కనిపించని కామెడీ | Intangible Comedy | Sakshi
Sakshi News home page

కనిపించని కామెడీ

Mar 17 2015 12:21 AM | Updated on Sep 2 2017 10:56 PM

లైఫ్‌లో సీరియస్ విషయాలు కొన్ని భలే కామెడీగా టర్న్ తీసుకుంటాయి.

మిస్సింగ్
మాధవ్ శింగరాజు
లైఫ్‌లో సీరియస్ విషయాలు కొన్ని భలే కామెడీగా టర్న్ తీసుకుంటాయి. ఎవరి లైఫ్‌లో? ‘ఎవరి’ ఏంటి? ఒక్కొక్కరికీ ఒక్కో లైఫ్ ఉండే కాలంలో ఉన్నామా మనం! అందరికీ ఒక్కరే నరేంద్ర మోదీ. అందరికీ ఒక్కరే బరాక్ ఒబామా. ఇక వేర్వేరుగా ఎలా ఉంటాయి జీవితాలు? ఇవాళ మీ ఇంట్లో వంకాయ, మా ఇంట్లో బెండకాయ.

అంతమాత్రాన మన జీవితాలు ఎవరివి వారివై పోతాయా? టీవీలో అక్కడ మీకు కనిపిస్తున్నదీ, ఇక్కడ మాకు కనిపిస్తున్నదీ అదే మోదీలు, అదే ఒబామాలే అయినప్పుడు ఎవరి జీవితం వారికి సపరేట్‌గా ఏ రైతు బజార్ నుండి వస్తుంది చెప్పండి? అందుకే లైఫ్ అంటే ఇప్పుడు మనమూ మన కరెంట్ బిల్లులే కాదు. ఇరుగుపొరుగిళ్ల కరెంట్ అఫైర్స్ కూడా.  
 
12, తుగ్లక్ రోడ్డు నివాసంలో రాహుల్‌గాంధీ, క్రెమ్లిన్ భవనంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కొంతకాలంగా కనిపించడం లేదు! ప్రస్తుతం ఇదే మన జీవితాల్లోని పెద్ద కామెడీ. ఎవరైనా ‘కనిపించకపోవడం’ సీరియస్ విషయం కదా. కామెడీ ఎలా అవుతుంది? అయింది! ఫిబ్రవరి 23న పార్లమెంటు సమావేశాలు మొదలైనప్పటి నుంచీ మన దగ్గర రాహుల్ గాంధీ కనిపించడం లేదు. రష్యాలో పుతిన్ కూడా పది రోజులుగా కనిపించడం లేదు. ఇద్దరూ ఏమైనట్టు?
 
రాహుల్‌కి పార్లమెంటులో పెద్దగా పనేమీ లేదనుకుందాం. మరి పుతిన్‌కి ఏమైంది? కజఖ్‌స్తాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకుని ఆయన ఎక్కడికి వెళ్లినట్టు? దక్షిణ అస్సెటియా నుంచి తన సంతకాల కోసం మాస్కో వస్తున్న ఒప్పందాల బృందానికి... ‘‘కంగారేం లేదు, మెల్లిగానే రండి’’ అనే సమాచారాన్ని ఆఖరి నిముషంలో పంపించి ఆయన ఎటు వెళ్లినట్టు? అతి కీలకమైన రష్యా ఇంటెలిజెన్స్ సమావేశానికి కూడా అందుబాటులో లేకుండా ఆయన ఏమైపోయినట్టు? ఎక్కడ ఉన్నట్టు? ఏవేవో వినిపిస్తున్నాయి.

పుతిన్‌కి ఫ్లూ... అందుకే బయటికి రావడం లేదు! పుతిన్ స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. అక్కడ ప్రియురాలు ఎలీనా కబేవా ప్రసవిస్తే తన బిడ్డను చూడ్డానికి వెళ్లారు! పుతిన్‌కి గుండెపోటు! పుతిన్‌పై తిరుగుబాటు! పుతిన్  క్రెమ్లిన్‌లో బందీగా ఉన్నాడు! పుతిన్ చనిపోయారు! ఇవన్నీ ఇక్కడితో ఆగలేదు. పుతిన్‌ని ఏలియన్స్ తీసుకెళ్లినట్లు ఓ పత్రికలో కార్టూన్. సమాధిలో లెనిన్ పక్కనే పుతిన్ మృతదేహం కూడా ఉన్నట్లు ఇంకో కార్టూన్. పుతిన్‌ని ఎవరో పాతిపెట్టి వెళుతున్నట్లు యూట్యూబ్‌లో వీడియో! దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తనకై తానే పుతిన్ చనిపోయాడని ఇంకో సెటైర్.
 
రాహుల్ మీద ఇంత జరగలేదు. ‘‘ఈ మనిషి ఎక్కడి కి పోయినట్టూ...’’ అని మాత్రం అనుకున్నారంతే. అయితే అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు రాహుల్ ఇంటికి వెళ్లి, ఆయన గురించి అక్కడి వాళ్లను ఆరా తీయడం  కామెడీ అయింది. రాహుల్‌జీ ఇంట్లో ఉన్నారా? చూడ్డానికి ఆయన ఎలా ఉంటారు? ఎంతెత్తు ఉంటారు? ఒడ్డూపొడవు ఎలా ఉంటుంది? ఒంటి రంగేమిటి? మనిషిలో కొట్టొచ్చినట్లు కనిపించేవేమైనా ఉన్నాయా? ఆయన కళ్ల రంగేమిటి? కళ్లద్దాలు పెట్టుకుంటారా? నడిచే తీరు ఎలా ఉంటుంది? మనిషి ఆనవాళ్లేమిటి? ఏ భాష మాట్లాడతారు? ఎలాంటి బట్టలు వేసుకుంటారు? ఏ టైప్ షూజ్ వాడతారు? మీసం ఉంటుందా? గెడ్డం ఉంటుందా? ఆయన సన్నిహితులెవరు? వాళ్ల ఫోన్ నెంబర్లు, అడ్రెస్‌లు ఏమిటి?... ఇన్ని ప్రశ్నలు వేశారు. ఇదంతా ప్రముఖుల సెక్యూరిటీ సర్వేలో భాగంగా జరిగిన వివరాల సేకరణ అని ఢిల్లీ పోలీసు కమిషనర్ చెప్పినప్పటికీ, కనిపించని మనిషిని వెతికి పట్టుకునేందుకు అడిగిన ప్రశ్నల్లానే ఉన్నాయి అవన్నీ.
 
ఈ కామెడీ ఇలాగే కంటిన్యూ అవాలని పడీపడీ కోరుకునేవారు కొన్నాళ్లపాటు టీవీని స్విచాఫ్ చెయ్యడం తెలివైన పని. రాహుల్ అయినా, పుతిన్ అయినా ఇవాళో, రేపో రాకమానరు, టీవీలో కనిపించకా మానరు కాబట్టి. (పుతిన్ ఆల్రెడీ వచ్చేశారు! నిన్న సోమవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రత్యక్షమయ్యారు). టీవీ స్విచాఫ్ చెయ్యడం వల్ల ఇంకో ప్రయోజనం... తిరిగి ఎవరి లైఫ్‌లు వాళ్లకొచ్చేస్తాయి. మోదీ, ఒబామా కూడా కనిపించరు కాబట్టి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement