రైతన్నలకు భరోసా.. శీతల గిడ్డంగుల హామీ

special story on ysrcp rythu bharosa - Sakshi

చల్లని మాట

ముని నాయుడుది చిత్తూరు జిల్లా నగరి. మామిడి రైతు. తోతాపురి రకాన్ని పండిస్తారు. దిగుబడి బాగా వచ్చింది. అయితే, ధర మరీ తగ్గిపోయింది. ధర వచ్చే వరకు పంటను అమ్మకుండా ఉందామంటే శీతల గిడ్డంగి లేదు. కాబట్టి చెప్పిన ధరకు అమ్ముకోక తప్పని దుస్థితి రైతులది. ఆ జిల్లాలో ఎక్కువగా పండే తోతాపురి మామిడి రకం జ్యూస్‌కి పనికి వస్తుంది. మార్కెట్‌లో ధర లేదన్న సాకుతో రైతుల నుంచి చౌకగా కొనడం ప్రారంభించాయి పల్ప్‌ కంపెనీలు. పెద్ద కంపెనీలకు సరుకు నిల్వ చేసే శీతల గిడ్డంగుల సౌకర్యం ఉంటుంది. రైతులకు ఈ సదుపాయం లేకపోవడాన్ని ఆసరా చేసుకుని కంపెనీలు దోపిడికి పాల్పడుతున్నాయి..

ఇలా ఒకటి, రెండు పంటల విషయంలోనే కాదు. కూరగాయల మొదలు వివిధ రకాల ఉద్యాన పంటల మార్కెటింగ్‌ పరిస్థితీ ఇదే. టమాటా బయటి మార్కెట్‌లో కిలో రూ. 15 – 20 అమ్ముతున్నా రైతులకు మాత్రం కిలోకి ఒకటి రెండు రూపాయలు కూడా దక్కడం లేదు. ఉల్లి రైతులదీ అదే పరిస్థితి. రైతులు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించే తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే సౌకర్యం లేకపోవడమే ఇందుకు కారణం. అదే ప్రభుత్వమే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తేనో, రైతులే సొంతంగా కట్టుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తేనో అన్నదాతలు దుర్భర స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు.
ఆహార శుద్ధి రంగంలో అగ్రగామిగా ఉండాలంటే వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించాలి. అప్పుడే రైతన్నలకు గిట్టుబాటు లభిస్తుంది. మార్కెట్‌లో జరిగే దోపిడీని అరికట్టడానికి వీలవుతుంది. ఇన్ని ప్రయోజనాలు చేకూరాలంటే రైతులకు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే శీతల గిడ్డంగి సౌకర్యం ఉండాలి. ఎప్పుడు ధర వస్తే అప్పటిదాకా నిల్వ చేసే పరిస్థితి ఉంటే రైతులకు మేలు జరుగుతుంది.

పరిశోధనా కేంద్రాలు సరే...
దేశంలో అత్యధిక ఆహార ఉత్పత్తి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఆహార శుద్ధి పరిశ్రమలకు అనువైన ముడిపదార్థాలు పెద్ద ఎత్తున దొరికే రాష్ట్రాలలో ఏపీ ఒకటి.  రాష్ట్రంలో 5 వ్యవసాయానుకూల జోన్లు, 58 వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, మూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పెద్దఎత్తున జరుగుతున్న పట్టణీకరణ, రోజురోజుకు మారుతున్న జీవన స్థితిగతుల నేపథ్యంలో ఆహార శుద్ధి రంగం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దీనికితోడు 980 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ సొంతం. ఇన్ని వనరులు ఉన్నా రైతులు మాత్రం ఏటా కొన్ని కోట్ల రూపాయల ఉత్పత్తులను నేల పాలు చేయాల్సి వస్తోంది. పరిశోధన ఫలితాలు రైతులకు చేరకపోవడం, ఆహార శుద్ధి పరిశ్రమలు లేకపోవడం, కోల్డ్‌ స్టోరేజీలు, గిడ్డంగులు లేకపోవడమే ప్రధాన కారణం.

ఇవే ఉంటే.. రైతులకు అదనపు ఆదాయం కోసం వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులు చెడిపోకుండా తాజాగా వినియోగించుకోవచ్చు. ధర లేని పరిస్థితులలో రైతులు తమ ఉత్పత్తులను వీటిల్లో నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఆహార శుద్ధి పరిశ్రమలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం కోసం, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ఇవి ఉపయోగపడతాయి.

ప్రకటనలు సరే.. ఫుడ్‌ పార్కులు ఏవీ?
ప్రతి జిల్లాకు ఫుడ్‌ పార్క్‌లు, ఆహార శుద్ధి రంగ పరిశ్రమలు, శీతల గిడ్డంగులంటూ చంద్రబాబు పాట పాడడం మొదలు పెట్టి ఐదేళ్లు దాటింది. అదిగో సమీకృత ఫుడ్‌ పార్క్‌... ఇదిగో మెగా ఫుడ్‌ పార్క్‌... అల్లదిగో అల్ట్రా మెగా ఫుడ్‌ పార్క్‌... అంటూ ఊదరగొడుతున్నారే తప్ప ఆచరణ మాత్రం అందనంత దూరంలో ఉంది. ఒకటీ రెండు వచ్చినా సామాన్యులకు వాటిల్లో స్థానం లేకుండా పోయింది. ఇక కోల్డ్‌స్టోరేజీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

స్వాతంత్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న కోల్డ్‌ స్టోరేజీల సంఖ్య 456కి మించలేదు. వీటిల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో మాత్రమే 176 ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో వీటి సంఖ్య 47 దాటలేదంటే మిగతా చోట్ల పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం 85 లక్షల మందికి పైగా రైతులు ఉంటే– వీటిని ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య నాలుగైదు లక్షలకు మించడం లేదు. నిల్వ సౌకర్యం లేక కూరగాయలు, పూలు, పండ్లు, మత్స్య సంపద వృథా అవుతోంది.

జగన్‌ హామీ ఇలా...
ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రకటించారు. వాటిల్లో ఒకటి వైఎస్సార్‌ రైతు భరోసా. ఈ పథకంలో భాగంగా కోల్డ్‌స్టోరేజీ ప్లాంట్లు, గిడ్డంగులు, నియోజకవర్గాల స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు వంటివన్నీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించి కోల్డ్‌ స్టోరేజీలు, గిడ్డంగులు నిర్మించుకునే వెసులు బాటు కల్పిస్తానని వాగ్దానం చేశారు. రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకునేలా మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తానన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటయితే రైతులు వలస పోవాల్సిన దుస్థితి ఉండదు. మామిడి, టమాటా, ఉల్లి వంటి పచ్చి సరకును రోడ్ల పాల్జేసి ట్రాక్టర్లతో తొక్కించాల్సిన అవసరం రాదు. శీతల గిడ్డంగులు వస్తే ధర లేనప్పుడు ఉద్యాన ఉత్పత్తుల్ని రైతులు నిల్వ చేసుకుని సరైన ధరకు అమ్ముకునే వెసులు బాటు ఉంటుంది.

– ఆకుల అమరయ్య, చీఫ్‌ రిపోర్టర్, సాక్షి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top