స్ చదివిన సౌమిత బిజినెస్ చేయాలనే ఆలోచనతో ఉంది.
ప్రస్తుతమైతే గృహిణిగా ఇంటిని నిర్వహిస్తోంది. ‘ఇంటి ఖర్చులు తనే చూసుకుంటుంది. నా శాలరీ నుంచి నెలకు ఇంత అని సౌమితకు ఇచ్చేస్తాను. మిగతా అంతా నా దగ్గరే పెట్టుకుంటా. పర్సనల్ లోన్, కారు లోన్‌కు సంబంధించి రెండు ఈఎమ్‌ఐలు కడ్తాను. పెళ్లికి ముందు మా పేరెంట్స్‌కి డబ్బు పంపేవాడిని కాని ఇప్పుడు కుదరట్లేదు. నెలకు ఇరవై నుంచి ముప్పై శాతం సేవింగ్స్ ఉంటాయి. మిగతా అంతా ఖర్చులే. ఇన్సూరెన్స్ చేశాం ఇద్దరం విడివిడిగా’ అంటాడు ప్రణీత్ కుమార్.
ఖర్చులు అంటే?
‘ఉండేది ఇద్దరమే అయినా త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం. ఇన్‌లాస్, చుట్టాలు వస్తే ఇబ్బంది పడకుండా. ఇల్లు ఊడ్వడానికి, తుడవడానికి పనమ్మాయి. ఇంట్లో సరుకులు అంటే బియ్యం, కారప్పొడి, చింతపండు, పసుపు లాంటివన్నీ ఊరినుంచే వస్తాయి. కాబట్టి వెచ్చాలకు అంతగా ఖర్చు ఉండదు. వారానికి రెండుసార్లు రెస్టారెంట్స్‌కి వెళ్తాం. నెలకు ఒకటి రెండుస్లారు పార్టీలూ ఉంటాయి. ఒకసారి ఫ్రెండ్స్ ఇస్తే ఇంకోసారి మేమిస్తాం’ అని ప్రణీత్ భార్య సౌమిత చెప్తూంటే మధ్యలో ప్రణీత్ అందుకొని ‘వారానికి రెండు మూడు సినిమాలూ ఉంటాయి కచ్చితంగా. రిలీజ్ అయిన సినిమా చూడాలి కదా’ అన్నాడు. ‘ఇవికాక షాపింగ్ ఖర్చులు అదనం’ కంటిన్యూ చేశాడు. ‘షాపింగ్ తను ఖర్చు చేసేదే ఎక్కువ బ్రాండెడ్ బట్టల మీద. నెలకు ఒక్కసారైనా బట్టలు కొంటారు. నాది బట్టల ఖర్చు తక్కువనే చెప్పొచ్చు. ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో కాస్మెటిక్స్, ఆర్ట్‌ఫిషియల్ జ్యుయెలరీ కొంటా అంతే’ చెప్పింది సౌమిత.
గాడ్జెట్స్ వగైరా...
‘లేదు. ఒక్కసారి కొంటే అంతే. వాటి అంత మోజు లేదు. కాని టూర్స్ మీద ఖర్చు చేస్తాం. నిజానికి పెళ్లయ్యాక ఒక వన్ ఇయర్ వరకు సేవింగ్స్ జోలికి వెళ్లకుండా లైఫ్ ఎంజాయ్ చేద్దామనుకున్నాం. అలాగే చేస్తున్నాం కూడా. అందుకే మూడు నెలలకు ఒకసారి దేశంలో నచ్చిన ప్లేసెస్‌కి వెళ్లాలని.. ఆర్నెల్లకు ఒకసారి ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని అనుకున్నాం. అలాగే వెళ్తున్నాం. మొన్ననే మాల్దీవులకు వెళ్లొచ్చాం. నెక్ట్స్ ఇయర్ ప్రమోషన్ ఉంది. అప్పుడు ఇల్లు, పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం’ అంటూ తన ప్రెజెంట్ బడ్జెట్, ఫ్యూచర్ ప్లాన్ చెప్పాడు ప్రణీత్.
నెలాఖరుకి లోటు తేలుతుందా.. మిగులు కనపడుతుందా?
‘ఒక్కో నెల ఒక్కో రకంగా ఉంటుంది. లోటు తేలగానే వచ్చే నెల ఖర్చులను కొంచెం తగ్గిస్తాం. మిగులు కనపడితే.. కొత్త ఖర్చుని ప్లాన్ చేసుకుంటాం’ అంటారు నవ్వుతూ ప్రణీత్ అండ్ సౌమిత.
సినిమాలూ తగ్గించాం
‘‘బయటి నుంచి తెప్పించుకునే ఆహారపదార్థాలు, సినిమాలకు కూడా కొంత పరిమితి పెట్టుకున్నాం. అందువల్లే పెరిగిన ఖర్చులను తట్టుకోగలుగుతున్నాం. పిల్లల చదువుకోసం వికారాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి, సుమతి దంపతులను తమ బడ్జెట్ ప్లానింగ్ గురించి అడిగితే ‘‘ఖర్చులు తగ్గించుకోవడమే ప్రధానంగా పెట్టుకున్నాం. పొదుపు విషయంలో కచ్చితంగా ఉన్నాం’’ అని చెప్పారు. ‘‘మా అమ్మాయి ఇంంజనీరింగ్ ఫస్టియర్, అబ్బాయి ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్నారు.
మూణ్ణెల్ల క్రితం వరకు పిల్లలను హాస్టల్‌లో పెట్టి చదివించేవాళ్లం. తర్వాత హైదరాబాద్ వచ్చి ఇల్లు అద్దెకు తీసుకున్నాం. మాది వ్యవసాయ కుటుంబం. వరి, పత్తి, మొక్కజొన్న పండిస్తాం. ఊళ్లో ఉన్నప్పుడు నెలసరి ఇంటి ఖర్చు ఐదారువేలతో సరిపోయేది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇరవై వేలకు పైనే అవుతోంది. పంట వల్ల వచ్చే ఆదాయం సరిపోదని బోర్‌వెల్ వ్యాపారం చేస్తున్నాను. అంటే, ఖర్చు పెరుగుతోందని అర్ధమయ్యాక ఇతరత్రా రాబడి మార్గాలు చూసుకోవాల్సిన ఆవశ్యకతపైనా దృష్టిపెట్టాలి’’ అన్నారు శ్రీనివాసరెడ్డి.
ఇన్సూరెన్స్ తప్పనిసరి
‘‘పిల్లల చదువులు, ఇతర ఖర్చులు ఉన్నప్పటికీ సంవత్సరానికి ఇంత అని కొంత మొత్తాన్ని పొదుపు చేస్తాను. ఏ కారణంగానైనా పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతే వాళ్ల భవిష్యత్తు దెబ్బతింటుంది. అందుకని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాను. వాటిల్లో మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. పోస్టల్ శాఖలోనూ చిన్నమొత్తమైనా నెలకు కొంత అని రికరింగ్ డిపాజిట్ చేస్తుంటాను’’ అన్నారు ఆయన. ‘‘పిల్లలు స్థిరపడేంతవరకు లగ్జరీ వస్తువులేవీ కొనడానికి వీల్లేదని ముందే నియమం పెట్టుకున్నాం..’’ అంటూ గృహిణిగా తన బాధ్యతను వివరించింది సుమతి. ‘‘బయటి నుంచి తెప్పించుకునే ఆహారపదార్థాలు, సినిమాలకు కూడా కొంత పరిమితి పెట్టుకున్నాం. అందువల్లే పెరిగిన ఖర్చులను తట్టుకోగలుగుతున్నాం. కుటుంబం ఒడిదొడుకులకు లోనుకాకుండా ఉండాలంటే ఇంటి యజమానే కాదు ఆ ఇంట్లో అందరి సహకారం అవసరం. అందరూ ఒక్కమాట మీద ఉంటే మన రాబడి ఎంత, ఖర్చు ఎంత, మిగులు ఎంత అనే విషయాల్లోనూ ఒక అవగాహన వస్తుంది. అది ఈ రోజుల్లో చాలా అవసరం కూడా. పెరుగుతున్న పిల్లలకు ఈ విషయాలు తెలియజేస్తే భవిష్యత్తు పట్ల వారికీ ఒక అవగాహన ఉంటుంది. బాధ్యతగా నడుచుకుంటారు’ అని వివరించారు శ్రీనివాస్‌రెడ్డి, సుమతి దంపతులు. – నిర్మలారెడ్డి
ఆర్భాటాలకు పోము
పులిని చూసి నక్క వాత పెట్టుకుందేమో కాని, మేం ఆ పని చేయట్లేదు. అసలు ఇరుగుపొరుగులను పట్టించుకునే తీరికే ఉండదు. ఉరుకుల పరుగుల జీవితం.
‘‘ఇంటి అద్దె కోసం ఏడు వేలు, ఇద్దరి దారి ఖర్చుల కోసం మూడు వేలు, సరుకుల కోసం నాలుగు వేలు, పిల్లల జీతాల కోసం మూడు వేలు తప్పనిసరిగా పక్కన ఉంచాల్సిందే. ఉల్లిపాయల రేటు పెరిగినప్పుడు, వాటిని మాడటం మానేశాం. నిత్యావసర సరుకులు పెరగటంతో ఒక రకమే వండుకోవటం ద్వారా ఎకౌంట్ బ్యాలెన్స్ చేసుకున్నాం’’.– శివాజి, ఆడిటర్, శ్రీహర్ష, స్టాఫ్ నర్స్ విజయవాడ