
త్యాగరత్నమ్మ
నేడు మాఘ పంచమి. తిరువాయూరుకు పండుగ రోజు. త్యాగరాజుని స్వరాలతో స్మరించుకునే రోజు.
నేడు మాఘ పంచమి. తిరువాయూరుకు పండుగ రోజు. త్యాగరాజుని స్వరాలతో స్మరించుకునే రోజు. తిరువాయూరుకు ఇంతటి ఘనత తీసుకువచ్చింది బెంగుళూరు నాగరత్నమ్మ అనే ఒక సాధారణ స్త్రీమూర్తి. తిరువాయూరులో ఈ నెల ఆరున మొదలైన త్యాగరాజ ఆరాధనో త్సవాలు నేటితో ముగుస్తున్న సందర్భంగా నాగరత్మమ్మ గురించిన వివరాలు, విశేషాలు... సంక్షిప్తంగా...
- డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
నాగరత్నమ్మ గాయని, సాంస్కృతిక సేవిక. తిరువాయూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలకు ఆద్యురాలు. 1878లో బెంగుళూరులో దేవదాసి కుటుంబంలో జన్మించారు. వీరి పూర్వీకులు సంగీత కళాకారులుగా మైసూరు ఆస్థానంలో ఉండేవారు. నాగరత్నమ్మ బాల్యం నుంచే సంగీత కచేరీలిచ్చారు. ప్రాపంచిక విషయాలు ఆమెకు ఏనాడూ మనశ్శాంతిని ఇవ్వలేదు. చివరికి శ్రీరాముని పాదపద్మాలే తనకు ఆనందాన్ని కలిగిస్తాయని భావించారు. త్యాగరాజును ఆథ్యాత్మిక గురువుగా ఎంచుకున్నారు. కచేరీల ద్వారా తను సంపాదించిన యశస్సు, ధనం అన్నీ ఆయన ఆశీస్సులతో వచ్చినవేననుకున్నారు. తన సంపదనంతా త్యాగరాజు నిత్యం కొలిచే శ్రీరామునికి సమర్పించాలని నిశ్చయించుకున్న కొంత కాలానికి, ఒకరోజు త్యాగయ్య సమాధి కలలోకి వచ్చింది. మరుసటిరోజే, ఆవిడ తిరువాయూరు పయనమై, కావేరీ నది ఒడ్డున ఉన్న త్యాగరాజ సమాధిని సందర్శించారు.
అక్కడ రామాలయం నిర్మించాలనుకుని, అధికారులను సంప్రదించారు. స్థానికుల అండ కోరారు. తన దగ్గరున్న నగలు, ధనం మాత్రమే కాకుండా మద్రాసు షావుకారు పేటలోఉన్న ఇల్లు అన్నీ రామమందిరానికే వినియోగించారు. ఆ రోజుల్లో ఆ మొత్తం విలువ ముప్పై వేల రూపాయలు. అంతటితో సంతృప్తి చెందక, తిరువాయూరులో మైసూరు సంప్రదాయాన్ని నెలకొల్పాలనుకున్నారు. కానీ ఆమె దగ్గర ఒక్క పైసా కూడా లేదు. తమిళదేశంలో, దానం చేసేవారు ఆమెకు పరిచయం ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే ఈ సంప్రదాయానికి వారు సూచించిన పేర్లు పెట్టాల్సి వస్తుంది. అలా చేయడం వలన మైసూరు ఘనత ఎలా తెలుస్తుంది? కన్నడ ప్రజల పేరు ప్రఖ్యాతులు త్యాగరాజ సన్నిధిలో మారుమోగాలి. అలాగే మైసూరు నుంచి సంగీతం కోసం వచ్చే విద్యార్థుల కోసం తిరువాయూరులో కర్ణాటక సంగీత పాఠశాల నెలకొల్పాలి. అందుకే నిధులు సేకరించే పనిలో పడ్డారు నాగరత్నమ్మ. అలా ఆమె 1921లో తిరువాయూరులో త్యాగరాజ మందిరాన్ని కట్టించారు. 1926లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభించారు. నాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటికీ జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా ఆమె చివరిరోజులు అంత సంతోషంగా గడవలేదు. తన ఇద్దరు పిల్లలు మర ణించారు. ఆమె 1952లో తన 74 వ ఏట మరణించారు.