కొండంత పేదరికానికి మతిమరుపు శిక్ష

Khaled Hosseini And The Mountain Encode Book - Sakshi

కొత్త బంగారం

ఖాలిద్‌ హుస్సేనీ మూడవ నవల, ‘ద మౌంటెన్స్‌ ఎకోడ్‌’ కథ 1952లో మొదలవుతుంది. అఫ్గానిస్తాన్‌లోని ఓ కుగ్రామంలో అన్నాచెల్లెలు పదేళ్ళ అబ్దుల్లా, మూడేళ్ళ పరీ– తండ్రి సబూర్, సవతి తల్లి పర్వానీతో కలిసి ఉంటుంటారు. మూడో బిడ్డ ఈ లోకంలోకి రాబోతున్నప్పుడు, కటిక పేదరికాన్ని తప్పించుకోడానికి, సబూర్, ‘చేతిని కాపాడుకోడానికి ఒక వేలుని కత్తిరించేయక తప్పదు’ అని తనకు తాను నచ్చజెప్పుకుని, పిల్లలకు, ‘ఒక రాక్షసుడి కోపాన్ని చల్లార్చడానికి మనకిష్టమైన పిల్లనో, పిల్లాడినో బలిస్తే తప్ప ఊరిని నాశనం చేయకుండా ఉండడు’ అన్న కాల్పనిక కథ చెప్తాడు. పిల్లల్లేకపోయిన ధనవంతులైన సులేమాన్, నీలా దంపతులకి డ్రైవరూ, వంటవాడూ అయిన నబీ– సబూర్‌ బావమరిది. అతను పరీని వారికి అమ్మడంలో సహాయపడతాడు. పరీ మొదట కాబూల్‌లోనూ, ఆ తరువాత పారిస్‌లోనూ పెరిగి పెద్దదవుతుంది. అన్నాచెల్లెలు వేరయినప్పుడు, చిన్నపిల్లయిన పరీ ఇంటిని త్వరగానే మరిచిపోతుంది.

కానీ అబ్దుల్లా పరీని తలుచుకోని క్షణం ఉండదు. అయితే, అతడి జీవితం గురించి పాఠకులకు పరిచయం అయ్యేది అతడు అమెరికా వెళ్ళాకే. పరీ పరోక్షం ఇతర పాత్రల మీద చూపించే ప్రభావం గురించి తెలుసుకోకుండానే సబూర్‌ మరణిస్తాడు. పరీ ఉద్యోగం చేస్తూ, పెళ్ళి చేసుకున్న తరువాత, తను దత్తత తీసుకోబడిందన్న అనుమానం కలిగినప్పుడు, ఎప్పుడో అప్పుడు అఫ్గానిస్తాన్‌ వెళ్ళి తన గతం తెలుసుకోవాలనుకుని, ‘తన ఉనికికి మౌలికంగా బాధ్యత వహించిన ఎవరో, ఏదో లేరు/దు’ అని భావిస్తుంటుంది. అబ్దుల్లా కాలిఫోర్నియాలో ఒక రెస్టారెంటు నడుపుతుంటాడు. అతనూ, భార్యా తమ ఏకైక కూతురికి, ‘పరీ’ అన్న పేరే పెడతారు. అసలు పరీ ముసలితనానికి చేరువయి, అన్న ఎక్కడున్నాడో తెలిసి కలుసుకోడానికి వెళ్ళినప్పుడు, అతను అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతూ, పరీని అసలు గుర్తించకపోవడం మరీ విషాదకరంగా మారుతుంది.రచయిత అన్నా చెల్లెళ్ళ  పరిస్థితిని ఒక పదునైన రూపకంతో వివరిస్తారు: ‘వంతెన నదికి మధ్యనే అంతం అయింది. ఇంచుమించు ఒడ్డుకి చేరబోతూ ఉన్నప్పుడే, అటువైపు భాగం పొట్టిదయిపోయింది’.కాలం ముందుకీ వెనక్కీ మారుతూ, నాలుగు తరాల యొక్క యాబై సంవత్సరాలని –తొమ్మిది అధ్యాయాల్లో, వేర్వేరు పాత్రల దృష్టికోణాలతో చూపిస్తుంది ఈ నవల.

అయితే, ‘కథ కదులుతున్న రైలువంటిది. ఎక్కడెక్కినా సరే, ఎప్పుడో అప్పుడు గమ్యానికి చేరుస్తుంది’ అంటూ, పుస్తకాన్ని అర్థం చేసుకునే బాధ్యతని పాఠకులకే వదిలేస్తారు హుస్సేనీ.రచయిత కేంద్రీకరించేది సబూర్‌ చర్య వల్ల కలిగిన పర్యవసానాల మీద. సంబంధాలు తెగిపోయినప్పుడు ఏమవుతుందో అన్న సంగతిని ప్రతి చిన్న పాత్రకి కూడా జీవం పోసి మాట్లాడించడం ద్వారా తెలియజేస్తారు. పాత్రల మీద ఏ కనికరమూ చూపకుండా, నిశితంగా విమర్శిస్తూ, మానవ సంబంధాలని నేర్పుగా విశ్లేషిస్తారు. నైతిక సంక్లిష్టతల గురించిన ఈ కథ, ‘ఉద్దేశాలు మంచివయితే సరిపోతుందా! మంచితనాన్ని నిర్వచించేది ఎలా? తమ పిల్లలు బాధలనుభవించకుండా కాపాడేటందుకు తల్లిదండ్రులు ఎంత దూరం వెళ్ళవచ్చు! సొంత కుటుంబం నుంచి వేరుపడటం కటిక పేదరికం భరించడం కన్నా ఎక్కువ బాధాకరమైనదా?’ అన్న ప్రశ్నలని లేవనెత్తు్తతుంది. విలియమ్‌ బ్లేక్‌ కవిత ‘పిల్లల కంఠాలతో ప్రతిధ్వనించే కొండలు’ ఈ పుస్తక శీర్షికకు ప్రేరణ. 2013లో అచ్చయింది. ‘టైమ్స్‌ లిస్ట్‌’లో ఉత్తమమైన నవలగా 33 వారాల పాటు నిలిచింది. 
కృష్ణ వేణి

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top