వెలిగి బూడిదైన తారాజువ్వ సౌలు | jesus life special story | Sakshi
Sakshi News home page

వెలిగి బూడిదైన తారాజువ్వ సౌలు

Aug 28 2016 12:40 AM | Updated on Sep 4 2017 11:10 AM

వెలిగి బూడిదైన తారాజువ్వ సౌలు

వెలిగి బూడిదైన తారాజువ్వ సౌలు

ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన సౌలుది మామూలుగా మొదలై, మహాద్భుతమైన మలుపు తిరిగి, కొన్నాళ్లు ఉజ్వలంగా వెలిగి, క్రమంగా దిగజారి ఎంతో అధ్వానంగా అంతమైన జీవితం.

ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన సౌలుది మామూలుగా మొదలై, మహాద్భుతమైన మలుపు తిరిగి, కొన్నాళ్లు ఉజ్వలంగా వెలిగి, క్రమంగా దిగజారి ఎంతో అధ్వానంగా అంతమైన జీవితం. అతని జీవితం ఈనాటికీ అందరికీ ఒక గుణపాఠం. దేశంలో ఒక మూలన సాదాసీదాగా బతుకుతున్న సౌలు ఒకరోజు దేశానికి చక్రవర్తినవుతానని కలలో కూడా ఊహించలేదు. చిన్న, పెద్ద, పేద, గొప్ప, నలుపు, తెలుపు లాంటి భేదాలు, పదాల జీవితమే నిదర్శనం. సింహాసనాన్ని చేపట్టిన వెంటనే సౌలు అత్యంత సంక్లిష్టమైన యుద్ధాన్ని గెలిచి తన దక్షతను నిరూపించుకొని ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. అందువల్ల ఈ విజయాలకు కృతజ్ఞతగా దేవునికి గిల్గాతులో దహనబలి అర్పించేందుకు వెళ్దామని సమూయేలు ప్రవక్త సౌలును, ఇశ్రాయేలీయులనందరినీ ఆహ్వానించాడు.

సౌలు, ఇశ్రాయేలీయులూ అక్కడ చేరారు. సౌలు, ఇశ్రాయేలీయులూ అక్కడ చేరారు కాని సమూయేలు రాలేదు. ఆయనకోసం ఏడురోజులు ఎదురు చూసి ఇక ప్రజలంతా వెళ్లిపోతారన్న భయంతో సౌలే దహనబలిని అర్పించాడు. అది దైవాజ్ఞలకు వ్యతిరేకం. దహనబలిని యాజకులు, ప్రవక్తలు మాత్రమే అర్పించాలి. ఎంతటి రాజైనా అది అతని పరిధిలో లేని విషయం. అది తెలుసుకున్న సమూయేలు ఉగ్రుడై రాజుగా సౌలును దేవుడు తృణీకరించాడని, త్వరలోనే మహారాజు వస్తాడని ప్రకటించాడు. సౌలు భ్రష్టత్వం అలా తొందరపాటుతో ఆరంభమైంది. తొందరపాటు దైవాజ్ఞ ఉల్లంఘించడానికి కారణమైంది. తర్వాత అతనిలో అభత్రాభావన నెలకొంది. ప్రజలందరినీ ఒక తాటిమీద తండ్రిలాగా నడిపించవలసిందిపోయి తనకంటూ ఒక ముఠా ఏర్పరచుకున్నాడు.

ప్రజల్ని విడదీసి పాలించడం ఆరంభించాడు. గద్దెనెక్కినోడు, పైసలున్నోడు ప్రతివారికీ ఆప్తుడే!! అవి అంతర్థానమైన మరుక్షణం ప్రతి ఒక్కరికీ అతను అస్పృశ్యుడే!! అన్న సత్యాన్ని సౌలు గ్రహించలేక తన చుట్టూ చేరిన స్వార్థపరుల్లో నిజంగా తనవారెవరో తెలుసుకోలేని విచక్షణ లేక కక్షతో వ్యవహరించి ఎంతో మందిని శత్రువులను చేసుకున్నాడు. తనకు వారసుడిగా దేవుడెంపిక చేసిన దావీదు మీద అసూయతో అతన్ని చంపడంపైనే దృష్టి కేంద్రీకరించి సమయాన్ని వృథా చేసుకున్నాడు. పరిపాలన మీద పట్టుకోల్పోయాడు. అమాలేకీయులను వారి పశువులతో సహా సమూలంగా నాశనం చేయమని దేవుడాజ్ఞాపిస్తే ‘దేవునికి బలివ్వడానికి అన్న సాకుతో మంచి పశువుల్లో కొన్నింటిని తెచ్చి తన శాలలో పెట్టుకున్నాడు.

అలా దైవాజ్ఞనే యథేచ్ఛగా ఉల్లంఘించాడు. తొందరపాటు, దైవభయం లేకపోవడం, అసూయ, పగ, కక్షసాధింపు, ఆశ్రీత పక్షపాతం, స్వార్థం ఇలా అవలక్షణాలన్నింటికీ అతని జీవితం కేరాఫ్ అడ్రస్‌గా అయింది. చివరికి గిల్బోవ పర్వతం వద్ద ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో అతను తీవ్రంగా గాయపడి శత్రువులు తనను చంపకమునుపే తనను చంపమని తన పనివాణ్ణి వేడుకుంటే, వాడు వినకపోతే తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి పనివాడు కూడా మాట వినని దీనస్థితిలో అతని జీవితం అంతమైంది. సౌలు సింహాసనాన్ని చూసుకుని మురిసిపోయాడు. దాన్నిచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు. రాజుగా ఎదిగాడు కానీ వ్యక్తిగా, విశ్వాసిగా దిగజారాడు. అన్నీ ఉన్నా దేవుడు తన కృప నుంచి దూరపర్చితే జీవితం ఎంత విషాదభరితమో ఇది తెలుపుతుంది.
- రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement