అమ్మమ్మ దానం

Rajyalakshmi donate her doby to medical college - Sakshi

అమ్మమ్మ ఈ వయసులో ఏం దానం ఇస్తుంది? పక్షికి కాసిన్ని గింజలు... చెట్టుకు చెంబుడు నీళ్లు... పసిపిల్లలకు మిఠాయిలు... కాదు. ఈ సమాజానికి చాలా పెద్ద దానం ఇవ్వాలి అనుకుందామె. తన దగ్గర ఏముంది? నశించే ఈ దేహం తప్ప. చాలా మంది కర్మంతరాలతో తమ జన్మను ముగించాలని అనుకుంటారు. కాని ఆ శరీరాన్ని దానం చేయడం ద్వారా మరింత సార్థకతతో తనువు ముగించాలనుకుంటున్నారు రాజ్యలక్ష్మి.

‘నా శరీరాన్ని మెడికల్‌ కాలేజీకి రాసివ్వాలనుకుంటున్నాను’ అని ఆమె అన్నప్పుడు ఆ ఇంట్లో చాలా ఆశ్చర్యమే పుట్టింది. చాలా చర్చే నడిచింది. అయినవాళ్లలో బంధువుల్లో ఎంతో మల్లగుల్లాలు నడిచాయి. ఇలాంటి కోరికను ఆ ఇంట్లో మగవాళ్లే కోరలేదు. అలాంటి ఒక స్త్రీ పైగా ఇంతకాలం సనాతన సంప్రదాయాలను పాటించే అమ్మమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఒక నిశ్శబ్దం పాటించారు. కాని ఆ నిర్ణయం వెనుక ఉన్న సమాజ హితం, పరమార్థం తెలుసుకొని మద్దతుగా నిలిచారు. అంతే కాదు తాము కూడా శరీర దానానికి ముందుకొస్తున్నారు.

మృత్యువును అర్థం చేసుకుంటే...
‘నా పేరు రాజ్యలక్ష్మి. నా వయసు 78 సంవత్సరాలు. నాలుగవ తరగతి వరకు చదువుకున్నాను. నా పుట్టినిల్లు, అత్తవారిల్లు రెండూ తూర్పుగోదావరి జిల్లా ఆలమూరే.  నాకు ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయి, ఎవరి సంసారాలు వాళ్లు చేసుకుంటున్నారు. కాని ఇలా వీరు స్థిరపడటం వెనుక నా సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఎన్నో మంచి, చెడు అనుభవాలు ఉన్నాయి.

జీవితం కష్టసుఖాల మయం అనడానికి గుర్తుగా ఇరవై సంవత్సరాల క్రితం మా పెద్దబ్బాయి హఠాత్తుగా మరణించాడు. వాడంటే నాకు ఇష్టం. వాడు చనిపోయాక శూన్యం అనిపించింది. వాడి శరీరం ఆఖరు ప్రయాణం చేస్తున్నప్పుడు వాడిక కనిపించడని కుంగిపోయాను.  ఆ తరవాత కొంతకాలానికి మా వారు కాలం చేశారు. దెబ్బ మీద దెబ్బగా అనిపించింది. ఆయన పోయిన మూడో రోజున 90 సంవత్సరాలు పైబడిన మా అమ్మ కన్ను మూసింది. మా అమ్మ వాళ్ల ఇల్లు మా ఇంటి నుంచి కేవలం ఫర్లాంగు దూరం.

అంతవరకూ ఆవిడను చూడటానికి రోజూ వెళ్లేదాన్ని. కాని కడసారి చూడటానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.  పదేళ్లు గడిచాక మరో ఎదురుదెబ్బ తగిలింది. చిన్న తిరుపతి వెళ్లి వస్తూ మా చిన్న కోడలు యాక్సిడెంట్‌లో మరణించింది. నా జీవితంలో అదో పెద్ద దెబ్బ. ఆ దెబ్బకీ తట్టుకున్నాను. కోడలు పోవడంతో రెండవ అబ్బాయికి ఆధారంగా నిలబడ్డాను. బతికి ఉండగా అందరికీ ఉపయోగపడిన ఈ మనుషులు, వీరి శరీరాలు చనిపోయాక ఇలా బూడిదలో కలిసిపోవలసిందేనా... వీటితో సాధించే పరమార్థం ఏదైనా ఉందా అనే ఆలోచన నాలో మొదలైంది.

ఆ సంఘటన చూసి
నాలో ఈ ఆలోచన నలుగుతున్నప్పుడే మాకు తెలిసినవారి ఇంట్లో ఆ ఇంటి యజమాని మరణించాడు.  దహనకాండకు ఆవిడ చేతిలో చిల్లి గవ్వ లేదు. ఆవిడకు ఏం చేయాలో పాలుపోలేదు. కర్మకాండలంటే సుమారు పాతికవేలు ఖర్చు. భర్త పోయిన బాధలో ఉన్నా ఆవిడకు కర్తవ్యం గుర్తుకు వచ్చింది.

వెంటనే  దగ్గరున్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి కార్యక్రమం పూర్తయిందనిపించింది. ఆ రోజే అనిపించింది దహనకాండ కోసం ఇన్ని ఇబ్బందులు పడటం కంటె, మన దేహాన్ని నలుగురికీ ఉపయోగపడేలా చేస్తే పుణ్యం పురుషార్థం కూడా కదా అని.  అందరూ నాలా ఉండాలని నేను కోరుకోను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం మాత్రమే.

పేపర్‌లో చదివి
అప్పుడే ‘సాక్షి’ పేపర్‌లో అవయవదానం గురించి వ్యాసం చదివాను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చనిపోయినవారి శరీరంలోని అవయవాలతో చాలామందికి కొత్త ఊపిరి పోయవచ్చని తెలుసుకున్నాను.  కళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం... మనిషి చనిపోయి కూడా తన అవయవాలను దానం చేసి ఇంతమందిని బతికించవచ్చా అనుకున్నాను. అలా కాని పక్షంలో మనం చనిపోయాక మన శరీరాన్ని మెడకల్‌ కాలేజీకి ఇస్తే పరిశోధనలకు పనికి వస్తుందని గ్రహించాను.

అవయవ దానానికి గానీ, శరీర దానానికి కానీ నేను అనుమతి ఇవ్వడం, అందుకు అవసరమైన అనుమతులు తీసుకోవడం అవసరమని గ్రహించాను.  ఈ విషయంలో చాలా రోజులు తర్జనభర్జన పడ్డాను. శాస్త్ర విరుద్ధమేమోనని కొన్నాళ్లు ఆలోచించాను. కొందరు పండితులను ఈ విషయం గురించి సంప్రదించాను. వారు తప్పు లేదని చెప్పారు. పురాణాల్లో కూడా ఉదంతాలు ఉన్నాయి. శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. దధీచి తన వెన్నెముకను దేవతల కోసం ఇచ్చేశాడు. పురాణాలు చదవడం కాదు, ఆచరణలో పెట్టాలి.  ఛాందస భావాలున్న కుటుంబాలు కావు మావి.  మనిషి బ్రతికుండగా తిండి పెట్టని పిల్లలు, చనిపోయాక లక్షలు ఖర్చు పెట్టి, పేపర్లో ప్రకటనలు ఇవ్వడం, సంతర్పణలు చేయడం అవసరమా అనిపించింది.

పిల్లల అనుమతి కోసం
ఈ విషయంలో  పిల్లల అనుమతి తప్పక తీసుకోవాలి. అయితే ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు.  అందుకే వాళ్లతో తరచుగా ఈ విషయమై చర్చించడం ప్రారంభించాను. కొన్నాళ్ల తరువాత మా అబ్బాయిలకు అసలు విషయం చెప్పాను. వాళ్లు వెంటనే ఏమీ మాట్లాడలేదు. ప్రతిరోజూ నేను ప్రస్తావన తీసుకురావడం, వాళ్లు మాట దాటేయడం... ఇలా నెలరోజులు గడిచిపోయాయి. ఇక నేను ఈ విషయంలో మొండిగా ఉన్నానని అర్థం చేసుకున్నారు.

  నా దేహాన్ని కాకినాడ మెడికల్‌ కాలేజీకి రాసేశాను. ఈ సంగతి విని కొందరు మెచ్చుకున్నారు. ఎక్కువమంది ‘పోయేకాలం’ అని తిట్టారు. సంప్రదాయిక కుటుంబంలో పుట్టిన నీకు ఈ బుద్ధులెలా వచ్చాయి అన్నారు. అన్నిటికీ చిరునవ్వే నా సమాధానం. నేను శరీరదానం చేయడం చూసి మా మూడో అబ్బాయి జనార్దనస్వామి, మూడో కోడలు విజయ కూడా కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీకి దేహదానం చేశారు. అనుమతి పత్రాలు తెచ్చుకున్నారు.

నా ఆకాంక్ష
నా నిర్ణయం వల్ల నా పిల్లలకు సమాజం నుండి కొంత ఇబ్బంది కలగవచ్చు. మంచి పని చేసిన రాజా రామ్మోహన్‌రాయ్, వీరేశలింగం గారు పడిన ఇబ్బందితో పోలిస్తే ఇదెంత. వారు అధిగమించగలరు. నా నిర్ణయం సమాజంలో కొందరికి స్ఫూర్తి కలిగించాలని నా ఆకాంక్ష’ అని ముగించారామె. – డా. వైజయంతి

మాది మేనరికం. మా మేనత్త కొడుకునే వివాహం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి మా అత్తను దగ్గరగా చూశాను. ఆవిడ ఎవ్వరినీ ఒక్క మాట కూడా అనదు. ఎంతటి ఇబ్బంది వచ్చినా చిరునవ్వు చెరగనీయదు. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆవిడ ఇంత మంచి నిర్ణయం తీసుకుంది. ఆవిడను స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా శరీర దానం చేయాలనుకున్నాను. అత్తతో ఈ విషయం చెప్పాను.  తన అంగీకారం తెలిపింది.    – విజయ (కోడలు)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top