మన వెంటే ఉండే సూట్‌కేస్‌

Periodical research - Sakshi

ఫొటో చూశారుగా.. అదీ విషయం. ఇందులో కనిపిస్తున్న సూట్‌కేస్‌ను మనం లాక్కు వెళ్లే అవసరమే లేకపోగా.. అది మనల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. మన దగ్గరగానే అడుగులేస్తూ ఉండటం ఇంకో విశేషం. బీజింగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌ కంపెనీ ఫార్వర్డ్‌ ఎక్స్‌ రోబోటిక్స్‌ తయారు చేసింది దీన్ని. రెండు బ్రష్‌లెస్‌ విద్యుత్తు మోటర్లు, బోలెడన్ని కెమెరాలు.. ఒక స్నాప్‌డ్రాగన్‌ మైక్రో ప్రాసెసర్‌ సాయంతో ఈ సూట్‌కేస్‌ తన పరిసరాలను గుర్తిస్తూ మీ వెంటే నడుస్తుందన్నమాట.

రొమ్ము క్యాన్సర్‌ నివారణకు విటమిన్‌–డి
రోజూ  కాసేపు ఎండలో నిలబడితే ఆరోగ్యానికి మేలని మీరు చాలాసార్లు విని ఉంటారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. శరీరం స్వయంగా తయారు చేసుకోవడం సాధ్యం కాని విటమిన్‌ డీని సూర్య కిరణాలతో చేసుకోవచ్చు. ఎముకల దృఢత్వం మొదలుకొని అనేక సమస్యల పరిష్కారానికి విటమిన్‌ డీ దోహదపడుతుందని ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి. తాజాగా శరీరంలో విటమిన్‌ డీ ఎక్కువ మోతాదులో ఉంటే రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. విటమిన్‌ డీతో ఆరోగ్య ప్రయోజనాలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థతో కలిపి ఈ అధ్యయనం జరిగింది. దాదాపు అయిదు వేల మందిపై ఇప్పటికే జరిగిన రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ నుంచి  సమాచారాన్ని సేకరించి విశ్లేషించినప్పుడు తమకు ఈ కొత్త విషయం తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.

2002 – 2017 మధ్యకాలంలో జరిగిన ఈ దీర్ఘ అధ్యయనంలో అప్పుడప్పుడూ విటమిన్‌ డీ మోతాదులను పరిశీలించామని, మొత్తమ్మీద చూసినప్పుడు వీరిలో 77 మంది రొమ్ము కేన్సర్‌ బారిన పడ్డారని ఆయన చెప్పారు. కేన్సర్‌బారిన పడని వారిలో విటమిన్‌ డీ మోతాదు 60 నానోగ్రామ్స్‌/లీటర్‌గా ఉన్నట్లు గుర్తించామని.. సాధారణంగా 20 నానోగ్రాముల విటమిన్‌ డీ ఉంటే చాలని వైద్యం చెబుతుందని వివరించారు.

ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన విటమిన్‌ డీ మోతాదును గణనీయంగా పెంచేందుకు అమెరికన్‌ వైద్యరంగం ప్రయత్నాలు చేస్తోంది. అరవై నానోగ్రాముల కంటే ఎక్కువ విటమిన్‌ డీ ఉన్న వారికి రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశం 20 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.

అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు, బాడీ మాస్‌ ఇండెక్స్, ధూమపానం వంటి అలవాట్లు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ విటమిన్‌ డీ ఎక్కువగా ఉన్నవారికి రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువని తమ అధ్యయనం చెబుతోందని వివరించారు. కొన్ని రకాల ఇతర కేన్సర్ల విషయంలోనూ విటమిన్‌ డీ ప్రభావం ఎంతో ఉన్నట్లు గతంలో జరిగిన పరిశోధనలు చెబుతూండటం ఇక్కడ గమనార్హం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top