అమ్మ నటి.. నేను పెయింటర్‌

Sakshi Specieal Interview With Jamuna Family

సినీ పరివారం

సినిమా కుటుంబాలు రెండు రకాలు. పిల్లలను తిరిగి సినిమాల్లోనే ప్రవేశపెట్టే కుటుంబాలు కొన్ని. సంతానాన్ని కొత్త దారుల్లో నడిపించే కుటుంబాలు కొన్ని. సినిమాల్లో కొనసాగుతున్నవారు ఎలాగూ తెలుస్తారు. పరిశ్రమకు దూరంగా ఉన్నవారు  ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలనాటి సూపర్‌స్టార్‌ జమున పిల్లలు ఏం చేస్తున్నారు? కుమారుడు వంశీకృష్ణ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. కుమార్తె స్రవంతి హైదరాబాద్‌లో తల్లితో కలిసి ఉంటున్నారు. ఆమె తన జీవితం గురించి, తల్లితో అనుబంధం గురించి ‘సాక్షి’కి వివరించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లో...

నా చిన్నప్పుడు అమ్మ నటిగా, ఎంపీగా, సోషల్‌ యాక్టివిస్ట్‌గా చాలా బిజీగా ఉండటం వల్ల ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమె ఆ పనుల నుంచి కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాకే ఆమెతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఆమె నన్ను ఒక సెలబ్రిటీ కూతురులా కాకుండా సాధారణమైన అమ్మాయిగానే పెంచింది. టైమ్‌ మేనేజ్‌మెంట్, డిసిప్లిన్, స్వేచ్ఛ అన్నీ అలవాటు చేసింది. నేను ఫలానా వాళ్ల అమ్మాయినని చెప్పుకుని ప్రయోజనాలు పొందకూడదు అనేది. తప్పు చేయొద్దని, పనులన్నీ సొంతంగా చేసుకోవాలని చెప్పేది.

ప్రోగ్రెస్‌ కార్డు వచ్చిన రోజు దెబ్బలే...
నా చిన్నప్పుడు సినిమా వాళ్ల పిల్లలు సినిమా తారలు అవుతారు అనుకునేదాన్ని. స్కూల్‌లో టీచర్లు కూడా ‘నువ్వు చదువుకోకపోయినా పరవాలేదు, మీ అమ్మగారు పెద్ద హీరోయిన్‌ కదా, నువ్వు కూడా హీరోయిన్‌వి అయిపోతావు’ అనేవారు. నేను అదే నిజం అనుకున్నాను. చదువు మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. కాని అమ్మ ఊరుకునేది కాదు. తక్కువ మార్కులు వస్తే బెత్తం అందుకునేది. అందుకని నా రిపోర్టు కార్డు నాన్న స్వయంగా తీసుకునేవారు. ఆ టైమ్‌లో అమ్మకు కనపడకుండా పారిపోవడానికి ప్రయత్నించేదాన్ని.

ఒక్కోసారి చెట్టు ఎక్కేసేదాన్ని. అమ్మ చేతికి చిక్కగానే రెండు దెబ్బలు పడేవి. నాకు ఇంగ్లీషు, సైన్స్‌ సబ్జెక్ట్స్‌ మాత్రమే ఇష్టం. నెమ్మదిగా చదువు మీద శ్రద్ధ పెట్టి, బి.ఏ. పూర్తి చేశాను. అమ్మ ఎంత బిజీగా ఉన్నా నేను స్కూల్‌లో ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్‌కి నా చేత సత్యభామ వేషం వేయించి, తనే కొత్త డ్రెస్‌ కుట్టించి, మేకప్‌ చేసి, పద్యాలు నేర్పించేది. మా స్కూల్‌కి వచ్చేది. అమ్మని ప్రత్యేక అతిథిగా వేదిక మీదకు ఆహ్వానించేవారు.

తెలుగుతో సూర్యోదయం...
తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే అమ్మ నిద్ర లేచి నాకు హిందీ, తెలుగు నేర్పించేది. ఎంత ఆధునికంగా ఉన్నా, సంప్రదాయాన్ని విడిచిపెట్టకూడదని, పెద్దల పట్ల గౌరవంగా ఉండాలని అమ్మనాన్న ఇద్దరూ చెప్పేవారు. పూజ, మడి, ప్రసాదం తయారు చేయడం, నైవేద్యం పెట్టడం... అన్నీ నేర్పింది. అందరితో కలసిమెలసి ఉండాలని చెప్పేది, కలవనిచ్చేది. ఒత్తులు సరిగా పలక్కపోతే ఒప్పుకునేది కాదు. మా అబ్బాయికి కూడా అమ్మే తెలుగు నేర్పిస్తూ, తెలుగులో మాట్లాడాలని చెబుతుంది. మా చిన్నతనం నుంచి అమ్మానాన్నల్లో ఎవరో ఒకరు మా విషయాలు పట్టించుకునేవారు.

పాటలు – పాత్రలు...
అమ్మకి జ్ఞాపకం బాగా ఎక్కువ. ఏ సినిమా ఎప్పుడు ఎక్కడ షూటింగ్‌ జరిగిందీ, అక్కడ సెట్లో వాళ్లు ఏ ముచ్చట్లు మాట్లాడుకున్నారో అన్నీ నాకు చెప్పేది. నేను, నాన్న ‘మీరజాలగలనా’ పాటను పాడుతూ అమ్మను ఆట పట్టించేవాళ్లం. అమ్మ నటించిన ‘గుండమ్మ కథ’ నా ఫస్ట్‌ ఫేవరేట్‌. అందులో అమ్మ వేసిన సరోజ పాత్రలో నన్ను నేను చూసుకుంటాను. నేను కూడా ఆ సినిమాలోలాగే నిద్ర మంచం మీద నుంచే ‘అమ్మా! కాఫీ’ అనేదాన్ని. ‘కిందకి వచ్చి తాగు’ అని అమ్మ గట్టిగా అనేది. ఈ సినిమాలో రెండోభాగంలో ఒక సామాన్యుడి భార్యగా అమ్మని చూడటం నాకు నచ్చేది కాదు. ఒక సినిమాలో అంత వేరియేషన్‌ రావడం ఆ తరవాతి రోజుల్లో నాకు బాగా నచ్చింది. పరిశ్రమలో వేరెవ్వరికీ ఇటువంటి పాత్రలు లేవేమో అనుకుంటాను.

అమ్మ వేసిన పాత్రలలో ‘మూగమనసులు’ చిత్రంలోని గౌరి కూడా నాకు ఇష్టం. ఆ చిత్రంలో అమ్మని ముసలిగా  చూడలేకపోయేదాన్ని. చిన్నప్పుడు ఈ సినిమా అమ్మతో కూర్చుని చూశాను. అమ్మ నటించిన ‘మూగనోము’ చిత్రాన్ని చూస్తూ, నాన్న ఏడ్చేవారు. నేను ఆ సినిమా చూడలేదు. ‘ఉండమ్మా బొట్టు పెడతా’లో మహిళాశక్తి, స్త్రీ త్యాగం చూపారు. హిందీలో ‘మిలన్‌’, ‘మిస్‌ మేరీ’ సినిమాల్లో అమ్మ బాగా చేసింది. ఆధ్యాత్మిక పాత్రలు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే పాత్రలు, పౌరాణికాలు... ఇన్ని విలక్షణమైన పాత్రలు చేసినది బహుశ అమ్మ ఒక్కరేనేమో. అమ్మ సినిమా జీవితంలో పడిన కష్టాలు విని ఆశ్చర్యపోయాను. అమ్మను సినిమా షూటింగ్‌లో ఎప్పుడూ చూడలేదు. తీసుకెళ్లేది కాదు.

దసరా బొమ్మల కొలువు...
అమ్మ తన బాల్యం నుంచి ఇప్పటివరకు దసరాకు  బొమ్మల కొలువు పెడుతూనే ఉంది. వందేళ్లనాటి మా అమ్మమ్మ ఆడుకున్న బొమ్మలు ఇప్పటికీ ఉన్నాయి. అమ్మ పెట్టే బొమ్మల అమరికలో చాలా పర్‌ఫెక్షన్‌ ఉంటుంది. అమ్మమ్మ... అమ్మ... నేను... మా అబ్బాయి... పరంపర కొనసాగుతోంది.

ఆ సంవత్సరం గృహిణిగా...
నాకు 16 సంవత్సరాలు వచ్చేవరకు అమ్మని ఎన్నడూ కిచెన్‌లో చూడలేదు. ఒకసారి ఒక సంవత్సరం పాటు వంట మనిషి దొరకలేదు. దానితో ఏడాదిపాటు అమ్మ తన పనులన్నీ మానేసి, కెరీర్‌కి సెలవు పెట్టేసింది. వంటల పుస్తకాలు తెప్పించుకుని, చదివి, చేసేది. అమ్మ చేసిన వాటిలో క్యాలీఫ్లవర్‌ బజ్జీ, వెజిటబుల్‌ అగ్రెట్టా (ఇటాలియన్‌) నాకు బాగా ఇష్టం. ప్రతిరోజూ నా బాక్స్‌లో లంచ్‌ నా స్నేహితులు తీసుకుని తినేసేవారు. ఇంటికి వచ్చాక అమ్మ, ‘ఈ రోజు లంచ్‌ ఎలా ఉంది’ అని అడిగితే, నేను సమాధానం చెప్పలేకపోయేదాన్ని. ఆ ఏడాది అమ్మని అచ్చమైన గృహిణిగా చూశాను.

వ్యక్తిత్వం నిలబెట్టుకుంది...
సినిమా రంగంలో వ్యక్తిత్వం నిలబెట్టుకున్న అమ్మ దగ్గర ఎవ్వరూ వెకిలి జోకులు వేసేవారు కాదు. అలా నిలదొక్కుకోవడం చాలా కష్టమని చెప్పేది. మా అబ్బాయితో రెజ్లింగ్‌ చేస్తుంది. అమ్మ డైట్‌ చాలా డిసిప్లిన్‌డ్‌గా ఉంటుంది. ఇప్పటికీ మాకు ఆహారపు అలవాట్ల గురించి క్లాసు పీకుతుంది. అమ్మ నుంచి జెనెటిక్‌గా నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. అమ్మకు కోపం ఎంత త్వరగా వస్తుందో, అంత త్వరగా పోతుంది. పర్‌ఫెక్షన్‌ కోసమే అమ్మకి కోపం వస్తుంది. అన్నయ్య, నేను సినిమాలలోకి వెళ్లకపోయినా, మనవడైనా సినిమాలలోకి ప్రవేశించి, తన పేరు నిలబెట్టాలని కోరుకుంటోంది అమ్మ.
– సంభాషణ:డా. వైజయంతి పురాణపండ
ఫొటోలు: శివ మల్లాల

గ్లాస్‌ పెయింటర్‌ని...

బి.ఏ. పూర్తయ్యాక కొంతకాలం శాన్‌ఫ్రాన్సిస్కోలో అన్నయ్య దగ్గరున్నాను. ఆ సమయంలోనే బర్కిలీలో గ్లాస్‌ ఆర్ట్‌ మీద కోర్సు చేశాను. ఇదే నా కెరీర్‌ అని అర్థం చేసుకుని, పెయింటింగ్స్‌ మీద దృష్టి పెట్టాను. గ్లాస్‌ పెయింటింగ్‌ వర్క్‌ అర్ధరాత్రి వరకు చేస్తుండేదాన్ని. చేతులు కోసుకుపోతుండేవి. నా చేతులు చూసి, అమ్మ గోరుముద్దలు తినిపించేది. నవ రసాల మీద తొమ్మిది పెయింటింగులు వేసి, ‘త్వమేవాహమ్‌’ పేరు పెట్టాను. ‘నిత్య విద్యార్థి’లా ఉండాలని అమ్మ ఎప్పుడూ చెబుతుంది. అమ్మ తనను తాను అలాగే అనుకుంటుంది.
– స్రవంతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top