ఎప్పటికీ మోడరన్‌ కేఫ్‌

Modern cafe forever - Sakshi

ఫుడ్‌  ప్రింట్స్‌

పొట్ట చేత బట్టుకుని కర్ణాటకలోని ఉడిపి నుంచి విజయవాడ వచ్చారు. ఉడిపిలో ప్రసాదాలు తయారుచేసిన అనుభవంతో ఇక్కడ అల్పాహారం తయారు చేయడం ప్రారంభించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టారు. మరెందరో నిరుద్యోగులకు ఉచిత ఆవాసం కల్పించారు. తాను పస్తుండి, ఇతరుల ఆకలిని తీర్చారు. ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. ఆయనే విజయవాడ మోడరన్‌ కేఫ్‌ వ్యవస్థాపకులు హెచ్‌. టి. వాసుదేవరావు. త్వరలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న ఈ కేఫ్‌లో శాకాహారం మాత్రమే దొరుకుతుంది. ఈ వంశంలో మూడవతరానికి చెందిన హెచ్‌. టి. ఉదయశంకర్‌ ఈ కేఫ్‌ను పూర్వీకుల సంప్రదాయంలో నడుపుతున్నారు. ఈ వారం ఫుడ్‌ ప్రింట్స్‌ కోసం సాక్షి ఆయనతో ముచ్చటించింది...

మా తాతగారు హెచ్‌ టి వాసుదేవరావు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో ప్రసాదాలు, వంటలు తయారు చేసేవారు. అలా ఆయనకు వంట చేయడంలో నైపుణ్యం వచ్చిందే కాని, వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోయేది కాదు. దాంతో అక్కడ పనికి స్వస్తి పలికి, మా తాతగారు, ఆయన బావగారితో కలిసి 1927లో మచిలీపట్టణం చేరుకున్నారు. అక్కడ మూడు సంవత్సరాల పాటు చిన్న క్యాంటీన్‌ నడిపారు. కాని పెద్దగా జరుగుబాటు లేకపోవడంతో, విజయవాడ జంక్షన్‌ కాబట్టి అక్కడైతే వ్యాపారం బాగా నడుస్తుందన్న ఆలోచనతో 1930లో విజయవాడ చేరి, రైల్వే స్టేషన్‌ దగ్గర గాంధీనగర్‌లో ‘కోమల విలాస్‌’ అని చిన్న హోటల్‌ ప్రారంభించారు. హోటల్‌ నిర్వహణలో బాగా ఇబ్బందులు పడ్డారు. ఆరు సంవత్సరాలపాటు వ్యాపారం సాధారణంగా జరిగింది. 

ఒంటి చేత్తో
చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఎన్నో రోజులు గడిపారు తాతగారు. మధ్యలో అప్పులపాలయ్యారు. మళ్లీ వెనక్కి వెళ్లిపోయి దేవాలయంలోనే వంటలు చేసుకుందామనుకున్నారు. ఆ సమయంలో కొన్నాళ్లు ఆయన వండుతూ, ఆయనే వడ్డిస్తూ, ఆయనే గిన్నెలు శుభ్రం చేసుకుంటూ, బిల్లులు వసూలు చేసుకుంటూ... ఒంటి చేతి మీదే నడిపారు. 1936లో పెళ్లి చేసుకున్నారు. నానమ్మ కూడా తాతయ్యకు పనిలో సహాయపడేది. 

పేరు మార్చాక వ్యాపారం పుంజుకుంది
తాతగారికి ఏమనిపించిందో, ఎందుకనిపించిందో ఏమోగాని 1936లో మోడరన్‌ కేఫ్‌ అని పేరు మార్చారు. అప్పటి నుంచి ఆయన దశ మారింది. వ్యాపారం పుంజుకోసాగింది. వచ్చిన లాభాలతో 1940లో విజయవాడలోని వన్‌ టౌన్‌ సామారంగం చౌక్‌లోను, బీసెంట్‌ రోడ్డులోను రెండు కేఫ్‌లు ప్రారంభించారు.  కొంతకాలానికి మా తాతగారి బావగారు విడిగా వ్యాపారం ప్రారంభించారు. మా తాతగారు విజయవంతంగా వ్యాపారం కొనసాగించారు. బీసెంట్‌ రోడ్డులోని కేఫ్‌లో మాత్రమే లాడ్జింగ్‌ అండ్‌ బోర్డింగ్‌ ఉన్నాయి. మిగిలిన రెండు శాఖలలోను కేవలం రెస్టారెంట్లు మాత్రమే. అవి రెండు అద్దెకు తీసుకున్నవే. 1954లో బీసెంటు రోడ్డులోది సొంతంగా కొనుగోలు చేశారు. తాతగారి తరవాత ముగ్గురు కొడుకులకి మూడు హోటల్స్‌ ఆస్తి పంపకంలో వచ్చాయి. మా నాన్నగారు హెచ్‌టి మురళీధరరావుకి బీసెంటు రోడ్డులో ఉన్న మోడరన్‌ కేఫ్‌ వచ్చింది. ఆ తరవాతి తరంలో నేను చూస్తున్నాను. 

చెక్కుచెదర లేదు...
1988లో విజయవాడలో జరిగిన అల్లర్ల సమయంలో బీసెంటురోడ్డులోని మోడరన్‌ కేఫ్‌కి అటు పక్క ఇటు పక్క ఉన్న అన్ని దుకాణాలు తగులబడిపోయాయి. కాని మోడరన్‌ కేఫ్‌ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. ఇదంతా తాతగారు చేసిన అన్నదానం ఫలితమే అనుకుంటాం. కొద్దిపాటి మొత్తంతో ప్రారంభమైన ఈ కేఫ్‌ ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగింది. ఎప్పటికీ ఇది మోడరన్‌గానే ఉంటుంది.

ఇవి మా ప్రత్యేకం...
నాన్నగారి కాలం నుంచి ఇడ్లీ సాంబారు, మసాలా దోసె మా కేఫ్‌ ప్రత్యేకం. ఇటీవలే ఉత్తరాది వంటకాలు కూడా తయారుచేస్తున్నాం.  బీసెంట్‌ రోడ్‌లో ఉండే మా కేఫ్‌లో నాన్నగారు పేద విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించేవారు. ఆ సంప్రదాయాన్ని నేను కొనసాగించాను. ఆ రోడ్డులోని రామాలయంలో జరిగే సీతాకల్యాణం సమయంలో మూడు రోజుల పాటు ఉచిత అన్నదానం నాన్నగారి కాలం నుంచి జరుగుతోంది. 
– హెచ్‌. టి. మురళీధరరావు, చైర్మన్, మోడరన్‌ కేఫ్, విజయవాడ

సంప్రదాయం కొనసాగిస్తున్నాను
కృష్ణ, రామానాయుడు, శోభన్‌బాబు వంటి వారు ఇక్కడకు వచ్చేవారు. విజయవాడ నగరం సినిమా, రాజకీయాల హబ్‌. మా అమ్మవాళ్ల నాన్నగారు విఠలాచారిగారు. అందువల్ల మా కేఫ్‌కి సినీ నటుడు కాంతారావు కూడా వస్తుండేవారు. చాలా సంవత్సరాలుగా మా కేఫ్‌కి వస్తున్నవారు 20 –30 మంది ఇప్పటికీ ఉన్నారు. విజయవాడ వచ్చినప్పుడు మా లాడ్జిలోనే దిగేవారు ఇప్పటికీ ఉన్నారు. 1995 నుంచి నేను చూసుకుంటున్నాను. మా ఇడ్లీ సాంబారు ఇష్టపడేవారు కూడా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడకు వస్తూనే ఉన్నారు. ఏళ్లతరబడి మా హోటల్‌తో అనుబంధం పెంచుకున్న కొందరు వృద్ధులు అప్పుడప్పుడు, ‘వ్యాపారం ఎలా జరుగుతోంది’ అని అడిగి వెళ్తుంటారు. రామాలయంలో నవరాత్రులు తొమ్మిది రోజులూ పులిహోర + స్వీట్‌ ఇస్తూ ఉంటాం. రెండురోజులు ఉచిత భోజనం పెడతాం. మూడో తరంలో నేను కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. 
– హెచ్‌. టి. ఉదయశంకర్,
 మోడరన్‌ కేఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్,  విజయవాడ
– సంభాషణ: డా. వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top