శాస్త్రీయతలేని జుట్టు చికిత్సలతో  వెంట్రుకలకు హాని!  

Harmless hair losses with untreated hair treatments - Sakshi

చాలా మంది తమ జుట్టు అందంగా ఉండాలనే ఉద్దేశంతో అంతగా శాస్త్రీయత పాటించని పార్లర్లలో అనేక జుట్టు చికిత్స ప్రక్రియలను చేపడుతుంటారు. వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది జుట్టు స్ట్రెయిటెనింగ్‌ ప్రక్రియ. తల నుంచి జుట్టు చాలా సహజంగా పట్టుకుచ్చు జారినట్టుగా కనిపించే ఫీల్‌ కోసం చాలా మంది ఈ జుట్టు స్ట్రెయిటెనింగ్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటుంటారు. కానీ మాటిమాటికీ చేయించుకునే ఈ జుట్టు స్ట్రెయిటెనింగ్‌ చికిత్స కారణంగా రోమంలోని (హెయిర్‌ స్ట్రాండ్‌లోని)  సహజ బంధాలు వదులైపోతుంటాయి. దాంతో జుట్టు రాలే ప్రమాదం ఉంది. అలాగే జుట్టు బాగా దట్టంగా రావాలనే ఉద్దేశంతో మార్కెట్‌లో దొరికే శాస్త్రీయంగా తయారు కాని అనేక ఉత్పాదనలను వాడుతుంటారు. అయితే అవి సైంటిఫిక్‌ పద్ధతిలో రూపొందనందు వల్ల వాటిలోని రసాయనాలు తమ చర్మానికి సరిపడకపోవచ్చు.

ఫలితంగా రోమం కుదురులో ఉన్న చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు (ర్యాష్‌) రావడం, కొన్ని సందర్భాల్లో వాపు వంటివి కనిపించవచ్చు. ఒక్కోసారి ఈ రసాయనాల నుంచి వెలువడే  వాయువులు కళ్లను మండించడం, కళ్ల నుంచి నీరుకారేలా చేయడం, గొంతులో ఇబ్బంది కలిగించడం, తుమ్ములు వచ్చేలా చేయడం, ఒక్కోసారి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలిగించి, ఆస్తమాకు కూడా దారితీయవచ్చు. ఇక మరి కొందరిలో జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు కొన్ని రంగుల వల్ల వెంట్రుకలకు పైన పొరలా రక్షణ కల్పించే క్యూటికల్‌ దెబ్బతినవచ్చు. ఫలితంగా జుట్టు పొడిబారిపోయినట్లుగా అనిపిస్తూ, బలహీనంగా మారుతుంది. జుట్టు రాలే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే జుట్టుకు సొంత వైద్యాలతో పాటు, ఎలాంటి  శాస్త్రీయతా లేకుండా ప్రచారంలోకి వచ్చే జుట్టు చికిత్సలు తీసుకోవడం సరికాదు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top