పూనమ్‌కి చాన్స్‌ | Sakshi
Sakshi News home page

పూనమ్‌కి చాన్స్‌

Published Thu, Nov 22 2018 12:24 AM

 India could get its first woman Chief Economic Advisor, says report - Sakshi

పోటీకి దీటుగా నిలబడితే కనుక పూనమ్‌ గుప్తా భారతదేశపు తొలి చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ అవుతారు. చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ (సి.ఇ.ఎ.) అనేది దేశంలో పెద్ద పోస్టు. ఈ పోస్టులో ఉన్నవాళ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన సలహాలు ఇస్తుండాలి. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే దాన్నుంచి గట్టెక్కించాలి. కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిచేస్తూ, అవసరమైతే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని, ఒప్పించేలా ఉండాలి. అయితే అంత కీలకమైన ఈ పోస్టులో ఇంతవరకు ఒక్క మహిళ కూడా లేరు! ప్రస్తుత సి.ఇ.ఎ. అరవింద్‌ సుబ్రహ్మణియన్‌. ఆయన పదవీకాలం గత ఆగస్టులోనే ముగిసింది. అప్పటి నుంచీ ఆయనే సలహాదారుగా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో అరవింద్‌ తర్వాత ఎవరు అన్న ప్రశ్న వస్తున్నప్పుడు ప్రభుత్వం ఒక మహిళ వైపు మొగ్గు చూపుతోంది. ఆ మహిళే పూనమ్‌ గుప్తా. ప్రస్తుతం ఆమె ప్రపంచ బ్యాంకులో పని చేస్తున్నారు. అంతకుముందు వరకు పూనమ్‌ ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ’ (ఎన్‌.ఐ.పి.ఎఫ్‌.పి.) లో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌ ప్రొఫెసర్‌. అయితే సి.ఇ.ఎ. పదవికి పూనమ్‌కు గట్టి పోటీ ఉంది.

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కంపెనీ అయిన జె.పి.మోర్గాన్‌లో చీఫ్‌ ఇండియా ఎకనమిస్టుగా ఉన్న సాజిద్‌ చినాయ్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ప్రొఫెసర్‌ అయిన కృష్ణమూర్తి పేర్లను కూడా భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. మోదీ ప్రభుత్వానికి మరో ఆరు నెలల్లో కాల పరిమితి తీరిపోతున్నప్పటికీ.. అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒడిదుదుకుల్లో ఉన్నందున వెంటనే సి.ఇ.ఎ. పోస్టును భర్తీ చేయాలని కేంద్ర ఆర్థికశాఖ త్వరపడుతోంది. అరవింద్‌ సుబ్రహ్మణ్యంని మొదట మూడేళ్ల పదవీ కాలానికి నియమించి, కాల పరిమితి తీరాక పన్నెండు నెలల పొడిగింపు ఇచ్చారు. ఆ పొడిగింపు కూడా గత ఆగస్టులో పూర్తయి నెలలు దాటింది. ఆ వారసుడిని / వారసురాలిని వెదికిపట్టే పట్టేందుకు ఆర్‌.బి.ఐ. మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ సారథ్యంలో ప్రభుత్వం ఒక ‘సెర్చ్‌ కమిటీ’ని కూడా ఏర్పాటు చేసింది. అరవింద్‌ సుబ్రహ్మణ్యం కన్నా ముందు రఘురామ్‌ రాజన్‌ సి.ఇ.ఎ.గా పని చేశారు. వీళ్లిద్దరూ కూడా ఐ.ఎం.ఎఫ్‌., వరల్డ్‌ బ్యాంకుల్లో పని చేసిన అనుభవం ఉన్నవారే. ఒకవేళ ఇప్పుడు పూనమ్‌ గుప్తా సి.ఇ.ఎ.గా ఎంపికైతే ఆమె కూడా ఐ.ఎం.ఎఫ్, వరల్డ్‌ బ్యాంకుల నుండి వచ్చిన వారే అవుతారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement