పాటే మంత్రము

Special story to national singer Benji - Sakshi

సా.. రి.. గ.. మా.. మా.. మా.. మా..మా.. మా.. మాటలు సరిగా రాని..నోరు అసలే తిరగని.. బెంజీకిఅమ్మే.. పాటలు నేర్పించింది. బెంజీ ‘ఆటిజం’ అమ్మాయి.  డాక్టర్లు పెదవి విరిచారు. థెరపిస్టులు ‘అబ్బే’ అనేశారు. కానీ, తల్లి వదిలిపెడుతుందా!!కూతురు.. పాటకు రెస్పాండ్‌ అవుతోందని గ్రహించి..పాటతో మంత్రం వేసింది. నేషనల్‌ లెవల్‌ సింగర్‌గా మార్చింది!  ఇది బెంజీ సక్సెస్‌ స్టోరీ మాత్రమే కాదు. తల్లి కవిత స్ట్రగుల్‌ స్టోరీ కూడా!

కూతురికి ఆటిజమ్‌ అని తెలిసి కవిత, కుమార్‌ దంపతులు కుంగిపోయారు! అంతలోనే కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ చిన్నారిని ఎలాగైనా తీర్చిదిద్దాలని సంకల్పం పెట్టుకున్నారు. కానీ ఎలా?!
కవిత, కుమార్‌లది ఢిల్లీ. వీరికి 1992లో పాప పుట్టింది. బెంజీ అని పేరు పెట్టుకున్నారు. పాపాయిని చూసి పరవశించి పోయారు. అయితే ఆ సంతోషం ఎంతోకాలం మిగల్లేదు. పాప వయసు నెల రోజులుగా ఉన్నప్పుడు మెదడువాపు వ్యాధి రావడంతో, మందులు వాడారు. అవి వికటించి పాపకు ఆటిజమ్‌ వచ్చింది. అప్పటికి ఆటిజమ్‌ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కాని కవిత బాగా చదువుకోవడంతో విషయం తెలుసుకున్నారు. 

టేప్‌ రికార్డర్‌ వైపే చూపు!
బెంజీలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించడం ప్రారంభించారు కవిత. పాప కళ్లు వేటిని వెతుకుతున్నాయో, పాప చూపు వేటి దగ్గర ఆగుతోందో నిశితంగా పరిశీలించారు. పాప నిరంతరం టేప్‌ రికార్డర్‌ వైపు చూడటం గమనించారు. పాప సంగీతం ఇష్టపడుతుందేమోనని భావించారు కవిత. పాపకు ఆరు సంవత్సరాలు నిండాయి. ఆ ఆరు సంవత్సరాలుగా »ñ ంజీ.. టేప్‌ రికార్డరును చూస్తూనే ఉంది. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి టేప్‌ రికార్డరును మారుస్తుంటే కూడా దాని వైపే తదేకంగా చూసేది. అసలు కంటిని నిలపలేని స్థితిలో ఉన్న బెంజీ టేప్‌ రికార్డరుని మాత్రం తదేక దీక్షతో చూడటం కవితకు ఆశ్చర్యం కలిగించింది.  

దివ్యౌషధంగా మ్యూజిక్‌  
‘‘ఎక్కడ ఆడుతున్నా అక్కడకు వచ్చేసి పాటలు వినేది, స్తబ్దుగా జడ పదార్థంలా అచేతనంగా ఉండే మా చిన్నారి.. పాటలకు స్పందించడం నాకు ఆనందం కలిగించింది. పాపకు టేప్‌ రికార్డరుతో వైద్యం చేయాలని నిశ్చయించుకున్నాను. పాప ఎక్కడ ఉంటే అక్కడ టేప్‌ రికార్డరు ప్లే చేయడం ప్రారంభించాను’’ అన్నారు కవిత. అలా పాపకు అన్నం తినిపించడం, స్నానం చేయించడం, నిద్రపుచ్చడం.. అన్ని పనులకూ కవిత టేప్‌ రికార్డరు దివ్య సంజీవనిలా ఉపయోగించారు. పాపలో ఎక్కడ నిద్రాణంగా ఉన్న చేతనం, టేప్‌ రికార్డరు కనిపించగానే మేల్కొనేది. ‘‘ఒక తల్లిగా నేను ఈ పరిణామానికి ఎంతో సంబరపడ్డాను. సంగీతానికి రాళ్లను సైతం కరిగించే శక్తి ఉందని విన్నాను. నేను సంగీతం నేర్చుకున్నాను. కనుక పాపలో చైతన్యం కలిగించడం కోసం నేనే ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నాను’’ అని చెప్పారు కవిత. బెంజీకి బాల్యం నుంచే ఆమె మ్యూజిక్‌ థెరపీ ప్రారంభించారు . హిందీ పాటలు వినిపించారు. ఆ.. సరిగమలే బెంజీ కూతురు జీవితాన్ని మార్చేశాయి. 

ఏడేళ్లకే రాగాల పరిచయం
‘‘రాగయుక్తంగా పాట పాడుతుంటే బెంజీ నిద్ర లేచి, ఆ రోజంతా అల్లరి చేయకుండా, సంతోషంగా ఉండటం గమనించాను. సంగీతం లేకుండా నిద్ర లేచిన రోజు మాత్రం చిరాకు పడుతుండేది. ఈ విషయం ఎవరికి చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు’’ అంటారు కవిత. బెంజీకి ఏడు సంవత్సరాల వయసులో ఎం. ఎం. రఫీ అనే గురువు దొరికారు. ఆయన బెంజీకి కొన్ని రాగాలను పరిచయం చేశారు. ఆనాడు నేర్చుకున్న ఆ పరిజ్ఞానంతో నేటికీ బెంజీకి ఏ పాట ఇచ్చినా వెంటనే కీ బోర్డు మీద వాయించుతోంది. ‘‘ఈ విషయంలో రఫీ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను’’ అంటారు కవిత.

ఆకాశవాణిలో పర్మినెంట్‌గా..!
పదకొండో ఏట, హృతిక్‌ రోషన్‌ నటించిన ‘కహోనా ప్యార్‌ హై’ చిత్రం చూసిన బెంజీ, సినీ సంగీతం మీద శ్రద్ధ చూపించింది. ‘‘ఎప్పుడు సినిమాకు వెళ్లినా పావు గంటకే ఇంటికి వెళ్లిపోదామని గోల చేసే బెంజీ, ఆ రోజు నిశ్శబ్దంగా సినిమా అంతా చూసింది. మాకు ఆశ్చర్యం వేసింది. ఆయనను కలిస్తే ఎలా ఉంటుందా అనిపించి, హృతిక్‌ రోషన్‌కి ఉత్తరం రాశాను. అమ్మాయి చేసిన సీడీ కూడా పంపాను. ఆయన మమ్మల్ని కలవడానికి అంగీకరించారు. ఆ రోజు మా అమ్మాయి ఎంత ఆనందించిందో చెప్పలేను’’ అన్నారు కవిత మనస్ఫూర్తిగా నవ్వుతూ. ‘కోషిష్‌’  పేరుతో బెంజీ రూపొందించిన సీడీని హృతిక్‌ రోషన్‌ ఆవిష్కరించారు. ఆ సీడీకి బెంజీకి జాతీయ అవార్డు వచ్చింది. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌లోకి ఆమె పేరు నమోదైంది. బెస్ట్‌ క్రియేటివ్‌ అడల్డ్‌ ఆఫ్‌ ఇండియా అవార్డును ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అందుకుంది బెంజీ. ఆమె పాడిన పాటను అంతర్జాతీయ స్థాయిలో ప్లే చేశారు. ఆ తరవాత ఆకాశవాణి వారు పర్మినెంట్‌ ఆర్టిస్టుగా బెంజీ ఎంపికచేశారు. విచిత్రం ఏమిటంటే, సంగీతం పాడి అందుకున్న అవార్డుల గురించి బెంజీకి ఏమీ తెలియదు. అందమైన పేపర్‌లో చుట్టి ఇచ్చిన బొకే గురించి కూడా బెంజీకి తెలియదు.

ఇప్పుడు తనే చెబుతోంది
అందరు గాయకులలాగానే వేదిక మీద ఏ మాత్రం బెదురు లేకుండా పాడుతోంది బెంజీ. ఇంకా విశేషం.. పాటలు పాడుతూ అవార్డులు సంపాదించిన బెంజీ ఇప్పుడు టీచర్‌ కూడా అయ్యారు. ‘‘ మా అమ్మాయిలాంటి వారి కోసం నేను ఇంటి దగ్గరే మ్యూజిక్‌ క్లాసెస్‌ ప్రారంభించాను. అందులో మా బెంజీ పాఠాలు చెబుతోంది’’ అని చెప్పారు కవిత. మాట్లాడటం కూడా సరిగా రాని బెంజీ.. సంగీతం మాత్రం అద్భుతంగా పాడుతుంది. సంగీత రాగాలలోనే తన మనో భావాలను పలికిస్తుంది. బెంజీ పాటలు విన్న ప్రముఖ హిందీ గాయిన శుభా ముద్గల్‌ ‘బెంజీ గొంతులో మాధుర్యం ఉంది, ఒక శక్తి ఉంది’ అన్నారు.బెంజీకి ఇప్పుడు 26 సంవత్సరాలు. సంగీతమే భాష, సంగీతమే ఆత్మ, సంగీతమే జీవితం, సంగీతమే ఆమెకు బలం. ప్రస్తుతం పండిట్‌ రామజీ మిశ్రా దగ్గర సంగీతం నేర్చుకుంటున్న బెంజీకి లతా మంగేష్కర్, ఆశా భోంశ్లే అంటే చాలా ఇష్టమని చెబుతారు కవిత. ఆమె ‘ధూమ్‌’ అనే ఫౌండేషన్‌ కూడా ప్రార ంభించారు. దాని ద్వారా ఆటిజమ్‌తో ఉన్న పిల్లలకు సంగీతంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ‘‘ఆటిజమ్‌ ఉన్న పిల్లలను కళాకారులుగా తీర్చిదిద్ది, వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేలా చేయడమే నా జీవిత లక్ష్యం. ఆటిజమ్‌ పిల్లలున్నవారందరికీ నేను ఇచ్చే సందేశం ఒకటే. పిల్లలకు సంగీతం వినిపించండి. సంగీతంతో చికిత్స జరుగుతుందని గమనించండి’’ అంటున్నారు కవిత కూతురుకి తల్లి పాట మంత్రంగా పనిచేసింది. ఆ పాటే తన బిడ్డ ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది.

కూతురి సంగీతమే కవిత కర్తవ్యం
కవితకు ఈ విజయం అంత సులువుగా దొరకలేదు. 2010లో కవిత భర్త కుమార్‌ గతించడంతో రెండు సంవత్సరాల పాటు కవిత సంగీతాన్ని విడిచిపెట్టారు. అంతలోనే తేరుకున్నారు. ‘‘కర్తవ్యం కళ్ల ముందు కనిపించింది. కుమార్తె బాధ్యతను చేపట్టాను. బెంజీ జీవితంలోకి మళ్లీ సంగీతం తీసుకువచ్చాను. భారతీయ సంగీతానికి చికిత్స చేసే శక్తి ఉందని తెలుసుకున్నాను. కీచుమనేలా ఉండే మా బెంజీ గొంతు కఠినమైన రాగాలు పలకడంతో గంభీరంగా ఖంగుమంటోంది’’ అంటారు కవిత.  
– వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top