ఎనిమిదో అడుగు

Ranvir Singh And Deepika Padukone Beautiful Couple - Sakshi

భర్త ముందు నడుస్తాడు. భార్య వెనుక నడుస్తుంది.ఇది లోకాచారం. భర్త ఒకడుగు వెనుక నడిచి, భార్యను ముందుకు నడిపిస్తాడు!ఇది అఫెక్షన్‌.ఏడడుగుల తర్వాత.. భార్యపై ప్రేమతో, అఫెక్షన్‌తోఆమెను ముందుకు నడిపించడానికిభర్త వేసే వెనకడుగే.. ఎనిమిదో అడుగు. ఈ ఎనిమిదో అడుగు ప్రతి భర్తకూ ఆదర్శం కావాలి. 

రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకోన్‌ చూడచక్కని జంట. రణ్‌వీర్‌ దీపిక మీద ఎంత అఫెక్షన్‌ చూపిస్తాడో మాటల్లో చెప్పలేం. చూపించడం కాదు. చూపించకుండా ఉండలేకపోవడం అది! మనసులో అంత ప్రేమ ఉంటే బయటికి వచ్చేయకుండా ఉంటుందా? పక్కన వాళ్లున్నారు, వీళ్లున్నారు అని చూసుకుంటుందా! ఈమధ్య.. ఈ భార్యాభర్తలిద్దరూ కలిసి ఓ పెళ్లింటికి వెళ్లారు. సాధారణంగా కొత్తగా పెళ్లయిన కపుల్‌ ఎక్కడికి వెళ్లినా ఒకర్నొకరు అంటుకుని అడుగులు వేస్తుంటారు. వీళ్లూ అంతే కానీ.. దీపిక మనుషుల్లో పడిపోయారంటే రణ్‌వీర్‌ని అస్సలు పట్టించుకోరు. రణ్‌వీర్‌ కూడా ఫీల్‌ అవడు. ఆమె ఫ్రీడమ్‌ను తనూ ఎంజాయ్‌ చేస్తాడు. దీపిక ఫ్రీడమ్‌కు ఏవైనా అడ్డుపడితే వాటిని కూడా తొలగిస్తూ ఆమెను కంఫర్ట్‌గా ఉంచుతాడు. పెళ్లికి వెళ్లారు కదా..అక్కడ ఏమైందంటే.. వాళ్లను వీళ్లనూ గ్రీట్‌ చేస్తూ నట్టింట నడుస్తున్న దీపికకు హైహీల్స్‌ అడ్డుపడుతున్నాయి.

ఆమె ఇబ్బందిని గమనించాడు రణ్‌వీర్‌. ‘‘నాకివ్వు.. పట్టుకుంటాను’’ అని  తీయించి, వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె ముందుకు నడుస్తుంటే.. హైహీల్స్‌ పట్టుకుని ఆమె వెనుక నడిచాడు! (పట్టుకుని నడవడం ఎందుకు? ఎక్కడైనా పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు. కానీ దీపికకు మళ్లీ వాటి అవసరం వస్తేనో!) రణవీర్‌ దీపిక హైహీల్స్‌ని చేత్తో పట్టుకున్న దృశ్యం ఎవరి కెమెరాలోనో క్లిక్‌ అయింది. తర్వాత నెట్‌లో వైరల్‌ అయింది. రణ్‌వీర్‌ మెరూన్‌ కలర్‌ షేర్వాణీలో, దీపిక పూల వైట్‌ కలర్‌ శారీలో ఉన్నారు. కొప్పు, కొద్దిగా ఆభరణాలు దీపికను మెరిపించేస్తున్నాయి. అయితే ఫొటోల్లో ఇవేవీ నెటిజన్‌లకు కనిపించడం లేదు. రణవీర్‌ చేతుల్లోని దీపిక హైహీల్స్‌పైనే అందరి చూపు. ‘‘ఇలాంటి భర్త ఉంటేనా?’’ అని అమ్మాయిలు పరవశించిపోయారు. ఇది కాదు విశేషం. రణ్‌వీర్‌ ఫాన్స్‌ అస్సలు ఈగోలకు పోలేదు. భార్య చెప్పులు చేత్తో పట్టుకుని నడవడం ఏంటి అని ఒక్కరూ ఒక్క పోస్టయినా వెయ్యలేదు.

పైగా లైకుల మీద లైకులు కొట్టారు. ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనస్‌ విడిపోతున్నారని ఈ మధ్య ఒక దుర్మార్గమైన వార్త వచ్చింది. పాశ్చాత్య మీడియా సృష్టింపు అది. ‘అయ్యో’ అని ఎన్నో మనసులు కలత చెందాయి. అయితే ఆ వార్త నిజం కాదు. ఇద్దరూ హాయిగా ఉన్నారు. పెళ్లయ్యాక మొన్న వచ్చిన తొలి ఈస్టర్‌ను నిక్‌.. ప్రియాంక హృదయాన్ని హత్తుకునేలా సెలబ్రేట్‌ చేశాడు. రోజంతా ప్రియాంకను తన కుటుంబ సభ్యులతోనే ఉండనిచ్చాడు. అత్తగారు, భర్తతో కలిసి ఉన్న ఒక ఫొటోని ప్రియాంక సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘హ్యాపీ ఈస్టర్‌ ఫ్రమ్‌ అవర్స్‌ టు యువర్స్‌’ అని కామెంట్‌ కూడా రాశారు. ఇంటర్వ్యూలలో ప్రియాంక మర్చిపోకుండా ఒక మాట చెబుతుంటారు. ‘నిక్‌ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌’ అని. ఆ ఫ్యామిలీని అతడు తననెంతో ప్రేమించే ప్రియాంకకు కొంత పంచి పెట్టాడు.

‘తననెంతో ప్రేమించే’ ఓకే. ‘తనెంతో ప్రేమించే’ కాదా! ఇదిగో ఇలాంటి విరుపుల కారణంగానే విడిపోతల వదంతులు బయటికి వస్తుంటాయి. ప్రియాంక నిక్‌ని ఎంతగా ప్రేమిస్తున్నారో.. నిక్‌ కూడా ప్రియాంకను అంతగా ప్రేమిస్తున్నాడు. బ్రేక్‌ వస్తే చాలు.. ప్రియాంకను తీసుకుని అమ్మావాళ్ల (నిక్‌వాళ్ల) ఇంటికి వెళ్లిపోతున్నాడు. భూమండలాన్నంతా ఆల్రెడీ తిరిగేసిన ప్రియాంకకు ఇప్పుడు భువిపైనున్న స్వర్గసీమ అత్తగారిల్లు మాత్రమే. అలా ఆమె మనసులో అనుబంధాల పూలు పూయించాడు నిక్‌. మేఘన్‌ మార్కల్‌తో పెళ్లయ్యాక ప్రిన్స్‌ హ్యారీ సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజులు  ఇవ్వడం (ప్రపంచానికి) సర్వసాధారణం అయిపోయింది. మేఘన్‌ పరిచయం కాకముందు వరకు ప్రిన్స్‌ హ్యారీ మూడీగా ఉండేవారు. లైఫ్‌లోకి ఆమె వచ్చాకే అతడిలోకి కాస్త జీవం వచ్చింది. తల్లి డయానా తలపుల్లోంచి బయటికి రాలేకపోయిన పసిపిల్లవాడే అతడు అన్నేళ్ల పాటు! అలాంటి పిల్లాణ్ని ఇప్పుడు మేఘన్‌ ఒడిలోకి తీసుకున్నారు.

ఇప్పుడు ఆమే అతడి లోకం. ఆమె పట్ల అతడికెంత ఆరాధననో ఆ మధ్య వాళ్లు మొరాకో టూర్‌ వెళ్లినప్పుడు మళ్లీ ఒకసారి బయటపడింది. పి.డి.ఎ. అనే మాట వినే ఉంటారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నవాళ్లు ‘పబ్లిక్‌ డిస్‌ప్లే ఆఫ్‌ అఫెక్షన్‌’ (ఇదే పి.డి.ఎ)తో నలుగురి కంటా పడుతుంటారు. అంటే తమకు తెలియకుండానే ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తూ పోతుంటారు. మొరాకోలోని ఆండలూషియన్‌ గార్డెన్స్‌లో షాపింగ్‌కి వెళ్లినప్పుడు మేఘన్‌కు ఒక పెండెంట్‌ నచ్చింది. దానిని మెడలో ధరించడానికి పోనీ టెయిల్‌ అడ్డం వచ్చి మేఘన్‌ ఇబ్బంది పడుతుంటే ప్రిన్స్‌ హ్యారీ ఆమె పోనీని ఎత్తి పట్టుకుని పెండెంట్‌ వేసుకోడానికి హెల్ప్‌ చేశారు! రాజకుటుంబంలోని జంట.. అదీ పురుషుడు ఇలా చొరవచూపడం అపురూపం, అపూర్వం కూడా!  విరాట్, అనుష్క మనకు పాతబడి పోయి ఉండొచ్చు. వాళ్లకు వాళ్లు ఇంకా కొత్తగానే ఉన్నారు.

అయినా పాతబడాలని రూల్‌ ఏముంది? ప్రేమికులుగా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, భార్యాభర్తలుగా ఇప్పుడు ఆనందవాసంలో ఉన్నప్పుడు విరాట్‌ ప్రతి ట్రోలింగ్‌లోనూ అనుష్కకు సపోర్ట్‌గా ఉన్నాడు, ఉంటున్నాడు. ఆమె ఇష్టాలను గౌరవిస్తున్నాడు. ఆమె అయిష్టాలను అల్లంత దూరంలోనే ఉంచేస్తున్నాడు. స్టేడియంలో అనుష్క ఉండడం వల్లనే విరాట్‌ ఓడిపోతున్నాడని విమర్శలు వచ్చినప్పుడు అమెకు గట్టి అండగా ఉన్నాడు విరాట్‌. ‘ఇలాంటివి మాట్లాడొద్దు’ అని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇండియన్‌ టీమ్‌తో కలిసి అనుష్క గ్రూప్‌ ఫొటో దిగడం ఏమిటన్నప్పుడు కూడా అలాంటి విజ్ఞప్తే చేశాడు. ‘తను నా స్నేహితురాలు’ అని వివాహానికి పూర్వం, ‘తను నా భార్య’ అని వివాహానంతరం ఆమెను తను సాధించిన ట్రోఫీలా ఎత్తి చూపాడు. రోడ్డుమీద ఎవరో చెత్తపారబోస్తే అనుష్క తిడుతున్న వీడియోను ఎవరో నెట్‌లో పెట్టి ఆమెను ట్రోల్‌ చేస్తున్నప్పుడు కూడా ‘ఆమె తిట్టడంలో తప్పేమిటి?’ అని నెటిజన్‌లను ప్రశ్నించాడు తప్ప, ‘మనకెందుకొచ్చింది చెప్పు..’ అని భార్యను నిరుత్సాహపరచలేదు.

ఈ ఏడాది జనవరిలో వన్డే ఇంటర్నేషనల్‌ సిరీస్‌కు భార్యతో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్‌.. అదే సమయంలో అక్కడ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ జరుగుతుంటే అనుష్క ఫేవరేట్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు రోజర్‌ ఫెదరర్‌కు ఆమెను తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఫెదరర్, విరాట్, అనుష్క.. ముగ్గురూ కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోలను ‘త్రీ లెజెండ్స్‌ : వన్‌ ఫొటో’ అనే కామెంట్‌తో అనుష్క పోస్ట్‌ చెయ్యడంతో ఆమెపై ట్రోలింగ్‌ మొదలైంది. ఇరవైసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌కి, ఇండియా జట్టు కెప్టెన్‌ విరాట్‌కి.. ఒక సినిమా నటి సమానం ఎలా అవుతుంది? అసలు ఆమె లెజెండ్‌ ఎలా అవుతుంది అని నెటిజెన్స్‌ విమర్శించారు. విపరీతార్థాలు తీశారు. ‘రోజన్‌ని కలిస్తే నేనూ లెజెండ్‌ని’ అవుతానా అని ఒకరు వెటకరించారు. ‘అసలు అనుష్కే లెజెండ్‌. మిగతా ఇద్దరూ కాదు’ అని ఇంకొకరు వ్యంగ్యంగా గుడ్లు మిటకరించారు.

ఆ సమయంలో విరాట్‌ అనుష్కకు ఇంటా బయట ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చాడు.  చివరిగా సోనమ్, ఆనంద్‌. సోనమ్‌ కపూర్, ఆమె భర్త ఆనంద్‌ అహూజా గతవారం ఢిల్లీలో ఒక స్టోర్‌ ఓపెనింగ్‌కి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోల్లో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. సోనమ్‌ స్టోర్‌లోని షూజ్‌ని తొడుక్కుని చూస్తున్నప్పుడు ఆనంద్‌ కిందికి వంగి ఆమెకు లేస్‌లు కట్టడం కపూర్‌ అభిమానుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆనంద్, విరాట్, హ్యారీ, నిక్, రణవీర్‌ల ఈ ‘పబ్లిక్‌ డిస్‌ప్లే ఆఫ్‌ అఫెక్షన్‌’కు అబ్బాయిల్లో కన్నా అమ్మాయిల్లోనే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉండడం విశేషం. సహజమే. అమ్మాయిలు.. పెళ్లయినవాళ్లయినా, పెళ్లి కావలసినవాళ్లయినా.. ‘ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ అఫెక్షన్‌’ని ఇష్టపడతారు. నిజంగా ప్రేమ ఉంటే అది పైకి కనిపించకుండా పోతుందా అన్నది వారి పాయింట్‌. 
                   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top