బ్యాక్‌లేస్‌

new fashion show  - Sakshi

ట్రెండ్‌

నెక్‌లేస్‌ చూసి మీకందరూ చెబుతారు బాగుందని.బ్యాక్‌లేస్‌ చూసి అందరూ అందరికీ చెప్పుకుంటారు బాగుందని.మీ వెనుక ఒదిలిపోయే ఒక అందమైన అనుభూతి.. బ్యాక్‌లేస్‌.జరీ జిలుగులతో.., స్వరోస్కి మెరుపులతో ధగధగలాడే చీర కొంగు అబ్బురపరిచేలా ఉందా!కొంగుతో పోటీపడే బ్లౌజ్‌ గ్రాండ్‌గా కళకళలాడుతుందా! కేశాలంకరణ కొంగొత్తగా ఉందా! ఆభరణాల అలంకరణ పూర్తయిందా! ఇవన్నీ సహజమే. ఇది కాకుండా ఒక రాయల్‌ లుక్‌ని జత చేర్చాలి. స్టైల్‌గా కనువిందుచేయాలి అంటే..  ఆభరణాలను వీపున ధరించాలి.  వజ్రాలు, బంగారు ఆభరణాలతోనే కాదు ముత్యాలు పూసలతోనూ ఆ కళను తీసుకురావచ్చు. 

కావల్సినవి
1 ముత్యాలు లేదా తెల్లని పూసలు. బంగారు, వెండి రంగుల పూసలు. గోల్డ్‌ కలర్‌ చైన్‌. తీగలు. ఒకే డిజైన్‌ ఉన్న 2 చిన్న పెండెంట్స్, ఒక పెద్ద పెండెంట్, 2 హుక్స్‌ లేదా పిన్స్, గ్లూ, పూసలు గుచ్చడానికి సన్నని వైరు, కటర్‌.
తయారీ
2 ముందుగా బ్లౌజ్‌ బ్యాక్‌ వెనుక ఎంత పరిమాణం చైన్‌ కావాలో కొలత తీసుకోవాలి. ఆ ప్రకారం చైన్‌ని కట్‌చేసుకోవాలి. పెండెంట్స్‌ని ’V’ ఆకారంలో అమర్చి, చైన్‌ని కటర్‌ సాయంతో వాటికి జత చేయాలి. 
3 వైరుకు ఒక తెల్లని పూస తర్వాత బంగారు పూస వచ్చేలా గుచ్చాలి. 
4 కావల్సినన్ని వరుసలు తయారుచేసుకోవాలి.
5 ’V’ ఆకారంలో ఉన్న చైన్‌కి పూసల హారాలను అమర్చాలి. 
6 తోరణంలా రెండువైపులా వరసలు పూర్తయ్యాక అన్నీ సక్రమంగా వచ్చాయా లేదో సరి చూసుకోవాలి.
7 ఆభరణానికి రెండు వైపులా చిన్న పెండెంట్స్‌ వెనుక భాగంలో గట్టి పేపర్‌చార్ట్‌ పీస్‌ లేదా కట్‌ చేసిన ప్లాస్టిక్‌ షీట్‌ను అతికించాలి. వీటికి గ్లూ పెట్టి హుక్స్‌ లేదా పిన్స్‌ని కూడా అతికించాలి. లేదా ఆ షీట్‌కి పిన్నుతో గుచ్చి సన్నని రంధ్రాలు చేసి, ఊడిపోకుండా చిన్న హుక్స్‌ అమర్చి పూసల హారాలను సెట్‌ చేయాలి. 
8 ఈ హారాన్ని వెనుక భాగంలో భుజాల మీదుగా బ్లౌజ్‌కి రెండు వైపులా హుక్‌ లేదా పిన్‌తో జత చేయాలి. చూడముచ్చటైన అలంకరణ పూర్తవుతుంది.

నోట్‌
∙ఈ డిజైన్స్‌లో స్టోన్స్, కుందన్స్‌ వంటివాటిని ఉపయోగించి.. మీ అభిరుచికి మేరకు ఆభరణాన్ని సిద్ధం చేసుకోవచ్చు ∙శారీ బ్రోచ్‌ అని మార్కెట్‌లో లభిస్తున్నాయి. పైట ముందు భాగంలో అమర్చుకునే ఈ బ్రోచ్‌ని బ్లౌజ్‌ వెనుక భాగంలోనూ అలంకరించుకోవచ్చు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top