పొత్తిళ్ల ఉయ్యాల

specail story to sarojini - Sakshi

దీపంతో దీపాలను వెలిగిస్తాం. ఆరిపోయిన దీపంతో ఇప్పటికి ఎనిమిది వందల దీపాలను వెలిగించారు సరోజినీ! తన పొత్తిళ్లను ఇంటి ముందు ఊయలలా కట్టి, సమాజం వద్దనుకున్న ఆడబిడ్డల్ని చేరదీసి, ముద్దుచేసి, విద్యాబుద్ధుల్ని నేర్పించి, ప్రయోజకులను చేసి.. మరణించిన తన చిన్నారిని వారందరి ఎదుగుదలలో  చూసుకుని మురిసిపోతున్నారు.  

ఆ ఇంటి బయట ఒక ఊయల కట్టి ఉంటుంది. వచ్చిపోయేవాళ్లు ఆ ఊయలను వింతగా చూస్తుంటారు. ఆడపిల్ల పుడితే వద్దనుకునే వివక్షాపూరిత సమాజం నుంచి అమ్మాయిలు ఆ ఊయలకు చేరుతుంటారు. అలాంటి వారికి తల్లి ప్రేమను, కుటుంబ ఆప్యాయతల్ని, సంరక్షణను 30 ఏళ్లకు పైగా అందిస్తున్నారు డా.సరోజినీ అగర్వాల్‌. 80 ఏళ్ల వయసున్న సరోజినీ లక్నోలోని గోమతి నగర్‌లో ‘మనీష మందిర్‌’ పేరుతో తన ఇంటినే ఆశ్రమంగా చేసుకొని నడుపుతున్నారు. ఇప్పటి వరకు 800 మంది ఆడపిల్లలను పెంచి, పెద్ద చేసి, వారికో మంచి భవిష్యత్తును ఇచ్చిన తల్లి ఆమె. ఈ వృద్ధాప్యంలోనూ ఆడపిల్లల పెంపకం గురించి, వారి బాగోగుల గురించి నిత్యం తపిస్తూనే ఉన్నారు. ఈ తపనకు, కృషికి గుర్తింపుగా ఆమె ఎన్నో రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులను అందుకున్నారు. 

కంటి వెలుగు హారతి!
హిందీ సాహిత్యంలో పీహెచ్‌డీ చేసిన సరోజిని కవితలు, కథలు, నవలలు రాస్తుంటారు. నలభై ఏళ్ల క్రితం వరకు.. భర్త, ముగ్గురు కొడుకులు, కూతురుతో ఆమె జీవితం ఆనందంగా సాగేది. ఒకనాడు మార్కెట్‌కి టూ వీలర్‌ మీద ఎనిమిదేళ్ల కూతురు మనీషని కూర్చోబెట్టుకొని ప్రయాణిస్తున్నారు సరోజిని. అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సరోజినికి గాయాలు కాగా, చిన్నారి  మనీష మరణించింది. కూతురు లేదన్న బాధ నుంచి ఆమె త్వరగా కోలుకోలేకపోయారు. కూతురు తన నుంచి ఎందుకు వెళ్లిపోయిందన్న దుఃఖం నుంచి ఆమె తన జీవితానికి ఓ కొత్త అర్థాన్ని వెతుక్కున్నారు. ‘‘కూతురిని పెంచి, పెళ్లి చేసి ఆమె ఆనందంగా ఉండటం కళ్లారా చూడాలనుకున్నాను. కానీ, దేవుడి నిర్ణయం వేరేగా ఉంది. అందుకే నా అన్నవారు లేని అమ్మాయిల్లో నా మనీషను చూసుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పారు ఒకనాడు భర్తతో. ఇదే విషయాన్ని తన ముగ్గురు కుమారులతోనూ మాట్లాడారు. వారూ తల్లి ఆలోచనకు, ఆవేదనకు మద్దతుగా నిలిచారు. దీంతో తమ ఇంటికే ‘మనీష మందిర్‌’గా నామకరణం చేశారు సరోజినీ. ఇంటి ముందు ఊయలను ఏర్పాటు చేశారు. ఆడశిశువును వద్దనుకున్నవారు ఎవరికీ కనిపించకుండా ఆ ఊయలలో ఉంచి వెళతారు. ఆ బిడ్డను కన్నబిడ్డలా ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుంటారు సరోజినీ.  

ఇంటి పేరు భారతి! 
మొదట తల్లీతండ్రీ మరణించి ఎవరూ లేని ముగ్గురు అమ్మాయిల సంరక్షణ  తీసుకున్నారు డా.సరోజిని. ‘‘ఆ అమ్మాయిల్లో నా మనీష కనిపించింది. ఆ తర్వాత ఎక్కడ ఆడపిల్లలు నిరాదరణకు గురవుతున్నట్లు తెలిసినా నా మనీష గుర్తుకు వచ్చి మనసు తల్లడిల్లిపోయేది. వెంటనే వెళ్లి తెచ్చుకునేవాళ్లం. అలా రోజు రోజుకు మా మందిర్‌లో అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వచ్చింది. నా భర్త, పిల్లల సంపాదన, నా పుస్తకాల మీద వచ్చిన డబ్బుతో హోమ్‌ నడుపుతూ వచ్చాను. తర్వాత దాతల సాయమూ తోడైంది. ఇక్కడ అమ్మాయిలందరి ఇంటి పేరు ‘భారతి’ అనే ఉంటుంది. ఇలా చేరిన వారందరికీ సంరక్షణ, చదువుతో పాటు స్వతంత్రంగా ఎదిగేందుకు కావాల్సిన అన్ని అర్హతలు వచ్చేలా శిక్షణ, ప్రోత్సాహం ఉంటుంది. ఇంతమంది నా కుమార్తెల్లో ఇప్పుడు చాలామంది బ్యాంకుల్లోనూ, స్కూళ్లలోనూ, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నారు. స్వయం ఉపాధితో బతుకుతున్నారు. వివాహాలు చేసుకొని పిల్లాపాపలతో చల్లగా ఉన్నారు. బిడ్డల ఎదుగుదలే తల్లికి ఆత్మతృప్తి. నా జీవితపు తుది శ్వాస వరకు ఈ మనీషలందరినీ చూసుకునేటంత శక్తినివ్వమని ఆ దైవాన్ని ప్రార్థిస్తుంటాను. అమ్మాయిలు భారం కాదు. వారే ఈ సమాజపు పునాదులు. కుటుంబపు భవిష్యత్తుకు తల్లులు’’ అంటారు ఆమె. 

‘‘బిడ్డల ఎదుగుదలే తల్లికి ఆత్మతృప్తి. నా జీవితపు తుది శ్వాస వరకు ఈ మనీషలందరినీ చూసుకునేటంత శక్తినివ్వమని ఆ దైవాన్ని ప్రార్థిస్తుంటాను. అమ్మాయిలు భారం కాదు. వారే ఈ సమాజపు పునాదులు. కుటుంబపు భవిష్యత్తుకు తల్లులు’’.
– డాక్టర్‌ సరోజినీ  అగర్వాల్‌
– ఎన్‌.ఆర్‌.
చేరదీసి, పెంచి పెద్దచేసిన బాలికలతో సరోజిని 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top