హలో... మీ అమ్మాయి నా దగ్గరుంది

Kidnap Movies Special Story - Sakshi

ఒక తాడు, గుడ్డ పీలిక ఉంటే చాలుతీసే సినిమాలు కొన్ని ఉంటాయి. తాడు చేతులు కట్టేయడానికి. గుడ్డ పీలిక అరవకుండా నోటిలో కుక్కడానికి. కిడ్నాప్‌ డ్రామా అంటే ఎవరికైనా ఆసక్తే.కిడ్నాప్‌ చేశాక ‘హలో... రేపు సాయంత్రంలోగా డబ్బు అందలేదో’ అనే బెదిరింపులకు టెన్షన్‌ వస్తుంది. నేరం ప్రమాదం. శిక్షార్హం. ఆ నేరానికి పాల్పడేవాళ్ల తిప్పలే హిట్‌ సినిమాలు.

భారతీయ ఇతిహాసంలో నమోదైన తొలి కిడ్నాప్‌ను రావణాసురుడు చేశాడు. సీతను చెరబట్టి అతడు లంకా వినాశనానికి కారణమయ్యాడు. అయినవారు చనిపోతే ఆ దుఃఖం వేరు. యదార్థాన్ని స్వీకరించే కొద్దీ వేదన తగ్గుతుంది. కాని కిడ్నాప్‌ సంగతి అలా కాదు. మనం ప్రాణంగా ప్రేమించినవారు ఎక్కడో ఉంటారు. ఎవరి చేత్లులోనో బందీగా ఉంటారు. ఎప్పుడు విడుదల అవుతారో తెలియని అవస్థలో ఉంటారు. అసలు ప్రాణాలతో ఉన్నారో లేరో అనే ఆందోళన కలిగిస్తూ ఉంటారు. వారి కోసం మనం ఏదో ప్రయత్నం చేస్తే తప్ప, వారి బదులుగా ఏదో చెల్లిస్తే తప్ప బయటపడని దురవస్థలో ఉంటారు. మరణం కంటే భయంకరమైనది కిడ్నాప్‌. అందుకే నేరగాళ్లు కిడ్నాప్‌ను ఒక ఆయుధంగా వాడి పబ్బం గడుపుకోవాలని చూస్తారు. ఏ నేరమైనా చివరకు శిక్షతోనే ముగుస్తుంది. కిడ్నాప్‌ చేసినవారు కూడా అంతిమంగా కటకటాల వెనక్కు వెళతారు. కాని ఈలోపు జరిగే డ్రామాలో మాత్రం కుటుంబసభ్యులు, పోలీసులు పాత్రధారులు అవుతారు. ఆ కథ సినిమాలోది అయితే ప్రేక్షకులు కూడా భాగస్తులు అవుతారు. ఇటీవల ‘బ్రోచేవారెవరురా’ సినిమా కిడ్నాప్‌ డ్రామాతో విడుదలైంది. మరి గతంలో సినిమాల్లో ఈ ఆటను ఆడింది ఎవరు?

విక్రమ్‌ (1986)

అంతవరకూ అక్కినేని కుమారుడుగా మాత్రమే ఉన్న నాగార్జున ‘విక్రమ్‌’ సినిమాతో సినిమా హీరో నాగార్జున అయ్యాడు. ఇది కిడ్నాప్‌డ్రామా. హిందీలో దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ దీనిని రచించాడు. అరెస్టయ్యి ఉరి శిక్షకు దగ్గరగా ఉన్న తన గాడ్‌ఫాదర్‌ను రక్షించుకోవడానికి పోలీస్‌ అధికారి కుమార్తెను హీరో కిడ్నాప్‌ చేయడం కథ. జాకీ ష్రాఫ్, మీనాక్షి శేషాద్రి నటించిన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. తెలుగు రీమేక్‌లో కూడా నాగార్జునను నిలబెట్టింది. కిడ్నాప్‌ అయిన అమ్మాయి కిడ్నాప్‌ చేసినవాడితోనే ప్రేమలో పడుతుంది. హీరో కూడా ఆమెను ఏ పాడుబడ్డ మహల్లోనో ఉంచకుండా చక్కగా ప్రకృతి మధ్యలో, అందమైన పర్ణశాలలో ఉంచుతాడు. పైగా ఫ్లూట్‌ ఊదుతూ తనలోని భావుకత్వం ప్రదర్శిస్తుంటాడు. ఫ్లూట్‌ ఊదే కుర్రాడితో ప్రేమలో పడటం ఆ రోజుల్లో ఫ్యాషన్‌ కనుక శోభన నాగార్జునతో ప్రేమలో పడుతుంది. అయితే చాలా పరీక్షలకు నిలబడి ఈ ప్రేమ గెలుస్తుంది. నాగార్జునకు హిట్‌ ఇచ్చిన ఈ కిడ్నాప్‌ డ్రామా చాలా రోజుల తర్వాత ఆయనే మళ్లీ నటించిన ‘గగనం’లో నిరాశపరిచింది. విమానంలో బందీ అయిన ప్రయాణికులను గగనంలో విడుదల చేయించే అధికారిగా నాగార్జున నటించారు.

వింత దొంగలు (1989)
రాజమండ్రి రేవులో లాంచీ మీద గైడ్‌గా పని చేసే గుమాస్తా రావు గోపాలరావు, అదే ఊళ్లో హోటల్‌ సర్వర్‌గా పని చేసే రాజశేఖర్‌ మధ్యతరగతి డబ్బు కటకటలు తట్టుకోలేక ఒక డబ్బున్న అమ్మాయి నదియాను కిడ్నాప్‌ చేస్తారు. సాధారణంగా కిడ్నాప్‌ అయిన అమ్మాయి కిడ్నాప్‌ చేసిన వారిని చూసి భయపడాలి. కాని ఈ సినిమాలో కిడ్నాప్‌ అయిన అమ్మాయి కిడ్నాప్‌ చేసిన వారిన భయపెడుతుంటుంది. చిన్నప్పటి నుంచి గారాబం చేసి చెడకొట్టానన్న కోపంతో అమ్మాయి విడుదల కోసం డబ్బు ఇవ్వనంటాడు తండ్రి. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటారు కిడ్నాపర్లు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి కాలక్షేపం సినిమాగా నిలిచింది. ‘ఏంటి మేటరు’ అనేది ఈ సినిమాలో రావుగోపాలరావు ఊతపదం. ఆ తర్వాత అది పాపులర్‌ అయ్యింది. ఇప్పటికీ జనం ఏంటి మేటరు అంటుంటారు. ఒకే సంవత్సరం ‘అంకుశం’ లో నవ్వే తెలియని పోలీసాఫీసర్‌గా రాజశేఖర్‌ను నటింపచేసిన కోడి రామకృష్ణ ఆ వెంటనే ఈ సినిమాలో నవ్వులు పూయించే కామెడీ హీరోగా చేయించడం గమనించాలి. రాజశేఖర్‌ రెంటిలోనూరాణించారు.

మగాడు (1990)

ఈ సినిమా హీరో రాజశేఖర్‌ కాలు విరిగేలా చేసింది. కాని దాని వల్ల తర్వాతి కాలంలో జీవిత భాగస్వామి అయిన జీవితను దగ్గర చేసింది. ‘మగాడు’ రాజశేఖర్‌ కెరీర్‌లో పెద్ద హిట్‌.  అందులో కూడా నేరస్తుడైన తన అన్నను కాపాడుకోవడానికి తమ్ముడు ఏకంగా కేంద్ర మంత్రినే కిడ్నాప్‌ చేస్తాడు. విడుదలకు 100 కోట్లు అడుగుతాడు. ఈ గొంతెమ్మ కోరిక తీర్చడం కంటే చావో రేవో తేల్చుకునే అధికారిని పంపడమే మేలని ప్రభుత్వం అనుకుంటుంది. ఆ అధికారే హీరో రాజశేఖర్‌. ఒన్‌ మేన్‌ కమెండోగా రాజశేఖర్‌ అడవుల్లో ప్రయాణించి కిడ్నాప్‌ డెన్‌కు చేరుకుని సాహసంగా బందీలను విడిపిస్తాడు. మలయాళంలో పెద్ద హిట్‌ అయిన మోహన్‌లాల్‌ సినిమాను అదే దర్శకుడి దర్శకత్వంలో జీవిత నిర్మించగా పెద్ద హిట్‌ అయ్యింది. లిజిని ఆ సినిమాలోనే తెలుగు ప్రేక్షకులు చూశారు. తమిళ హీరో త్యాగరాజన్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు.

రోజా (1992)
కమలహాసన్‌ నటించిన ‘గుణ’ 1991లో వచ్చింది. తల్లిదండ్రుల పెంపకం సరిగా లేని కమలహాసన్‌ స్త్రీలోని అమ్మను బంధించడానికి ఒక ప్రియురాలిని ఊహించుకుంటూ ఆ ఊహ నిజమనే భ్రాంతి చెంది ఏకంగా ఒక అమ్మాయినే కిడ్నాప్‌ చేస్తాడు. సినిమాలో ఉమాదేవి అనే పాత్ర ముందు అతణ్ణి అసహ్యించుకున్నా చివరకు ప్రేమిస్తుంది. ‘ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే’ పాట తెలుగులో ఇప్పటికీ నిలిచిన పాట. ఆ వెంటనే మణిరత్నం ‘రోజా’ వచ్చింది. సత్యవంతుడి ప్రాణాల్ని యుముడి నోటి నుంచి తన్నుకొని తిరిగి తెచ్చుకున్న సావిత్రిలా ఈ సినిమాలో మధుబాల టెర్రరిస్టుల వల్ల కిడ్నాపైన అరవింద్‌ స్వామి ప్రాణాలను తిరిగి తెచ్చుకుంటుంది. కిడ్నాపైన వారి కోసం పోలీసులు పోరాడాలి. భార్య పోరాడటం వల్ల సెంటిమెంటు పండి బాక్సాఫీసు పసుపుకుంకుమలతో కళకళలాడింది.

మనీ (1993)

చాలా మంది కెరీర్‌కు బూస్ట్‌ ఇచ్చిన ఈ సినిమా దర్శకుడు శివనాగేశ్వరరావుకు ఎప్పటికీ చెప్పుకునే సినిమా అయ్యింది. అప్పులపాలయిన భర్త పరేశ్‌ రావెల్‌ చెక్‌బుక్‌ను కంట్రోల్‌ చేసే భార్య జయసుధను కిడ్నాప్‌ చేయాలనుకుంటాడు. కాని పూటకు ఠికానా లేని ఇద్దరు బేచిలర్‌ కుర్రాళ్లు జె.డి చక్రవర్తి, చిన్నా ఒక్క కిడ్నాప్‌లో లైఫ్‌లో సెటిల్‌ పోవాలని పరేశ్‌ రావెల్‌ కంటే తామే ముందు జయసుధను కిడ్నాప్‌ చేస్తారు. ఇందులోకి ఖాన్‌ దాదా అయిన బ్రహ్మానందం దూరడం విశేషం. మనీ బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ అయ్యింది. రేణుకా సహానీ, పరేశ్‌రావెల్‌ వంటి ఫ్రెష్‌ ముఖాలు కనిపించాయి. అల్లరి వేషాలు వేసే బ్రహ్మానందం సీరియస్‌ కామెడీ చేయడం ఈ సినిమాతో మొదలెట్టాడు. ఒరు విరల్‌ కృష్ణారావు చిన్న పాత్ర అయినా మెరుస్తాడు. పరేశ్‌ రావెల్‌కు సంగీత దర్శకుడు చక్రవర్తి డబ్బింగ్‌ చెప్పారు. ‘వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసూ’ పాట, ‘ఖాన్‌తో గేమ్స్‌ ఆడొద్దు’ డైలాగు హిట్‌. పనికిమాలిన ప్రొడక్షన్‌ మేనేజర్‌గా తనికెళ్ల భరణి నటన కూడా నవ్వులే.

సిసింద్రీ (1995)
చిన్నపిల్లలను కిడ్నాప్‌ చేయకుండా కిడ్నాప్‌ సినిమాలు ఉండవు. తెలుగు సినిమాలలో ఈ అంశాన్ని కృష్ణ నటించిన ‘దొంగల వేట’లో మొదట చూపించారు. ఆ తర్వాత బేబి షాలినితో ఉషాకిరణ్‌ మూవీస్‌ తీసిన ‘చందమామ రావే’ కూడా కిడ్నాప్‌ డ్రామాయే. అందులో బేబీ షాలినిని కిడ్నాప్‌ చేసినవారు చివరకు ఆ చిన్నారి వల్లే  పూర్తిగా మారిపోతారు. అయితే హాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘బేబీస్‌ డే అవుట్‌’ ఆధారంగా తెలుగులో తీసిన ‘సిసింద్రీ’ మంచి హిట్‌గా నిలిచిందని చెప్పాలి. దీనికి కూడా దర్శకుడు శివ నాగేశ్వరరావే. సినిమాలో బుజ్జి పిల్లాడిగా అఖిల్‌ అక్కినేని నటించడం అప్పట్లో వార్త అయ్యింది. కిడ్నాపర్లుగా గిరిబాబు, సుధాకర్, తనికెళ్ల భరణి నటించారు. ఆమని మీద తీసిన ‘చిన్నతండ్రీ నిను చూడగా’ పాట పెద్ద హిట్‌. నాగార్జున, టబూ కలిసి ఒక పాటలో చిందులు తొక్కారు. చిన్నపిల్లల కిడ్నాప్‌ అంశంగా కమలహాసన్‌ తీసిన ‘ముంబై ఎక్స్‌ప్రెస్‌’ క్లాసిక్‌ కామెడీ అయినా ప్రేక్షకులు అందుకోలేదని చెప్పాలి.

ఐతే (2003)

మాఫియా డాన్‌ పవన్‌ మల్హోత్రా దేశం వదిలి పారిపోవాలనుకుంటాడు. కాని అతని మీద నిఘా ఉంటుంది. అందుకని హైదరాబాద్‌ నుంచి బొంబాయి వెళ్లే ఫ్లయిట్‌ని కిడ్నాప్‌ చేసి ఖాట్మండు తీసుకెళ్లి అక్కడి నుంచి దుబాయ్‌కి పారిపోవాలని ప్లాన్‌. తాను మాత్రం ప్రయాణికుల్లో ఒకడిగా ఉంటాడు. కిడ్నాప్‌ చేయడానికి నలుగురు కుర్రాళ్లని సెట్‌ చేస్తాడు. ఫ్లయిట్‌లో కేంద్ర మంత్రి ఉంటాడు కనుక అతణ్ణి ఫ్లయిట్‌లోనే ఉంచి ఖాట్మాండులో ప్రయాణికులను వదిలిపెడితే ఆ గందరగోళంలో తాను తప్పించుకోవాలని అనుకుంటాడు. కాని డామిట్‌ అనకుండానే కథ అడ్డం తిరుగుతుంది. మరో నలుగురు కుర్రాళ్లు ఏకంగా పవన మల్హోత్రానే కిడ్నాప్‌ చేస్తారు. చట్టానికి సహకరించే ఉద్దేశ్యంతోనే ఆ పని చేస్తారు. చివరకు ప్రైజ్‌ మనీ దక్కించుకుంటారు. ‘ఐతే’ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్‌ను మంచి దర్శకుడిగా నిలబెట్టింది. ఇందులో నటించిన శశాంక్‌ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. సింధు తులానీ హీరోయిన్‌ అయ్యింది. కల్యాణి మాలిక్‌ సంగీతంలో కీరవాణి పాడిన ‘చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే’ పాట హిట్‌. కిడ్నాప్‌ డ్రామాకు బిగువైన స్క్రిప్ట్‌ అవసరమని నిరూపించిన సినిమా ఇది.

బ్రోచేవారెవరురా (2019)
ఈ నేపథ్యంలో మొన్నటి వెంకటేష్‌ ‘ఘర్షణ’, ఇటీవలి ‘స్వామి రారా’ వంటి సినిమాలు కూడా కిడ్నాప్‌ డ్రామాతో నడిచాయి. తాజాగా ‘బ్రోచేవారెవరురా’ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఇందులో హీరోయిన్‌ నివేదితా థామస్‌ను ఆమె కోరిక మీదే కిడ్నాప్‌ చేసిన ఆమె ఫ్రెండ్స్‌ శ్రీవిష్ణు, ప్రియదర్శి తదితరులు ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లి బయటపడతారో వినోదభరితంగా చూపించారు. మంచి స్క్రీన్‌ ప్లే, ట్విస్ట్‌లు ఉండటం వల్ల కలెక్షన్లు విపరీతంగా వచ్చాయి. మనిషి అవసరానికి మించిన భూమిని బంధిస్తాడు. అవసరానికి మించిన నీళ్లను బంధిస్తాడు. అవసరానికి పశువులను, పక్షులను బంధిస్తాడు. కాని తనని ఎవరైనా బంధిస్తే మాత్రం గగ్గోలు పెడతాడు. ఈ గగ్గోలు ఉన్నంత కాలం కిడ్నాప్‌ సినిమాలు వస్తూనే ఉంటాయి.
– కె.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top