ఈ ‘శ్రీపొన్నాడ’ని అమెరికా పొమ్మంటోంది! | Sakshi
Sakshi News home page

పొమ్మంటున్న ‘అమ్మ’రికా

Published Wed, Jul 18 2018 12:12 AM

Specila story to amrecia visa problem - Sakshi

అన్నింటికంటే పెద్ద కష్టం ఏమిటంటే నిలబడటానికి గుప్పెడంత నేల లేకపోవడం.చెప్పుకోవడానికి ఒక దేశం లేకపోవడం. ఎప్పుడో మూడేళ్ల వయస్సులో అమ్మానాన్నతో పాటు అమెరికా వెళ్లిన ఆ 21 ఏళ్ల  సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు అలాంటి కష్టమే వచ్చింది. తనిప్పుడు దారీ తెన్నూ లేని కూడలిలో ఉంది. ఎటు వెళ్లాలో పాలుపోని స్థితి. 

అమెరికాలో డాక్టర్‌గా పని చేయడానికి వచ్చిన తల్లితోపాటు ఆమె వేలుపట్టుకొని అమెరికా వచ్చిన ‘శ్రీపొన్నాడ’ని అమెరికా ఇప్పుడు పొమ్మంటోంది. 20 ఏళ్ల పాటు అమెరికానే తన దేశమనుకొని పెరిగిన ఆ అమ్మాయి, అక్కడే ఆడుతూ పాడుతూ తనదైన బుల్లి ప్రపంచాన్ని కలగన్న ఆ అమ్మాయి ఇలాంటి రోజొకటొస్తుందని, దానిని ఎదుర్కొనాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ట్రంపే కారణం డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం విధించిన కఠినతరమైన వీసా నిబంధనలు శ్రీ పొన్నాడ కలల ప్రపంచాన్ని ఛిద్రం చేశాయి. ‘నాకు అమెరికా తప్ప వేరే ప్రపంచం తెలియదు. నాకు 21 ఏళ్లు వచ్చేశాయని, ఇకపై నేను డిపెండెంట్‌ వీసాతో అమెరికాలో ఉండరాదని ఇక్కడి నుంచి నన్ను గెంటేస్తోంటే  నేనెక్కడికెళ్లాలి’ అని ఆమె అమెరికా న్యాయవ్యవస్థని ప్రశ్నిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అదే ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన భారతీయుల పిల్లల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తోన్న వ్యవస్థకి అద్దంపడుతోంది.

శ్రీ పొన్నాడ పోస్ట్‌ సారాంశం 
‘‘నా మూడేళ్ల వయస్సులోనే అమ్మతో కలిసి నా పుట్టినిల్లు భారత్‌ను వదిలిపెట్టాను. మొదట జమైకా లో ఉన్నాను. అమ్మ న్యూయార్క్‌లో ఉండగా నాకు 14 ఏళ్ల వయస్సున్నప్పుడు జమైకా నుంచి నా తమ్ముడు శ్యాంతో సహా అమెరికాలో అడుగుపెట్టాను. 2008 నుంచి అమ్మ న్యూయార్క్‌లోని మేయో క్లినిక్‌లో కార్డియాలజీలో పరిశోధన చేస్తుండేది. అక్కడికెవ్వరూ వెళ్లరునా హైస్కూల్‌ చదువు పూర్తయ్యేసరికి వైద్యుల అవసరం ఎక్కువగా ఉన్న  మిడ్‌ వెస్ట్‌లోని అయోవా పట్టణంలో అమ్మకి ఫిజీషియన్‌గా ఉద్యోగం వచ్చింది. న్యూయార్క్‌ను విడిచిపెట్టి మిడ్‌ వెస్ట్‌కు వెళ్లడానికి చాలామంది ఇష్టపడరు. కానీ వైద్యం అవసరమున్న ఆ చోటికి మా కుటుంబమంతా పయనమైంది. నేనూ అయోవా యూనివర్సిటీలో చేరిపోయాను.  

అందరం కలిసిపోయాం
అయోవా డైలీకి ఆర్టికల్స్‌ రాయడం, అక్కడి పిల్లలకి ఉచితంగా ట్యూషన్స్‌ చెప్పడం, కంప్యూటర్‌ సైన్స్‌లో ఉచితంగా శిక్షణనివ్వడం నా దినచర్యలో భాగమైంది. వీకెండ్స్‌లో ఆడపిల్లలకోసం ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాలూ నన్నెంతో సజీవంగా ఉంచాయి. అలాగే వుమన్స్‌ రీసోర్స్‌ అండ్‌ యాక్షన్‌ సెంటర్‌లో సైతం స్వచ్ఛందంగా పనిచేయడం ప్రారంభించాను.  ‘ఇన్‌ఫార్మాటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ క్లబ్‌’కి అధ్యక్షురాలిగా ఉన్నాను. అప్పటి వరకూ అన్నిరకాలుగా వెనుకబడి ఉన్న అయోవా వాసులను ఐటీ ఉద్యోగాల్లోకి తీసుకునేవారు కాదు. అలాంటి అయోవా నుంచి సైతం అనేక మందిని ఐటీ కంపెనీల్లోకి ప్రవేశించేలా ప్రయత్నం చేశాం. ఇంత చేస్తూ కూడా నాకెప్పుడూ ఒకటే ఆందోళన. నాకూ నా కుటుంబ సభ్యులకూ గ్రీన్‌కార్డ్‌ వస్తుందా లేదా అనే ఒత్తిడితోనే నా జీవితమంతా గడిపాను.

సమయం తరుముకొస్తోంది
ఏ వనరులూ, సదుపాయాలూ అందుబాటులో లేని అయోవా ప్రజల ఆరోగ్యం కోసం అమ్మ చేసిన సేవకు గాను గుర్తింపుగా జాతీయ ప్రయోజనాల రీత్యా ఆమెకు గ్రీన్‌కార్డ్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆమె దాని కోసం ఇంకా ఎన్నేళ్లు ఎదురుచూడాలో కూడా తెలియదు. అయితే నాకు వచ్చే యేడాదికి.. అంటే 2019లో 21 ఏళ్లు నిండుతున్న కారణంగా అందర్నీ వదిలి అక్కడి నుంచి వెళ్లిపోక తప్పని పరిస్థితి ఎదురయ్యింది. ఎటు వెళ్లాలో తెలియని అంధకారంలో పడ్డాను. నా తమ్ముడికి కూడా అమెరికా నుంచి వెళ్లిపోక తప్పని రోజు కాచుకొని ఉంది. నా తమ్ముడు శ్యాం అయోవా యూనివర్సిటీలో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదువుతున్నాడు. మరో రెండేళ్లలో తను కూడా తన స్టేటస్‌ని కోల్పోతాడు. నేను  డిపెండెంట్‌ చిల్డ్రన్స్‌ వీసాతో చట్టబద్ధంగానే అమెరికాలో అడుగుపెట్టినా ఎందరో భారతీయులకు ఎదురైన దయనీయమైన పరిస్థితే నాకూ ఎదురైంది. అటు అమెరికాతో కాక, ఇటు ఇండియాతో ఎటువంటి అనుబంధమూ లేక, పద్నాలుగేళ్ల వయస్సులో వదిలొచ్చిన జమైకాతో ఏ బంధమూ మిగలక ఇప్పుడేం కావాలో తెలియక ఇలా మిగిలాను.

ఇంకా ఎందరో ‘శ్రీ’లు
మరో ఆరు నెలల్లో ఇక్కడి నుంచి బలవంతంగా నన్ను బయటకు గెంటేస్తున్నారు. ఎక్కడైతే నేను బుడి బుడి నడకలతో బడికెళ్లానో, ఎక్కడైతే యూనివర్సిటీ పట్టా పుచ్చుకున్నానో, ఎక్కడైతే సమాజసేవా లక్ష్యంతో పనిచేశానో అక్కడి నుంచి సుదూరంగా వెళ్లడానికి వీసా నిబంధనల భూతం నన్ను తరుముకొస్తోంది. ఒక్క నన్నే కాదు. ఇంకా ఎందరో శ్రీలను కూడా’’ అంటోంది శ్రీ పొన్నాడ. చట్టబద్ధంగా అమెరికాలోకి అడుగుపెట్టిన తనలాంటి, తన తమ్ముడిలాంటి పిల్లలకు అండగా ఉండేలా ఒక చట్టం తేవాలని పొన్నాడ కోరుతోంది. ఉద్యోగాధారిత గ్రీన్‌కార్డ్‌ కేటగిరీలో సంస్కరణ గాలిలో దీపంలా ఉన్న తమలాంటి వారి పరిస్థితిలో మార్పుతెస్తుందని ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. గతంలో చట్టం ఎప్పుడూ పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తోంది. ప్లీజ్‌ హెల్ప్‌... వు నీడ్‌ యువర్‌ సపోర్ట్‌ అంటూ శ్రీ పెట్టిన పోస్ట్‌ అందర్నీ కలవరపెడుతోంది. 
– అరుణ

Advertisement
 
Advertisement
 
Advertisement